బ్రేక్ అయింది…ఫెవికాల్ కూడా పనిచేయదట

జగన్ చలో విశాఖ అంటున్నారు. దీని కోసం తెర వెనక జరగాల్సిన తతంగం జరిగిపోతోంది. జగన్ పెదవి విప్పలేదు కానీ కసరత్తు ముమ్మరంగా ఉంది. మరో వైపు [more]

Update: 2020-01-10 06:30 GMT

జగన్ చలో విశాఖ అంటున్నారు. దీని కోసం తెర వెనక జరగాల్సిన తతంగం జరిగిపోతోంది. జగన్ పెదవి విప్పలేదు కానీ కసరత్తు ముమ్మరంగా ఉంది. మరో వైపు మూడు రాజధానుల విషయంలో జగన్ గట్టి పట్టుదలగా ఉన్నారు. ఎక్కడా వెనక్కి తగ్గకూడదని కూడా ఆయన అనుకుంటున్నారు. ఎందాకైనా అన్నట్లుగా జగన్ దూకుడు ఉంది. ఇక చంద్రబాబు సవాళ్ళు కూడా జగన్ లో మొండితనాన్ని పెంచుతున్నాయని అంటున్నారు. దానికి తోడు అమరావతి రైతులు చేస్తున్న నిరసనలు, వారు ఏకంగా ప్రభుత్వం మీద సంధిస్తున్న బాణాలు కూడా వ్యవహారాన్ని చాలా దూరం తెచ్చేశాయని అంటున్నారు. మూడు రాజధానులు అని జగన్ ఇలా అసెంబ్లీలో అనగానే అలా రైతులు రంగంలోకి దిగిపోయారు. వారి వెనకాల నిత్యం జగన్ ని ద్వేషించే టీడీపీ, జనసేన ఉండడంతో ముఖ్యమంత్రికి మండుకొస్తోందని అంటున్నారు.

రాంగ్ స్టెప్పేనా…?

రైతులు తమ సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వంతో చెప్పుకోవాలి కానీ ఇలా రోడ్డెక్కి రచ్చ చేయడం, ఎమ్మెల్యేలపైన దాడులు చేయడం, మరో వైపు చంద్రబాబు దీన్ని పెద్ద జాతీయ సమస్య చేయాలని చూడడం వంటివి జగన్ సర్కార్ లో పంతాన్ని రెట్టింపు చేశాయని కూడా అంటున్నారు. నిజానికి రైతులు ఆందోళన చేయకపోయినా గొడవ ఇందాకా రాకపోయినా పునరాలోచనకు కొంత అవకాశం ఉండేదేమోకానీ ఇపుడు మాత్రం జగన్ ఎక్కడా తగ్గకూడదని గట్టిగానే అనుకుంటున్నారుట. దాంతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందన్నది అటు రైతులకు, ఇటు చంద్రబాబుకు బాగా తెలిసిపోయిందని అంటున్నారు.

మూకుమ్మడి రాజీనామాలు….

అమరావతిని మూడు ముక్కలు చేస్తూ జగన్ మంత్రివర్గంలో తీర్మానం ఇలా చేయగానే అలా తనతో పాటు మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలతో మూకుమ్మడి రాజీనామాలు చేయాలని చంద్రబాబు సీరియస్ గా ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆ మీదట ఎటూ అసెంబ్లీలో జగన్ ఈ విషయన్ని పెట్టి తనకు ఉన్న బలంతో ఆమోదించుకుంటారని, ఆ సమయంలో తాము ఉండి ప్రతిఘటించినా కూడా లాభం లేదని చంద్రబాబు అనుకుంటున్నారుట. అదే టైంలో అసెంబ్లీలో దీని మీద చర్చ కనుక వస్తే అమరావతి విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ తో పాటు గెజిట్ నోటిఫై చేయకపోవడం, తాత్కాలిక భవనాలు, అలాగే రాజధాని అన్నది లక్ష కోట్ల పై చిలుకు ఖర్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం వంటివి వైసీపీ ప్రశ్నలుగా సంధిస్తుందని, దానికి జవాబు చెప్పలేక రాష్ట్రం ముందు దోషిగా నిలబడాల్సివస్తుందని కూడా బాబు భావిస్తున్నారని టాక్. అంతే కాదు తన కలల రాజధానిని ముక్కలు చేస్తున్న వేళ తాను అసెంబ్లీలో ఉండి రికార్డులకు ఎక్కడం కూడా బాబుకు ఇష్టం లేదని అంటున్నారు.

రాజకీయ సంక్షోభం…

నిజానికి ఏపీలో టీడీపీ గెలిచింది 23 మంది, అందులో ఇద్దరు దూరంగా ఉన్నారు. మరి కొందరు కూడా పార్టీకి అంటీ ముట్టకుండా ఉన్నారు మిగిలిన వారిలో ఎందరు రాజీనామా చేస్తారో తెలియదు, ఒకవేళ బాబు మాట విని అందరూ చేసినా రాజ్యాంగ సంక్షోభం వస్తుందా అంటే రాదనే చెప్పాలి. అయితే ఇది జాతీయ స్థాయిలో పెద్ద ఇష్యూగా మారుతుంది. అపుడు కేంద్రం కూడా ఈ వైపుగా దృష్టి పెడుతుందని, రాజకీయంగా కూడా ఏపీలో హీట్ పెరుగుతుందని, 13 జిల్లాల జనాలకూ మొత్తంగా అమరావతి ఆవశ్యకత చెప్పేందుకు కూడా ఇది ఒక అవకాశంగా ఉంటుందని బాబు భావిస్తున్నారుట. ఆ మీదట వచ్చిన ఉప ఎన్నికల్లో మొత్తంగా గెలిచినా లేక సగానిక్ పైగా గెలిచినా అది నైతికంగా కూడా టీడీపీకి లాభంగా ఉంటుందని బాబు స్కెచ్ వేస్తున్నారుట. ఇపుడున్న పరిస్థితుల్లో రాజీనామాలు చేస్తే అన్ని సీట్లూ తిరిగి టీడీపీకే వస్తాయని కూడా బాబు అంచనా వేస్తున్నారుట. మొత్తానికి బాబు జగన్ మీద చివరి అస్త్రంగా మూకుమ్మడి రాజీనామాలు ప్రయోగిస్తారని అంటున్నారు. మరి అదే జరిగితే ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కడం ఖాయమే.

Tags:    

Similar News