జగన్ తొందరపాటే కారణమా?

జగన్ అంటేనే ముక్కుసూటి మనిషి అంటారు. అది ఆయన్ని పదేళ్ళుగా గమనించేవారికి అర్ధమయ్యే విషయమే. జగన్ లో రాజకీయం బొత్తిగా లేదని, ఆయనకు అసలు లౌక్యం తెలియదని [more]

Update: 2020-01-05 15:30 GMT

జగన్ అంటేనే ముక్కుసూటి మనిషి అంటారు. అది ఆయన్ని పదేళ్ళుగా గమనించేవారికి అర్ధమయ్యే విషయమే. జగన్ లో రాజకీయం బొత్తిగా లేదని, ఆయనకు అసలు లౌక్యం తెలియదని అంటారు. అది కూడా నిజమే. ఎందుకంటే ఓ వైపు కొండ లాంటి తండ్రిని కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న వేళ ఎవరైనా కాంగ్రెస్ అన‌కొండతో ఢీ కొంటారా? జగన్ ఆ పని చేయడంలోనే ఆయనకు ఎటువంటి ఎత్తులు జిత్తులు తెలియవు అన్నది అర్ధమైపోతోంది. ఇక జగన్ కి తాను సొంతంగా కష్టపడడమే కాకుండా జనంలో ఉన్న ఇమేజ్, సానుభూతి అన్నీ కలసి సీఎం సీటుని అందించాయి. ఏడు నెలల పాలనలో జగన్ ఎత్తుగడలు లేకపోవడం వల్లనే కొన్ని సార్లు విపక్షానికి దొరికిపోయారు. ఇపుడు కూడా కీలకమైన రాజధాని మార్పు విషయంలో జగన్ తొందరపడి రచ్చ చేసుకున్నారని మేధావులు అంటున్నారు.

ఆగి ఉంటే బాగుండేదా?

జగన్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు చివరి రోజున రాజధాని అంశం ప్రస్తావనకు వచ్చినపుడు మూడు రాజధానులు వస్తాయంటూ చేసిన ప్రకటనతో మొత్తం జగన్ వేసిన కమిటీల విశ్వసనీయత గాలికి కొట్టుకుపోయింది. ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి కమిటీలు అందించిన నివేదికలు ఇపుడు విపక్షం చెత్త అనేలా మారిపోయాయి. అది జగన్ రాయించుకున నివేదికలు అని సీపీఐ నారాయణ అంటే చెత్త కాగితంతో సమానం అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అంటున్నారు. ఇతర పార్టీలు సైతం జగన్ బుర్రలో పుట్టిన ఆలోచనలే నివేదికలుగా చూపిస్తున్నారని ఆడిపోసుకుంటున్నారు.

నిజాయతీ ఉన్నా…

ఇపుడున్న పరిస్థితుల్లో జగన్ కానీ ఆయన మంత్రులు కానీ కాస్తా జాగ్రత్తతో వ్యవహరించి ఉంటే నివేదికలలో ఉన్న వాస్తవాలను రాజకీయ పక్షాలు కాకపోయినా సాధారణ జానాలు అయినా అంగీకరించేవి. అవును కదా నిజమే అని నమ్మేవి. ఇపుడు సగటు జనాలల్లో కూడా అనుమానాలు పెరిగిపోవడానికి జగన్ ఆయన మంత్రివర్గం తొందరపాటే కారణం అంటున్నారు. ఇదే విషయం మీద ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ క్రిష్ణా రావు మాట్లాడుతూ జగన్ మంత్రులు చేసిన అతికి ఇపుడు కమిటీల విశ్వసనీయ‌త ప్రశ్నార్ధకంగా మారిందని అంటున్నారు. ఇదే విషయం మీద రేపు కోర్టుల్లో కూడా ఇబ్బందులు వస్తాయని కూడా చెబుతున్నారు.

స్మూత్ గా డీల్ చేయాలి…

నిజానికి వేస్తే వేపకొమ్మ, తీస్తే అమ్మ వారు చందగా అమరావతి రాజధాని కధ ఉంది. అక్కడ ఏం చేశారన్నది ముఖ్యం కాదు, ఏమీ లేని ఆంధ్రులకు ఏదో ఒక రాజధాని ఉంది కదా అన్నది సగటు మనిషి ఆలోచన. అయితే అమరావతి నిర్మాణం భారీ బడ్జెట్ సినిమా అన్నది కనుక కమిటీ నివేదికలు తరువాత వెల్లడించి ఉంటే ప్రభుత్వాన్ని జనం నమ్మే పరిస్థితి ఉండేది. ఇపుడు విపక్షానికి ఆయుధం అందించినట్లైంది. అమరావతి రాజధానిని తరలించాలని జగన్ ముందే అనుకుని రాజధాని మార్పు పేరిట కమిటీలు వేశారని, అందుకే ఆయన కోరినట్లుగా నివేదికలు తెప్పించుకున్నారన్న రాజకీయ విమర్శలు సామాన్యుడికి కూడా సందేహాలు పెంచక మానవు అంటున్నారు.

విద్యావంతుల్లో చర్చ….

మొత్తానికి బోస్టన్ కమిటీ అయినా, జీఎన్ రావు కమిటీ అయిన బాగానే అధ్యయనం చేసిందని మేధావులు కూడా అంటున్నారు. ఇవే రకమైన సిఫార్సులు అప్పట్లో శివరామక్రిష్ణన్ కమిటీ కూడా ఇవ్వడంతో వాటి మీద కాస్తా విద్యావంతుల్లో చర్చ ఉంది. కానీ సర్వామోదం కాకపోయినా మెజారిటీ జనం నమ్మేలా చేసేందుకు జగన్, మంత్రులు సరిగ్గా వ్యవహరించలేదన్న విమర్శలు వస్తున్నాయి. మరి ఇపుడైనా పకడ్బందీగా వ్యవహరిస్తే బాగుంటేమో.

Tags:    

Similar News