ఇక ఏడాదే సమయం.. టార్గెట్ రీచ్ కాలేరేమో?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అనుకున్నది అనుకున్నట్లు సాగడం లేదు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలనుకున్న జగన్ కు కరోనా వైరస్ ఇబ్బందిగా మారుతుంది. [more]

Update: 2021-05-24 06:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అనుకున్నది అనుకున్నట్లు సాగడం లేదు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయాలనుకున్న జగన్ కు కరోనా వైరస్ ఇబ్బందిగా మారుతుంది. 2022 జూన్ నాటికి ఖరీఫ్ సీజన్ కు పోలవరం ద్వారా నీటిని అందించాలని జగన్ భావించారు. ఈ మేరకు ఆయన ప్రకటన కూడా చేశారు. కాంట్రాక్టరును మార్చిన తర్వాత పనులు వేగంగానే జరుగుతున్నాయి. అయితే కరోనా వైరస్ తో మరోసారి పోలవరం పనులకు ఆటంకం ఏర్పడింది.

టీడీపీ హయాంలో….

పోలవరం ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. గత చంద్రబాబు ప్రభుత్వం తాము 70 శాతం పనులను పూర్తి చేశామని చెప్పుకుంది. పోలవరం సందర్శనకు రైతులను బస్సుల్లో తీసుకు వెళ్లి మరీ చూపించింది. ఇందుకు వంద కోట్ల వరకూ ఖర్చు చేసింది. అయినా చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదు. కానీ జగన్ వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలని భావించారు.

జగన్ అధికారంలోకి రాగానే..?

జగన్ అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టును మేఘా సంస్థకు అప్పగించారు. పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టాన్ని కూడా మెఘా సంస్థ పూర్తి చేసింది. స్పిల్ వే గేట్లను ఎత్తడానికి, దించడానికి వీలుగా హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్ల అమరికను పూర్తి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లని చెబుతున్నారు . జర్మనీ నుంచి వీటిని దిగుమతి చేసుకుంది. అయితే 2022 నాటికి పోలవరం పూర్తికావడంపై సందేహాలు నెలకొన్నాయి. జగన్ చెప్పిన ప్రకారం మరో ఏడాది మాత్రమే సమయం ఉంది. 2022 నాటికి పోలవరం ద్వారా ఖరీఫ్ సీజన్ కు నీళ్లు అందించకపోతే విపక్షాలు విమర్శలకు దిగుతాయి. తాము 70 శాతం పనులు పూర్తి చేసినా, జగన్ చేతకానితనం వల్లనే పోలవరం పూర్తి కాలేదని చంద్రబాబు జగన్ ను టార్గెట్ చేస్తారు.

కరోనా ఎఫెక్ట్….

అయితే కరోనా సెకండ్ వేవ్ పోలవరం పై పడింది. దాదాపు పదిమంది అధికారులు కరోనా బారిన పడ్డారు. కరోనా దెబ్బకు కూలీలు కూడా తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో పోలవరం ప్రాజెక్టు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ప్రస్తుతం స్పిల్ వే పనులు, కాఫర్ డ్యాం పనులు సాగుతున్నాయి. కానీ కరోనా కారణంగా జగన్ అనుకున్న సమయానికి పోలవరం ద్వారా నీటిని అందించే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఏడాది సమయంలో ఇది అసాధ్యమంటున్నారు.

Tags:    

Similar News