జగన్ మరో కీ డెసిషన్

మెల్లగా విశాఖ వైపుగా జగన్ షిఫ్ట్ అవుతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు తెర వెనక చకచకా సాగిపోతున్నాయి. విశాఖకు అన్ని రకాలైన మౌలిక సదుపాయాలు కల్పించమంటూ రివ్యూ [more]

Update: 2020-01-07 06:30 GMT

మెల్లగా విశాఖ వైపుగా జగన్ షిఫ్ట్ అవుతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు తెర వెనక చకచకా సాగిపోతున్నాయి. విశాఖకు అన్ని రకాలైన మౌలిక సదుపాయాలు కల్పించమంటూ రివ్యూ మీటింగులో అధికారులను సూచించిన జగన్ ఇపుడు మరో అడుగు ముందుకేసి రిపబ్లిక్ డే వేడుకలు కూడా విశాఖలోనే నిర్వహించాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 26న జరిగే ఈ వేడుకలకు అన్ని రకాల ఏర్పాటు చేయాలని మౌఖిక ఆదేశాలు ఇప్పటికే ఆయా శాఖలకు వచ్చాయని అంటున్నారు.

అప్పటి నుంచే ….

నిజానికి జగన్ సర్కార్ గత ఏడాది ఆగస్ట్ 15న జరిగే స్వాతంత్ర దినోత్స వేడుకలను కూడా విశాఖలో నిర్వహించాలనుకుంది. అయితే సమయాభావం వల్లనో, మరే కారణాల వల్లనో ఆ ప్రతిపాదన అప్పట్లో అలా ఆగిపోయింది. అంటే అప్పటి నుంచే జగన్ కి విశాఖ రాజధాని అన్న ఆలోచన ఉందా అన్న చర్చ ఇపుడు ముందుకు వస్తోంది. విశాఖ విషయంలో ప్రత్యేక దృష్టిని, శ్రధ్ధను చూపిస్తున్న జగన్ దానికి తగినట్లుగా అభివృధ్ధి పనులను కూడా వేగవంతం చేయాలని ఈ మధ్య తరచూ అధికారులకు చెప్పడంతో విశాఖ రాజధానికి కావాల్సిన అన్ని హంగులనూ మెల్లగా సమకూరుస్తున్నారని అంటున్నారు.

భీమిలీలోనా…?

విశాఖలో రిపబ్లిక్ వేడుకలు ఎక్కడ నిర్వహించాలన్న దానిపైన కూడా అధికారులు సీరియస్ గా చర్చిస్తున్నారు. విశాఖ ఆర్కే బీచ్ వద్ద కానీ, భీమిలీలో కానీ ఈ వేడుకలు జరపాలని అధికారులు ఆలోచిస్తున్నారుట. ప్రభుత్వం అయితే భీమిలీలో జరిపేందుకు ఉత్సాహం కనబరుస్తోంది. ఇదిలా ఉండగా రిపబ్లిక్ డే అంటే ప్రభుత్వ అభివృధ్ధి శకటాల ప్రదర్శన వంటివి ఉంటాయి. దాని కోసం విశాలమైన వేదికనే చూడాలని అధికారులు అనుకుంటున్నారు. వైసీపీ సర్కార్ సైతం అందరీకీ అందుబాటులో ఉండేలా వేదికను ఎంపిక చేయాలని సూచిస్తోంది.

ఇంటర్నేషనల్ సెమినార్….

ఇక వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక మొదటి అంతర్జాతీయ సదస్సుని విశాఖలో నిర్వహిస్తున్నారు. ఈ నెల 24న విశాఖ వేదికగా స్మార్ట్ సిటీల సదస్సు నగరంలో జరుగుతుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా జగన్ హాజరవుతారని అంటున్నారు. ఈ సదస్సుకు వంద మంది స్మార్ట్ సిటీల ప్రతినిధులు దేశ విదేశాల నుంచి హాజరవుతారని తెలుస్తోంది. ఈ సదస్సు నుంచి జగన్ విశాఖ అభివృధ్ధికి సంబంధించిన కీలకమైన ప్రకటనలు చేస్తారని కూడా భావిస్తున్నారు. మొత్తానికి విశాఖను అన్ని విధాలుగా అభివృధ్ధి చేయాలన్న ఉద్దేశ్యాల వెనక రాజధాని రాజసం రప్పించాలన్న గట్టి అజెండా ఉందని అంటున్నారు. అన్నీ కలసి వస్తే మరో మూడు నెలల వ్యవధిలో విశాఖ రాజధానిగా అధికారికంగా ముద్ర వేసుకుంటుందని కూడా అధికార వర్గాల సమాచారంగా ఉంది. చూడాలి మరి.

Tags:    

Similar News