జగన్ నిజంగానే భయపడ్డాడా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిజంగానే భయపడ్డారా? తిరుపతి పర్యటనకు అందుకే రాలేదా? అవును విపక్షాలు చేసే ప్రధాన విమర్శల్లో ఇది ఒకటి. జగన్ కరోనా కారణంగా [more]

Update: 2021-04-13 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిజంగానే భయపడ్డారా? తిరుపతి పర్యటనకు అందుకే రాలేదా? అవును విపక్షాలు చేసే ప్రధాన విమర్శల్లో ఇది ఒకటి. జగన్ కరోనా కారణంగా ఈ నెల 14 వ తేదీన తిరుపతిలో తలపెట్టిన సభను రద్దు చేసుకున్నారు. అయితే విపక్షాలు మాత్రం తిరుపతి ఉప ఎన్నికల్లో భయపడి జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారని ఆరోపిస్తున్నాయి. ఇందులో నిజమెంత? నిజంగానే జగన్ భయపడ్డారా?

అన్నీ అనుకూలంగా ఉన్నా….

అధికారంలో ఉన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. మొన్ననే జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ భయపడాల్సిన అవసరం ఉందా? అంతగా భయపడటానికి విపక్ష పార్టీలు అంత స్ట్రాంగ్ గా ఎక్కడ ఉన్నాయని వైసీపీ నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. తాము కేవలం మెజారిటీ కోసమే ఎదురు చూస్తున్నామని, గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ సాధించడమే తమ లక్ష్యమని చెప్పుకొస్తున్నాయి.

లోకేష్ సవాల్ తో….

ఇక మరో ఆరోపణ లోకేష్ సవాల్ కు భయపడే జగన్ తిరుపతికి రాలేదంటుంది టీడీపీ. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దాదాపు రెండేళ్ల క్రితం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ ఇదే రకమైన ఆరోపణలు చేసింది. జగన్ కుటుంబ సభ్యులే వివేకాను హత్య చేశారంటూ చంద్రబాబు ఊరు ఊరు తిరిగి ప్రచారం చేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లోనూ చంద్రబాబు, లోకేష్ ఇదే ప్రశ్నలను జనం ముందు ఉంచారు. కానీ జగన్ కే జనం జైకొట్టారు.

అప్పుడు పట్టించుకున్నారా?

కానీ ఆ ఎన్నికల్లో వివేకా హత్య కేసును జనం పెద్దగా పట్టించుకోక పోవడం వల్లనే తాము క్లీన్ స్వీప్ చేయగలిగామని వైసీపీ నేతలు చెబుతున్నారు. కేసు సీబీఐ పరిధిలో ఉన్నందున తాము మాట్లాడి ప్రయోజనం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఏ ఎన్నికకూ జగన్ ఇప్పటి వరకూ భయపడింది లేదని, అధికారంలో లేనప్పుడే నంద్యాల ఉప ఎన్నికల్లో పోరాడిన విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ అనవసర ఆరోపణలని, కరోనా తీవ్రత కారణంగా ప్రజలు తన సభ కారణంగా ఇబ్బంది పడకూడదనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు. మొత్తం మీద జగన్ తిరుపతి పర్యటన రద్దు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News