ఆ మొక్కు తీర్చేసుకున్న జగన్… ?

వైఎస్ జగన్ అంటే మాట మీద నిలబడే వారు అని పేరు. ఆయన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో మొదటి నుంచి ఒకే మాట మీద ఉన్నారు. [more]

Update: 2021-05-21 12:30 GMT

వైఎస్ జగన్ అంటే మాట మీద నిలబడే వారు అని పేరు. ఆయన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో మొదటి నుంచి ఒకే మాట మీద ఉన్నారు. ఉక్కుని ప్రైవేట్ పరం చేయడం తగదనే అంటున్నారు. ఈ మేరకు ఆయన కేంద్రానికి రెండు సార్లు లేఖ రాశారు. అదే సమయంలో విశాఖ వచ్చి ఉక్కు కర్మాగారానికి సంబంధించి కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడి గట్టి భరోసా కూడా ఇచ్చారు. ఇక అసెంబ్లీ సమావేశం ఎపుడు జరిగినా ప్రైవేటీకరణకు వ్యతిరకంగా తీర్మానం చేస్తామని కూడా నాడు జగన్ చెప్పారు. ఆ ప్రకారం బడ్జెట్ సెషన్ లో తీర్మానం ఆమోదించారు.

అంతటితో సరా …?

మరి జగన్ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో చేయాల్సింది చేశారనే చెప్పాలి. అయితే అది తన పరిధిలో ఉన్నది మాత్రమే. అసెంబ్లీలో తీర్మానం అన్నది పెద్ద విషయం కాదు. అలాగే కేంద్రానికి లేఖలు రాయడం కూడా మామూలే. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీగా పెట్టుకుని మరీ ఉక్కు వంటి నష్టాలలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తామని అంటోంది. ఇందులో వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అంటోంది. మరి అలాంటపుడు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేస్తే సరిపోతుందా అన్నదే చర్చ.

అది చేయకపోతే …?

కరోనా తో ఇపుడు దేశమంతా కల్లోలంగా ఉంది. ఇది కాస్తా సద్దుమణిగాక జగన్ ప్రధాని నరేంద్ర మోడీతో అపాయింట్మెంట్ తీసుకుని అయినా అఖిల పక్ష బృందాన్ని వెంట తీసుకుని ఢిల్లీ వెళ్లాలి. అదే విధంగా కేంద్రంతో ఏదో రకంగా బతిమాలో బామాలో లేక గట్టిగానైనా చెప్పో ప్రైవేటీకరణ బాట నుంచి తప్పుకునేలా చూడాలి. ఒక వేళ ఈ విషయంలో కేంద్రం కొన్నాళ్ళు ఆగేలా చూసినా కూడా జగన్ విజయం సాధించినట్లే. దాని కోసం ఆయన తరువాత ప్రయత్నాలు మొదలుపెడితేనే విశాఖ ఉక్కు మీద వైసీపీ చిత్తశుద్ధి ఏంటి అన్నది తెలుస్తుంది.

క్రెడిట్ లేదా…?

ఇక ఉక్కు కర్మాగారం విషయంలో గొంతు చించుకున్న తెలుగుదేశం పార్టీ తీరా అసెంబ్లీలో తీర్మానం చేసే వేళకు బహిష్కరించింది. దాంతో ఉక్కు ప్రైవేటీకరణ తీర్మానానికి మేమూ కొంత ప్రయత్నం చేశామూ అని చెప్పుకోవడానికి లేకుండా పోయింది. దీనికి వైసీపీ వ్యూహం కూడా ఒక కారణం. కేవలం బడ్జెట్ పద్దుల ఆమోదం కోసమే సభ అని చెప్పారు. తీరా చూస్తే ఉక్కు విషయంలో తీర్మానంతో పాటు మరికొన్నింటిని కూడా ఆమోదించి టీడీపీకి ఝలక్ ఇచ్చారు. ఇంకో విషయం ఏంటి అంటే టీడీపీ కనుక సభకు వస్తే మరో రెండు రోజులు కూడా సమావేశాలు జరిపేవారుట. మొత్తానికి వైసీపీ ట్రాప్ లో టీడీపీ అడ్డంగా పడిపోయిందంతే.

Tags:    

Similar News