ఆ కిక్కు లేనిదే నిద్రపట్టదట

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ది ప్రత్యేక శైలి. సజావుగా ప్రభుత్వం నడుస్తున్నా ఆయనకు ఇష్టముండదులా అనిపిస్తుంది. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టి ఏడు [more]

Update: 2020-01-10 13:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ది ప్రత్యేక శైలి. సజావుగా ప్రభుత్వం నడుస్తున్నా ఆయనకు ఇష్టముండదులా అనిపిస్తుంది. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టి ఏడు నెలలు మాత్రమే అవుతుంది. అయితే ఈ ఏడు నెలల్లో ఎన్ని వివాదాలు, ఎన్ని ఆందోళనలు, ఎన్ని అరెస్ట్ లు… వీటన్నింటినీ వైఎస్ జగన్ తెచ్చిపెట్టుకున్నవే. జగన్ నిర్ణయాలతోనే ఈ సమస్యలు వచ్చాయి. అవే లేకుంటే పాలన సజావుగా సాగిపోయేది.

ఇసుక వ్యవహారంలోనూ…..

జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తొలినాళ్లలో ఇసుక పాలసీని రద్దు చేశారు. ఇసుక పాలసీ రద్దు కావడం, సరఫరాను నిలిపివేయడంతో సమస్య తీవ్రమైంది. భవన నిర్మాణ కార్మికులు వీధిన పడ్డారు. దీంతో విపక్ష పార్టీలకు ఆయుధం చిక్కినట్లయింది. చంద్రబాబు ఇసుక కోసం ఒక రోజు దీక్ష చేస్తే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏకంగా విశాఖలో లాంగ్ మార్చ్ చేశారు. నిజానికి పాత ప్రభుత్వం అనుసరించిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేయకుండా కొత్త పాలసీని తీసుకొస్తే ఈ సమస్య తలెత్తేది కాదు. ఇప్పుడు ఇసుక సమస్య పెద్దగా లేదు.

ఇంగ్లీష్ మీడియంపైనా….

ఇక ఇంగ్లీష్ మీడియంపైనా అదే స్థాయిలో జగన్ పై విమర్శలు విన్పించాయి. నిజానికి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టడం మంచి నిర్ణయమే. దానిని ఎవరూ కాదనలేరు. అయితే తెలుగుమీడియం లేకుండా ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడతామని ప్రకటించడమే వివాదానికి కారణమయింది. చివరకు తెలుగుమీడియం ఉంటుందని తేల్చేయడంతో ఈ సమస్య కు కూడా తెరపడింది. ఇలా ఇసుక, ఇంగ్లీష్ మీడియం సమస్యలు జగన్ తనంతట తాను కొని తెచ్చుకున్నవే. ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లడానికి ఈ రెండు అంశాలు ఉపయోగపడ్డాయి.

ప్రస్తుతం రాజధాని….

మరో కీలక నిర్ణయం మూడు రాజధానుల ప్రతిపాదన. అసెంబ్లీ సమావేశాల్లోనే జగన్ ప్రకటించడం తొందరపాటేనని వైసీపీ నేతలు సయితం అంగీకరిస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన మంచిదే అయినా సున్నితమైన అంశం కావడంతో ల్యాండ్ చేయడంలో జగన్ ఫెయిలయ్యారన్నది వైసీపీ ఎమ్మెల్యేలు సయితం అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు రాజధాని అంశం ఏపీలో నడుస్తుంది. అసలు జగన్ కు ఏదో ఒక సమస్య లేకుంటే నిద్రపట్టదన్న సెటైర్లు కూడా విన్పిస్తున్నాయి. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జగన్ కు ఆ పొలిటికల్ కిక్కు ఉండాల్సిందేనంటున్నారు జగన్ ను బాగా ఎరిగిన వారు. ఏడు నెలల నుంచి ఏపీలో ఏదో ఒక అంశంపై ఉద్యమాలు జరుగుతూనే ఉండటాన్ని ఈ సందర్భంగా కొందరు ఉదహరిస్తున్నారు. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటానన్న జగన్ కాంట్రవర్సీలకు మాత్రం కేరాఫ్ గా నిలుస్తున్నారని చెప్పక తప్పదు.

Tags:    

Similar News