జగన్ లెక్కలన్నీ కరెక్ట్ అయితే…?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫక్తు బిజినెస్ మెన్. రాజకీయాల్లోకి వచ్చారు కానీ జగన్ పారిశ్రామికవేత్తగా ఉంటే ఆ లెక్కలే వేరు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా [more]

Update: 2021-04-27 02:00 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫక్తు బిజినెస్ మెన్. రాజకీయాల్లోకి వచ్చారు కానీ జగన్ పారిశ్రామికవేత్తగా ఉంటే ఆ లెక్కలే వేరు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా జగన్ లెక్కల మీదనే ఆధారపడుతున్నారు. నియోజకవర్గాల పెంపుదల పై జగన్ ఆశలు పెట్టుకున్నారు. అది జరిగితే జగన్ కు ప్రస్తుతమున్న సమస్యలు చాలావరకూ తీరినట్లే. దీనిపైనే ప్రస్తుతం జగన్ దృష్టి పెట్టారంటున్నారు. నియోజకవర్గాల పెంపుదల జరిగితే నేతలందరికీ టిక్కెట్ల సమస్య తీరినట్లే.

వాస్తవానికి పెరగాల్సి ఉన్నా…

నియోజకవర్గాల పునర్విభజన 2008లో జరిగింది. నిజానికి పునర్విభజన మరోసారి జరగాల్సింది 2026లో మాత్రమే. కొత్త నియోజకవర్గాల ఏర్పాటుపై ఏపీ పునర్విభజన చట్టంలో ఉంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో 119 స్థానాల నుంచి 153కు, ఏపీలో 175 స్థానాల నుంచి 225 అసెంబ్లీ స్థానాలకు పెంచాల్సి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ దాని ఊసు ఎత్తడం లేదు. 2021 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పెంపు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

2022 నాటికి…..

అయితే జనగణన మరో ఏడాది సమయం పట్టే అవకాశముంది. కరోనా కారణంగా జనగణన జరగలేదు. దీంతో 2022 చివరి నాటికి జనగణన పూర్తయితే కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పెంపుదలకు సుముఖత చూపే అవకాశముంటుంది. నియోజకవర్గాల పెంపుదల చేయాలని జగన్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మోదీ, అమిత్ షాలను కలసినప్పుడు కూడా ఈ డిమండ్ ఆయన వారికిచ్చే వినతి పత్రాల్లో ఒకటుంది.

కేంద్రంపై వత్తిడి….

ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ప్రధానంగా ఎస్సీ నియోజకవర్గాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. నియోజకవర్గాల పెంపు జరిగితే ఇటువంటి చోట సీట్ల సర్దుబాటు సులువవుతుందని జగన్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి 225 స్థానాలకు పెరుగుతాయని జగన్ విశ్వసిస్తున్నారు. అదే జరిగితే ఇప్పుడున్న నేతలందరికీ టిక్కెట్ కేటాయించే అవకాశముంటుంది. ఆ లెక్కలతోనే రానున్న ఎమ్మెల్సీ పదవులను జగన్ భర్తీ చేస్తారంటున్నారు.

Tags:    

Similar News