మన దగ్గర బేరాల్లేవమ్మా…!!

ఏరా హైదరాబాద్ నేనే కట్టాను అన్నట్టు రేపు అమరావతి కూడా నేనే కట్టాను అంటారు… ఈ ఐదేళ్లు అప్పోసప్పో చేసి మా వాడు కడితే అప్పుడు మేమేం [more]

Update: 2020-01-05 05:00 GMT

ఏరా హైదరాబాద్ నేనే కట్టాను అన్నట్టు రేపు అమరావతి కూడా నేనే కట్టాను అంటారు… ఈ ఐదేళ్లు అప్పోసప్పో చేసి మా వాడు కడితే అప్పుడు మేమేం చేయాలన్నాడు ఓ మిత్రుడు….. అంతేలే అయినా రాజధానిని రెండు పార్టీలు… రెండు కులాల యవ్వారం అయ్యాక ఎవరు మాత్రం ఏమి చేయగలరు అన్నాను.

రాజకీయమే అసలు ప్రయోజనం….

అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత వరుసగా జీఎన్ రావు కమిటీ నివేదిక., బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ రిపోర్ట్‌….తర్వాత హైపవర్ కమిటీ ఇవన్నీ చూశాక ప్రభుత్వ ఆలోచన స్పష్టమైంది.ఆయన మదిలో ఉన్న ఆలోచనే ఆచరణలోకి రానుంది. నాలుగేళ్ల తర్వాత రాజధాని అమరావతి నుంచి శాశ్వతంగా విశాఖ తరలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. చివరి నిమిషంలో ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప ఈ నిర్ణయంలో పెద్దగా మార్పులు ఏమి ఉండకపోవచ్చు. అమరావతిలో రాజధాని ఉంచడం వైసీపీ అధినేతకు ఏ మాత్రం రుచించకపోవడంలో చాలాకారణాలు ఉన్నాయి. వాటిలో ఒప్పుకున్నా., ఒప్పుకోకున్నా ప్రధాన కారణం కులం అయితే., మరొకటి భవిష్యత్ రాజకీయం…. పైకి మాత్రం అప్పుల భారాన్ని, సాంకేతిక సమస్యల్ని నివేదికలు సాకుగా చూపుతున్నాయి.

సామాన్యులకు మాత్రం…..

“రాజధాని అనకాపల్లి అయినా., అనంతపురం అయినా., అమరావతి అయినా నిజానికి సామాన్య జనానికి పెద్దగా దానితో సంబంధం లేని వ్యవహారం”.. ప్రభుత్వ ఉద్యోగులు ప్రధానంగా సచివాలయం., హెచ్‌ఓడిలు., కమిషనరేట్‌లలో పనిచేసే వారికి తప్ప రాజధాని నగరంతో సామాన్య జనానికి ఎప్పుడో తప్ప ఏ అవసరం రాదు. అమరావతిలో వేలాది ఎకరాలను రాజధాని కోసం సమీకరించినపుడు సంపదను సృష్టించడంతో పాటు దానిని ఒకే చోట పోగయ్యేలా చేశారు.అది సమాజ ప్రయోజనాల కోణంలో కాకుండా కొద్ది మంది సమూహ ప్రయోజనాల లక్ష్యంగా జరిగింది అనేది ప్రధాన ఆరోపణ… అదే సమయంలో అమరావతిలో ఉపాధి రంగాన్ని పూర్తిగా విస్మరించారు. అరవై ఏళ్లలో పొట్ట చేతపట్టుకుని ఉమ్మడి రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్‌ నగరానికి అన్ని జిల్లాల నుంచి తరలి వెళ్లారు. విభజన తర్వాత కొత్త రాజధాని అమరావతి తరలిన తర్వాత మాత్రం ఏపీలోని 13జిల్లాల నుంచి ఉపాధి కోసం రాజధానికి రాలేకపోయారు.

ఉపాధి ఏదీ?

దీనికి మొదటి కారణం అక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడం అయితే., రెండో కారణం రాజధాని ప్రాంతంలో కొత్తగా వెలసిన ప్రైవేట్ సేవా రంగం., కాంట్రాక్ట్‌-ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను తమ వారికి కట్టబెట్టుకోడానికి పాలకులు, పెట్టుబడి వర్గాలు ప్రాధాన్యం ఇచ్చాయి. అందుకే ఇప్పటికీ ఉద్యోగాల కోసం ఉత్తరాంధ్ర., సీమల నుంచి కూడా హైదరాబాద్‌., బెంగుళూరు వెళుతున్నారే తప్ప అమరావతి రావడం లేదు. అమరావతిగా చెప్పుకునే విజయవాడ-గుంటూరు నగరాల్లో అవకాశాలు లేకపోవడం ఓ కారణం అయితే సామాజిక సంకుచితత్వం మరో ప్రధాన కారణం. వెలగపూడిలో ఉన్న అసెంబ్లీ., సచివాలయాలను చూస్తే ఈ విషయం అర్ధం అవుతుంది. ఆంధ్రాలో జీతాలు తీసుకుంటూ హైదరాబాద్‌లో పన్నులు చెల్లించే ఉద్యోగులు., ఇతర వ్యాపార, పారిశ్రామిక వర్గాలు అమరావతిని ఓ ఆదాయ మార్గం కోణంలోనే చూశారు. జీవన ప్రమాణాలు., సౌకర్యాలు లేవనే నిట్టుర్పూలు, ఉక్కపోత ఏమిటీ వాతావరణం అనే అసహనం తరచూ వినిపించేవి. శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే ఉద్యోగులు సోమవారం మధ్యాహ్నం నాటికి కాని వెలగపూడిలో ఇప్పటికీ దర్శనమివ్వరు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారానికి ఐదురోజుల పనిదినాలు., ట్రాన్సిట్ బసలతో నాలుగేళ్లుగా నెట్టుకొచ్చేస్తున్నారు. ఉద్యోగులకు సంబంధించి రాజధాని అంశం జీవో 134లో పేర్కొన్నట్టు రీ లొకేట్ అయినట్టు మాత్రమే… ఇప్పుడు వాళ్లకు పూర్తి స్థాయి HRA విశాఖలో సులువుగా వచ్చేస్తుంది. చాలామంది శాఖధిపతులు, ఉన్నత అధికారులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. వీకెండ్ లైఫ్, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదని హైదరాబాద్, ఢిల్లీ చక్కర్లు కొట్టే ఆఫీసర్లకు కూడా ఇది తెలుసు.

