ముప్పయ్యేళ్ళ సీఎం పదవి కోసం…?

జగన్ తాను ముప్పయ్యేళ్ళ పాటు సీఎం గా ఉంటాను ఒకప్పుడు అంటే అంతా ఎద్దేవా చేసేవారు. అవును అపుడు జగన్ ఎన్నికల్లో ఓడిపోయి విపక్షంలో ఉండేవారు. ఆయన [more]

Update: 2021-04-15 15:30 GMT

జగన్ తాను ముప్పయ్యేళ్ళ పాటు సీఎం గా ఉంటాను ఒకప్పుడు అంటే అంతా ఎద్దేవా చేసేవారు. అవును అపుడు జగన్ ఎన్నికల్లో ఓడిపోయి విపక్షంలో ఉండేవారు. ఆయన పార్టీ నేతలు కూడా నిస్తేజంగా ఉండేవారు. మరో వైపు చంద్రబాబు ఎత్తులు జిత్తులు తట్టుకోలేక జగన్ ఒక విధంగా చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. ఇక 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు విడతల వారీగా తీసుకుని జగన్ పార్టీకి భారీ డ్యామేజ్ కలిగించారు. జగన్ కనుక పాదయాత్ర చేయకపోతే కచ్చితంగా వైసీపీ ఏనాడో ఆవిరై అంతర్ధానమైపోయేదే.

ఒక దీపంతో అలా …

ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తుంది. అలాగే ఒకసారి వచ్చిన అధికారం మళ్ళీ మళ్లీ అధికారం దక్కడానికి బాటకు వేస్తుంది. అయితే దానికి అటు ప్రభుత్వపరంగా, ఇటు పార్టీ పరంగా భారీ మార్పులే చేయాలి. అందుకే జగన్ ఎవరినీ లక్ష్యపెట్టకుండా తాను అనుకున్నది అనుకున్నట్లుగా ‌ చేసేస్తున్నారు. ఏపీలో వివిధ సామాజికవర్గాలకు చెందిన వారిని అయిదుగురిని డిప్యూటీ సీఎంలను చేసినా ఏకంగా అరవైకి తక్కువ కాకుండా బీసీల్లోని వివిధ కులాలకు కార్పోరేషన్లు ఏర్పాటు చేసి వందల కొద్దీ పదవులు ఇచ్చినా కూడా అక్కడ జగన్ మార్క్ సోషల్ ఇంజనీరింగ్ ఉందని అంటారు.

బీసీలే బ్యాక్ బోన్….

ఇక మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎంపిక జగన్ భవిష్యత్తు దృష్టిని చెబుతోంది అంటున్నారు. ఏనాడు అధికార పదవులు పొందని కులాల‌ను తెచ్చి అగ్రాసనం మీద జగన్ కూర్చోబెట్టారు. విజయవాడ లాంటి చోట శ్రీకాకుళం జిల్లా నుంచి వలసలుగా వెళ్ళి ఉపాధి పొందే నగరాలకు చెందిన ఒక మహిళను మేయర్ గా చేయడం ద్వారా జగన్ అక్కడ కమ్మ లాబీకి గట్టిగానే గండి కొట్టారు అన్నది ఒక విశ్లేషణ. ఇక విశాఖ వంటి మెగా సిటీకి మేయర్ గా సిటీలో అత్యధిక శాతం జనాభా ఉన్న యాదవుల నుంచి ఎంపిక చేయడం ద్వారా జగన్ రాజకీయంగా టీడీపీని బాగా దెబ్బ తీశారని అంటున్నారు. ఇలాంటి నియామకాలే ఆయన మునిసిపాలిటీ పదవుల్లో ఎన్నో చేశారు.

రెడీ చేశారుట….

ఇక ఏపీలో జిల్లా పరిషత్తులు 13 ఉన్నాయి. అలాగే వందలాది మండల పరిషత్ చైర్మన్ పదవులు ఉన్నాయి. ఇవి కాకుండా వైఎస్ చైర్మన్ పొస్టులు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇవన్నీ కూడా బీసీలు, ఎస్సీ, మైనారిటీలు, మహిళలే టార్గెట్ గా చేసుకుని పంచిపెట్టడానికి జగన్ తాజాగా ప్రణాళికలను రూపొందించారు అంటున్నారు. ఈ విషయంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వేలూ కాలూ పెట్టడానికి వీలులేకుండా అన్నీ తానే అయి జగన్ ఎంపిక చేస్తున్నారు అన్న మాట ఉంది. ఈ విధంగా తన పార్టీకి అత్యధిక‌ జనాభా ఉన్న వర్గాలను పెట్టని కోటగా చేసుకోవాలని జగన్ అనుకుంటున్నారు. ఏపీలో టీడీపీ పరిస్థితి దిగనారుతున్న వేళ బీసీలకు వైసీపీ అండగా ఉండడం ఇక్కడ విశేషం. ఆ వర్గం దన్ను ఉండబట్టే టీడీపీ అనేకసార్లు అధికారంలోకి వచ్చింది. ఇక వైసీపీకి బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు కూడా అండగా ఉండేలా జగన్ ప్లాన్ రూపొందించారు. సో మొత్తానికి ముప్పయ్యేళ్ళ సీఎం కలను సాకారం చేసుకునే దిశగా జగన్ అడుగులు అయితే దూకుడుగానే పడుతున్నాయి.

Tags:    

Similar News