సీమలో “రియాక్షన్” ఇలా ఉంటుందా?

మూడు రాజ‌ధానుల ప్రక‌ట‌న‌తో సీఎం జ‌గ‌న్ ఒక్క‌సారిగా రాష్ట్రంలో రాజ‌కీయాల‌ను వేడెక్కించారు. మూడు రాజ‌ధానులు కాదు ముప్పై రాజ‌ధానులు ఉంటే త‌ప్పేంట‌ని మంత్రులు అంటున్నారు. దీంతో ప్రతిప‌క్షాలు [more]

Update: 2020-01-12 02:00 GMT

మూడు రాజ‌ధానుల ప్రక‌ట‌న‌తో సీఎం జ‌గ‌న్ ఒక్క‌సారిగా రాష్ట్రంలో రాజ‌కీయాల‌ను వేడెక్కించారు. మూడు రాజ‌ధానులు కాదు ముప్పై రాజ‌ధానులు ఉంటే త‌ప్పేంట‌ని మంత్రులు అంటున్నారు. దీంతో ప్రతిప‌క్షాలు మండి ప‌డుతున్నాయి. అమ‌రావ‌తిని క‌ష్టమో న‌ష్టమో ఎంచుకున్నాం కాబ‌ట్టి అక్కడే కొన‌సాగించాల‌ని వారు ప‌ట్టుబ‌డుతున్నారు. అయితే, అమ‌రావ‌తిని అభివృద్ది చేయ‌డం ద్వారా కేవ‌లం ఒక ప్రాంతంలోనే అభివృద్ధి పోగుప‌డుతుంద‌ని, దీంతో రాబోయే రోజుల్లో ప్రాంతీయ విభేదాలు, రాష్ట్రాల ఏర్పాటు వంటివి తెర‌మీదికి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, దీనిని నివారించేందుకు రాష్ట్రంలో స‌మాన అభివృద్ధిని ప్రోది చేసేం దుకు మూడు రాజ‌ధానులే స‌రైన చ‌ర్య అని అధికార పార్టీ చెబుతోంది.

హైకోర్టు ఏర్పాటుతో…..

ఈ క్రమంలోనే క‌ర్నూలులో న్యాయ రాజ‌ధానిని ఏర్పాటు చేయ‌డంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రధాన హైకోర్టును క‌ర్నూలులో ఏర్పాటు చేసిన అమ‌రావ‌తిలోను, విశాఖ‌లోను బెంచీల‌ను ఏర్పాటు చేయాల‌ని సంక‌ల్పించింది. దీనికి అనుగుణంగానే జీఎన్ రావు, బీసీజీ నివేదిక‌లు కూడా వ‌చ్చాయి. దీంతో ప్రభుత్వం దీనిపై కేబినెట్‌లో చ‌ర్చించి, అసెంబ్లీలో తీర్మానం చేసిన ముందుకు సాగాల‌ని నిర్ణయించుకుంది. అయితే, ఈ ప్రక‌ట‌న‌పై క‌ర్నూలులో కొంత ఆనందం అదే స‌య‌మంలో ఆవేద‌న కూడా వ్యక్తమ‌వుతోంది.

ఒరిగేదేమీ లేదంటున్న…..

హైకోర్టు ఏర్పాటుతో మాకు ఒరిగేది ఏంట‌ని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అదే స‌మ‌యంలో కొన్ని పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కూడా హైకోర్టు వ‌ల్ల క‌ర్నూలు అభివృద్ది చెంద‌ద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో క‌ర్నూలులో మ‌రో రాజ‌ధాని లేదా ప్రత్యేక రాష్ట్రంగా విభ‌జించి, కశ్మీర్ మాదిరిగా రాజ‌ధానితో కూడిన‌ కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాల‌ని ఇక్కడి నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక‌, సీమ జిల్లాల‌కే చెందిన జ‌గ‌న్ ను కూడా రాజ‌కీయంగా టార్గెట్ చేస్తున్నారు. సీమ ప్రాంతం నుంచి సీఎంలుగా చేసిన ఎవ‌రూ కూడా ఇక్కడ అభివృద్దిని ప‌ట్టించుకోలేద‌ని అంటూనే జ‌గ‌న్ మ‌రింత‌గా ఈ ప్రాంతాన్ని అణిచి వేసేందుకు ప్రాముఖ్యం ఇస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. దీనిలో భాగంగానే విశాఖ‌ను ఎంపిక‌చేస్తున్నార‌ని, దీనివ‌ల్ల రాజ‌ధాని ప్రాంతానికి సీమ జిల్లాల‌కు మ‌ద్య దూరం పెరిగిపోయి.. ప్రజ‌లు ఇబ్బంది ప‌డ‌తార‌ని, త‌మ‌ను ప‌క్కనే ఉన్న రాష్ట్రాల్లో అయినా క‌లిపేయ‌డం ఉత్తమ‌మ‌ని వారు పేర్కొంటున్నారు. దీంతో జ‌గ‌న్‌కు ఈ వ్యాఖ్యల‌ను ఎదుర్కొని, త‌న వ్యూహాన్ని సాకారం చేసుకుని, ఇక్కడ ప్రజ‌ల మ‌న‌సులు గెల‌వ‌డం క‌ష్టమేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News