జగన్ ఏలుబడిలో ఆ ఊసే లేదే.. రీజనేంటి?

ఏ రాష్ట్రం అభివృద్ధి సాధించాలన్నా కూడా ప్రభుత్వంతోనే సాధ్యపడదు, మనది మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ. పైగా ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారిని కావాల్సిన మౌలిక [more]

Update: 2021-05-06 02:00 GMT

ఏ రాష్ట్రం అభివృద్ధి సాధించాలన్నా కూడా ప్రభుత్వంతోనే సాధ్యపడదు, మనది మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ. పైగా ప్రైవేట్ రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారిని కావాల్సిన మౌలిక సదుపాయాలు సమకూరిస్తే పెట్టుబడులు పెట్టడానికి ఔత్సాహికులు ఎందరో రెడీగా ఉంటారు. ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పెట్టుబడులు తీసుకురావాలన్న ప్రయత్నం అయితే ఎంతో కొంత జరిగింది. కానీ జగన్ ఏలుబడిలో మాత్రం ఆ వూసే లేకుండా పోయింది.

దాహం వేస్తూంటే …?

జగన్ విలువైన రెండేళ్ల కాలాన్ని వృధా చేశారు అన్న మాట కూడా ఉంది. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి కాలు బయట పెట్టకుండా జగన్ తన ముఖ్యమంత్రిత్వాన్ని అలా కానిచ్చేశారు. నిజానికి జగన్ తానే ఒక పారిశ్రామికవేత్త. ఆయనకు తెలుసు పెట్టుబడులు పెట్టాలంటే ఎలాంటి వాతావరణం ఉండాలో. ఇపుడు తానే ఏపీకి పెద్దగా ఉన్నారు. కాబట్టి పెట్టుబడులకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించినట్లు అయితే ఏపీకి పెట్టుబడులు రావడానికి ఒక మార్గం ఏర్పడేది. కానీ ఎందుకో జగన్ తన ప్రాధాన్యతలు వేరని చెప్పుకున్నారు. సంక్షేమం మీదనే దృష్టి పెట్టి ఖజానాకు పెను భారం మిగిల్చారు. ఇపుడు దాహం వేస్తోంది. బావి ఎండిపోయింది అంటే కొత్త బావి తవ్వడానికి చూస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి.

అమెరికా టూర్ …

జగన్ రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న తరువాత ఇపుడు విదేశీ యాత్రలకు తొలిసారి అధికారిక హోదాలో వెళ్లబోతున్నారు అని తెలుస్తోంది. పెట్టుబడుల కోసం జగన్ అమెరికా సహా విదేశాలకు వెళ్లాలనుకుంటున్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. తనకు పరిచయం ఉన్న వారితే భేటీలు వేయడం, పారిశ్రామికవేత్తలతో మీటింగులు పెట్టడం ద్వారా ఏపీకి ఎంతో కొంత పెట్టుబడులు తీసుకురావాలని జగన్ ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. గత రెండేళ్ళలో ఏపీలో కొత్తగా ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదు, గత తెలుగుదేశంతో ఒప్పందాలు కుదుర్చుకున్న వారు వివిధ రాజకీయ కారణాల వల్ల తప్పుకున్నారు కూడా.

అది జరిగితేనే….?

జగన్ కి ఇక మిగిలింది అచ్చంగా మూడేళ్ళ కాలమే. ఈ సమయంలో కాళ్ళు అరిగేలా తిరిగి అయినా పెట్టుబడులు ఏపీకి తీసుకురావాల్సి ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వ ఒక సామాజికవర్గానికే ప్రాధాన్యత ఇచ్చిందన్న విమర్శ ఉన్నా కూడా వారు సైతం చంద్రబాబు పిలుపు మేరకు తమ సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకువచ్చారు. దానికి ఎవరైనా స్వాగతించాలి. ఇపుడు జగన్ సామాజికవర్గంలో కూడా చాలా మంచి పారిశ్రామిక వేత్తలే ఉన్నారు. వారిని జగన్ ఏపీ అభివృద్ధి వైపుగా మళ్ళించినా కూడా ఆయన సక్సెస్ అవుతారు. ఏపీలో రాయితీలను ఎవరు వచ్చినా ఇస్తారు. మరి ఆ విషయంలో చొరవ తీసుకుని జగన్ సామాజికవర్గం కూడా ముందుకు కదిలితే ఏపీకి మంచి రోజులు వస్తాయి. ఇక్కడ ప్రభుత్వం పారిశ్రామిక అనుకూల వాతావరణం కనుక ఏర్పాటు చేస్తే సామాజిక బంధాలు, ప్రాంతాలు దేశాలతో సంబంధం లేకుండా ఎవరైనా వచ్చి పెట్టుబడులు పెడతారు. ఆ దిశగా అడుగులు పడాల్సి ఉంది.

Tags:    

Similar News