డిజైన్ చేస్తే క్లీన్ స్వీప్..?

కొత్త సంవత్సరంతో ఏపీలో జగన్ పాలనకు సరిగ్గా ఏడు నెలలు నిండాయి. ఆయన ఈ సమయంలో దాదాపుగా నలభై వరకూ వివిధ సంక్షేమ పధకాలను అమలు చేశారు. [more]

Update: 2020-01-06 08:00 GMT

కొత్త సంవత్సరంతో ఏపీలో జగన్ పాలనకు సరిగ్గా ఏడు నెలలు నిండాయి. ఆయన ఈ సమయంలో దాదాపుగా నలభై వరకూ వివిధ సంక్షేమ పధకాలను అమలు చేశారు. అదే విధంగా కొన్ని కొత్త చట్టాలను తెచ్చి సంచలనాలు నమోదు చేశారు. ఇక సామాజిక న్యాయం అంటూ అయిదుగురు ఉప ముఖ్యమంత్రులను తీసుకున్నారు. బడుగులకు యాభై శాతం రిజర్వేషన్లు నామినేటెడ్ పదవుల్లో ఇస్తున్నారు. దిశ చట్టంతో మహిళల మనసును చూరగొన్నారు. ఇపుడు సమన్యాయం దిశగా అడుగులు వేస్తున్నారు.

ఎన్నికల వేళాయే….

ఏపీలో అతి పెద్ద ఎన్నికల కధ గత ఏడాది ముగిసింది. ఇపుడు లోకల్ బాడీ ఎన్నికలు జరగనున్నాయి. నిజానికి స్థానిక ఎన్నికలు అంటే అధికార పార్టీకే మొగ్గు ఉంటాయి. పైగా జగన్ సంక్షేమ బాటలో పయనిస్తున్నారు. అన్ని వర్గాలను ఆదుకుంటున్నారు. దాంతోపాటుగా 151 మంది ఎమ్మెల్యేలు చేతిలో ఉన్నారు. ఇవన్నీ కలసి విజయం మళ్ళీ అందుతుందని అనుకుంటున్నారు. నిజానికి లోకల్ బాడీ ఎన్నికలు రెండేళ్ళ క్రితమే జరగాలి. చంద్రబాబు మాత్రం వాటిని వాయిదా వేసుకుంటూ పోయారు. ఇపుడు జగన్ వాటిని కచ్చితంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అది కూడా మార్చిలోగా నిర్వహిస్తేనే మేలు అంటున్నారు. 14వ ఆర్ధిక సంఘం నిధులు వృధా పోకుండా పెద్ద ఎత్తున వస్తాయి.

రిఫరెండమా…?

ఇపుడు ఏపీలో మూడు రాజధాని వ్యవహారం హాట్ టాపిక్ గా ఉంది. జగన్ పాలనతో పాటుగా ఈ కొత్త నిర్ణయం పట్ల జనం ఏమనుకుంటున్నారన్నది కూడా ముఖ్యమైన అజెండాగా ఉంది. అమరావతి రాజధాని ఉండాలని టీడీపీ అంటోంది. మూడు చోట్ల రాజధానితో ప్రజలకు మేలు జరుగుతుందని వైసీపీ వాదిస్తోంది. మరి దీనిమీద జనం తీర్పు ఉంటుందా అంటే కచ్చితంగా ఉంటుందనే అంటున్నారు. ఎందుకంటే ఇది బర్నింగ్ ఇష్యూ కాబట్టి జనం రియాక్షన్ తప్పనిసరిగా ఉంటుందని అంటున్నారు.

టీడీపీ ఆశలు…..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల మీదనే టీడీపీ ఆశలు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో తాము గెలిచి తీరుతామని అంటోంది. సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన తప్పులు ఇపుడు రిపీట్ కావని ఆశిస్తోంది. పైగా జగన్ పాలన పట్ల ప్రజలలో బాగా వ్యతిరేకత ఉందని, దానికి మూడు రాజధానుల సెగ కూడా తగిలిందని అంచనా కడుతోంది. ఏపీలో మెడకాయ మీద తలకాయ ఉన్న వారెవరూ మూడు రాజధానులు ఒప్పుకోరని, అది తమకే లాభిస్తుందని టీడీపీ తలపోస్తోంది. రాజధాని సమస్య కేవలం అమరావతిదే కాదని, పదమూడు జిల్లల సమస్యని, దాంతో వైసీపీకి జనం ఓటు ద్వారా సరైన తీర్పు ఇస్తారని తమ్ముళ్ళు గట్టి ధీమాతో ఉన్నారు.

గెలుపు ధీమా….

ఏపీలోని అన్ని ప్రాంతాలకూ సమన్యాయం చేయాల‌న్నది తమ విధానమని వైసీపీ అంటోంది. అన్ని ప్రాంతాలకు అభివృధ్ధి ఫలాలను అందించడమే జగన్ ధ్యేయమని అంటున్నారు. ఆ విధంగా జగన్ అన్ని చోట్లా అభివృధ్ధికి డిజైన్ చేశారని అంటున్నారు. ఇది జనం కోరిన మార్పు అని కూడా అంటున్నారు. అమరావతే రాజధాని అయితే టీడీపీ చిత్తుగా సార్వత్రిక ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయిందని కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కుప్ప పోసిన అభివృధ్ధి కంటే వికేంద్రీకరణకే జనం ఓటు చేస్తారని, అది లోకల్ బాడీ ఎన్నికల్లో మరో సారి నిజమవుతుందని, బంపర్ మెజారిటీ వైసీపీకి రావడం ఖాయమని కూడా ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.

Tags:    

Similar News