సక్సెస్ మంత్ర తెలిసిందా ?

ఓట్ల పంట పండుతుంది అనుకుంటే నేతలు ఎంతో చేస్తారు. ఎవరికైనా కావాల్సింది జనాల నుంచి నాలుగు ఓట్లు పొందడం, పది కాలాల పాటు పదవిలో కొనసాగడం. ఆ [more]

Update: 2021-05-08 12:30 GMT

ఓట్ల పంట పండుతుంది అనుకుంటే నేతలు ఎంతో చేస్తారు. ఎవరికైనా కావాల్సింది జనాల నుంచి నాలుగు ఓట్లు పొందడం, పది కాలాల పాటు పదవిలో కొనసాగడం. ఆ విధంగా ఆలోచిస్తే కనుక జగన్ కి ఇపుడు విజయ సూత్రం ఏంటో అర్ధమైపోయిందిట. రెండేళ్ళుగా తాను వరసగా విజయాలు అందుకోవడం వెనక జనాల మద్దతు ఉంది. దాని వెనక సంక్షేమ పధకాలు కూడా ఉన్నాయి. దాంతో ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ సంక్షేమ బాట వీడకూడదు అని పెద్ద శపధమే చేస్తున్నారుట.

అవే చెప్పాయా…?

బెంగాల్, కేరళలలో ముఖ్యమంత్రులు ఒకటి కంటే ఎక్కువ సార్లు గెలిచారు. మమత సొంత పార్టీ అధినేత అయితే, కేరళ సీఎం పినరయ్ విజయన్ కమ్యూనిస్ట్ పార్టీలో కీలక నేత. అయినా సరే కేరళ వరకూ ఆయనే సర్వాధికారి. దాంతో తనకు తోచిన విధంగా కార్యక్రమాలు చేపట్టి ప్రజలను మంచి చేసుకుని ఆయన గెలిచారు. మమత రూట్ మాస్ రూట్. ఈ రెండే ఇపుడు జగన్ కి విపరీతంగా ఆకట్టుకున్నాయని అంటున్నారు. వారు గెలవడం వెనక సంక్షేమ పధకాలతో పాటు అభివృద్ధి ఉన్నా జగన్ మాత్రం సంక్షేమమే గట్టెక్కిస్తుంది అని గట్టిగా నమ్ముతున్నారుట.

ముందుందిగా…?

ఇక జగన్ రెండేళ్ల పాటు అప్పులు చేసి మరీ సంక్షేమ రధాన్ని లాగారు. కానీ ఇంకా మూడేళ్ళ కాలం మిగిలి ఉంది. ఆయన అనుకున్నట్లుగానే సంక్షేమ పధకాలను కొనసాగించాలన్నా కూడా నిధుల కొరత వెంటాడుతుంది. కానీ జగన్ మాత్రం మొండి ధైర్యంగానే ఉన్నారు. అవసరం అయితే ప్రభుత్వ భూములు అమ్మి అయినా లేక ఆస్తులు కుదువ పెట్టి అయినా జనాలకు పధకాలను ఇవ్వాల్సిందే అని ఆలోచిస్తున్నారుట. ఈ విషయంలో ఎవరు చెప్పినా ఆయన వినే సీన్ కూడా ఉండదు అంటున్నారు.

వర్కౌట్ అవుతుందా…?

జనాలు సంక్షేమానికే ఓటు వేస్తారా. ఆ విధంగా జరిగితే 1989 ఎన్నికల్లో ఎన్టీయార్ ఎందుకు ఓడారు అన్నది కూడా ప్రశ్నగా వస్తుంది. ఎన్టీయార్ చరిష్మా కూడా గొప్పది కదా. మరి జగన్ సంక్షేమాన్ని నమ్ముకుని వచ్చే ఎన్నికల్లో ఒడ్డుకు చేరుదామంటే కుదిరే పనేనా అన్నదే చూడాలి. నాటికి పరిస్థితులు కూడా ఎలా ఉంటాయో కూడా ఎవరికీ తెలియదు. ప్రభుత్వం పట్ల మోజు ఉంటేనే ఏ పధకం పెట్టినా చెల్లేది, మోజు తీరాక ఓటర్లకు కూడా వెగటు పుట్టినా ఆశ్చర్యం లేదు. అయినా జగన్ కి నగదు బదిలీ పధకాల మీద మాత్రం చెడ్డ నమ్మకమే ఉంది. మరి జగన్ మళ్ళీ మళ్ళీ తాను గెలవాలని అనుకుంటున్నారు. అయితే ఇలా ఖజానాకు చిల్లు పెట్టి చిల్లరను పంచిపెడితే ఆ వరస విజయాలు దఖలు పడతాయా. చూడాలి. ఏది ఏమైనా జగన్ ఏపీలో సరికొత్త రాజకీయ ప్రయోగమే చేయబోతున్నారు అని అర్ధమవుతోంది. దాని ఫలితం ఆయనతో పాటు రాజకీయ మేధావులకు కూడా ఆసక్తిని పెంచేదే.

Tags:    

Similar News