సైకిల్ కి ఏ కీలు కా కీలు తీసేసి…?

ఏపీలో టీడీపీ సైకిల్ కి పెద్ద రిపేర్లే అవసరం పడుతున్నాయి. దాని కోసం సైకిల్ యజమాని చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారు. అయినా ఆ సైకిల్ ఇవాళా [more]

Update: 2021-04-19 06:30 GMT

ఏపీలో టీడీపీ సైకిల్ కి పెద్ద రిపేర్లే అవసరం పడుతున్నాయి. దాని కోసం సైకిల్ యజమాని చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారు. అయినా ఆ సైకిల్ ఇవాళా నిన్నా తెచ్చుకున్నది కాదుగా. అది వచ్చి నాలుగు దశాబ్దాలు అయిపోయింది. బాగా వాడకం చూసేసి ఇపుడు మూలకు చేరిపోతోంది. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు అసలు పట్టించుకోని ఫలితమే ఇపుడు సైకిల్ కి పెద్ద రిపేర్లు చేయాల్సి వస్తోంది అంటున్నారు. మళ్ళీ ఏపీలో సైకిల్ దూసుకుపోతుందా, గిర్రున తిరిగే ఫ్యాన్ చక్రాలకు పోటీగా దూకుడు చేసి అసెంబ్లీ గేట్లు దాటుకుని లోనికి వెళ్తుందా అన్నది పెద్ద చర్చగానే ఉంది.

ఇక నో చాన్స్ ….

అయితే సైకిల్ కి ఇప్పటి నుంచి మరమ్మతులు చేస్తే 2024 నాటికి రెడీ అవుతుంది. మరి చంద్రబాబు రిపేర్లు చేస్తూ ఉంటే జగన్ చూస్తూ ఊరుకుంటారా. అందుకే ఈసారి నో చాన్స్ అంటున్నారుట. సైకిల్ కి ఏ కీలుకు ఆ కీలు విరిచేసి షెడ్డులో తోసేయడానికి భారీ యాక్షన్ ప్లానే జగన్ రెడీ చేసి పెట్టుకున్నారుట. ఏపీలో అన్ని ఎన్నికల్లో ఢంకా భజాయించి ఇప్పటికే వైసీపీ తానేంటో రుజువు చేసుకుంది. తిరుపతి ఉప ఎన్నికలో కూడా విజయం ఖాయం. మెజారిటీ మీద ఇపుడు అందరి చూపూ ఉంది. మంచి మెజారిటీ వస్తుందని వైసీపీ నేతలు గట్టి విశ్వాసంతో ఉన్నారు. దానితో పాటు టీడీపీ ఓట్లు దారుణంగా తగ్గుతాయని కూడా లెక్కలు చెబుతున్నారు. మరి తిరుపతి ఫలితంతోనే టీడీపీ జాతకాన్ని కూడా తిరగరాయాలని జగన్ ఆలోచిస్తున్నారని టాక్.

మడి కట్టుకోవడాలు లేవు…?

ఫిరాయింపులు చేసిన వారు ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేయాలని కొత్తగా సీఎం అయినపుడు నిండు సభలో జగన్ చెప్పారు. కానీ ఈసారి అలాంటి మడీ మర్యాద కబుర్లు అసలు చెప్పరు అంటున్నారు. చంద్రబాబు లాంటి వారికి వారి మార్క్ రాజకీయంతోనే దెబ్బేస్తెనే సబబుగా ఉంటుందని జగన్ భావిస్తున్నారుట. అందువల్ల కచ్చితంగా టీడీపీ నుంచి భారీ ఎత్తున ఎమ్మెల్యేలను గోడ దాటించేందుకు జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లుగా ప్రచారం అవుతోంది. అదే జరిగితే అర్జంటుగా చంద్రబాబు ప్రతిపక్ష నేత ఉద్యోగం ఊడడం ఖాయం. ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా రమ్మంటే చాలా మంది తమ్ముళ్ళు దూకేందుకు రెడీగా ఉన్నారని టాక్. ఈ భారీ ఆపరేషన్ కి తిరుపతి ఫలితాల తరువాత ముహూర్తం ఖరారు చేశారని అంటున్నారు.

దిగ్గజ నేతలూ ఇటే …..

ఇక ఈసారి జగన్ చేయబోయే ఆపరేషన్ తో టీడీపీ పెద్దలకు దిమ్మతిరిగి బొమ్మ కనబడుతుంది అంటున్నారు. కనీసంగా అర డజన్ ఎమ్మెల్యేలతో పాటు ఏపీలోని వివిధ జిల్లాలలోని గట్టి నాయకులు అయిన మాజీ మంత్రులు పలువురు వైసీపీలో చేరేందుకు టచ్ లో ఉన్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. చీటికీ మాటికీ తనను తిట్టడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబుకు తానేంటో చూపించడానికే జగన్ సిధ్ధంగా ఉన్నారని అంటున్నారు. ఈ మధ్యన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూడా జగన్ మంచితనం వల్లనే బాబు ఆటలు సాగుతున్నాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బాబు వంటి వారి విషయంలో మంచితనం అసలు కూడదు అన్నదే వైసీపీ పెద్దల వాదన. దానికి జగన్ కూడా ఇపుడు మద్దతు ఇస్తున్నారట. మొత్తానికి తిరుపతి ఉప ఎన్నిక ఫలితాల తరువాత ఏపీలో రాజకీయ ప్రకంపనలే అంటున్నారు. దాంతో బాబు వట్టి ఎమ్మెల్యేగానే మిగిలిపోవడం ఖాయమని చెబుతున్నారు.

Tags:    

Similar News