బంగారం పండే భూముల్లో….

“హైదరాబాద్‌ నుంచి అమరావతి ప్రాంతానికి తరలించిన సమయంలో మాజీ సీఎం చేసిన ఓ వ్యాఖ్య గుర్తు చేసుకోవాలి. 'విజయవాడ చుట్టు పక్కల ప్రాంతాలైతే ఇలా భూసమీకరణ చేయగలిగే వారిమేనా అన్నది' ఆయన వ్యక్తం చేసిన సందేహం. విజయవాడలో అయితే 33వేల ఎకరాలు కాదు కదా కనీసం 300ఎకరాలను కూడా సమీకరించలేకపోయేవారు. ఏటి అవతల ఉన్న ఉండవల్లి., పెనుమాక 2014నాటికే విజయవాడలో భాగమైపోవడంతో అక్కడి రైతులకు రాజధాని ప్రకటన పెద్ద ఆసక్తి కలిగించలేదు. మిగిలిన రాజధాని గ్రామాల్లో భూమి విలువ అనూహ్యంగా పెరిగిపోయింది. 5-10లక్షల్లోపు ఖరీదు చేసే భూమికి కోట్ల రుపాయల ధర లభించింది. బంగారం పండే భూముల్లో రాజధాని రూపంలో భారీ సంపద వారి సొంతమైంది. ఇప్పుడు దానిని లాగేసేప్రయత్నాలు సహజంగానే వారి ఆక్రోశానికి కారణమవుతున్నాయి.

కారకులు ఎవరు….?

అమరావతి రూపంలో సంపదను సృష్టించడం మీదే దృష్టి పెట్టిన చంద్రబాబు, దానిని అందరికి పంచడాన్ని మాత్రం మరచిపోయారు. ఇక్కడి జనంలో ఉండే సంక్లిష్టమైన ఆలోచనా ధోరణి బయటి వారిని సహజంగానే భయపెట్టడంతో పాటు అపనమ్మకాన్ని సృష్టిస్తుంది. ఈ పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో జగన్మోహన్‌ రెడ్డికి ప్రజలు పట్టం కట్టారు. అధికారంలోకి వచ్చిన జగన్ ముందు రెండు ఆప్షన్లు ఉంటే‌…. చంద్రబాబు నాయుడు ప్రారంభించిన నగరాన్ని కొనసాగించడం., ఇక్కడి నుంచి తరలించడం ఆప్షన్లు అవుతాయి. నాలుగేళ్లలో దాదాపు 9వేల కోట్ల రుపాయలు ఖర్చు పెట్టి రాజధాని కోసం చేసిన నిర్మాణాలను జగన్‌ మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లలో కొనసాగించాల్సి ఉంటుంది. అందుకు మరో పదివేలు ఖర్చు పెట్టాల్సి ఉంటుందనుకున్నా, 2024లో ఎవరు అధికారంలోకి వస్తారనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.

టైం ఇంకా ఉందనేనా?

ఆ తర్వాత వైసీపీ “అధికారంలోకి వచ్చినా, రాకపోయినా అమరావతి ఎప్పటికీ చంద్రబాబు నిర్మించిన నగరమే అవుతుంది తప్ప అందులో జగన్‌ పాత్ర ఏమి చరిత్రలో మిగలదు” రాజకీయంగా తనకు ఏమాత్రం ఉపయోగపడని రాజధానిని అంటిపెట్టుకోవడం కంటే తొలి ఏడాది తరలిస్తే ఐదో ఏడాది ఎన్నికల నాటికి జనం మర్చిపోతారని ఆయన ఆలోచన కావొచ్చు. ఇక్కడ జగన్ ఆలోచన అంత సులువు కాకపోవచ్చు. హైదరాబాద్‌లో సచివాలయ భవనాల కూల్చివేతల విషయంలోనే ఎన్ని చిక్కులు ఎదురవుతున్నాయో కళ్లెదుట కనిపిస్తున్నాయి. అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు 2500 కోట్లు ఇచ్చింది. వీటిలో విజయవాడ-గుంటూరు యూజీడీలకు కాకుండా అచ్చంగా రాజధానికి ఇచ్చిన నిధులు 1500కోట్లు ఉన్నాయి. స్మార్ట్‌ సిటీ., అమృత్ వంటి పథకాల్లో వచ్చిన డబ్బుంది. మళ్లీ రాజధాని మారిస్తే అయ్యే ఖర్చును ఎవరు భరించాలనే ప్రశ్న ఎదురు అయితే అందుకు సహేతుకమైన సమాధానం రాష్ట్రం చెప్పాల్సి ఉంటుంది.ఈ వ్యవహారంలో బాధితులు., పౌరసంఘాలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే ఈ సమస్య జటిలం అవుతుంది.

– శరత్, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News