మూడు మళ్ళీ మొదలు ?

మూడు రాజధానులు అని జగన్ ఏ ముహూర్తాన అన్నారో కానీ అది ఎప్పటికీ అంతులేని కధగానే ఉంది. ఈ ప్రకటన చేసి ఏణ్ణర్ధం అయింది. ఆ తరువాత [more]

Update: 2021-04-10 03:30 GMT

మూడు రాజధానులు అని జగన్ ఏ ముహూర్తాన అన్నారో కానీ అది ఎప్పటికీ అంతులేని కధగానే ఉంది. ఈ ప్రకటన చేసి ఏణ్ణర్ధం అయింది. ఆ తరువాత నుంచి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వ్యవహారమంతా ఉంది. జగన్ తాను చేయాల్సిన పని చేసి చట్టం చేశారు. దాని మీద ఇపుడు కోర్టులో కేసులు పడ్డాయి. గతంలో విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరి బదిలీ మీద వెళ్ళారు. కొత్తగా వచ్చిన సీజే గోస్వామి తాజాగా విచారణ చేపట్టారు.

ఫస్ట్ నుంచే…?

ఇక ప్రధాన న్యాయ మూర్తి గోస్వామి అధ్యక్షతన మూడు రాజధానుల కేసుని విచారిస్తున్న ధర్మాసనం మే నెల నుంచి రోజూ వారీ విచారణను చేపడతామని ప్రకటించింది. దాంతో ఇపుడు వైసీపీ ప్రభుత్వ పెద్దలకు ఇది ఇబ్బందిగా మారుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. రోజు వారీ విచారణ మంచిదే కానీ మొదటి నుంచి కేసును టేకప్ చేస్తే మాత్రం సుదీర్ఘ కాలమే పట్టే అవకాశం ఉంది. అది ఎంతకాలం అన్నది కూడా ఎవరూ చెప్పలేరు. ఈ నేపధ్యంలో విశాఖకు వేగంగా వెళ్ళాలని భావిస్తున్న జగన్ కి ఇది ఇరకాటమే అంటున్నారు.

మరో ఏడాది కూడా…?

ఇక మూడు రాజధానుల విషయంలో హై కోర్టు విచారణతోనే కధ ముగిసిపోదు. ఇక్కడ ప్రతికూలంగా తీర్పు వచ్చిన వారు సుప్రీం కోర్టుకు కూడా వెళ్తారు అక్కడ కూడా విచారణ జరిగి తుది తీర్పు వస్తేనే ఈ వివాదం సమసినట్లు. మరి ఆ విధంగా జరగాలి అంటే కనీసంగా ఏడాదికి పైనే పడుతుంది అంటున్నారు. అంటే ఇప్పటికే రెండేళ్ళ పాలన పూర్తి చేసుకున్న జగన్ ప్రభుత్వానికి మరో ఏడాది అంటే పుణ్యకాలమంతా గడచిపోయినట్లే అని కూడా చెప్పుకోవచ్చేమో.

కంప్లీట్ చేంజ్ …

ఇక మూడు రాజధానులు అన్నపుడు జనాలలో మొదట్లో వచ్చిన ఉత్సాహాం ఇపుడు ఎవరికీ లేదు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో కూడా అధికార వైసీపీ రాజధాని అంశం మీద పెద్దగా ప్రచారం చేయలేదు. ఇక విశాఖ ప్రజలకు కూడా నానాటికీ ఆసక్తి సన్నగిల్లిపోతుంది. వచ్చే ఏడాదికి కూడా మూడు రాజధానుల కధ తెమలకపోతే ఎన్నికల వేళ విశాఖ వెళ్ళినా సుఖం లేదు. అనుకున్న రాజకీయ లాభం కూడా దక్కదు. మొత్తం మీద చూసుకుంటే మూడు రాజధానుల కధ మొదటి నుంచి రివర్స్ గేర్ లోనే పోతోంది అన్నది వాస్తవం. చూడాలి మరి ప్రభుత్వ పెద్దలు దీనికి తమదైన పరిష్కారం ఎలా చూస్తారో.

Tags:    

Similar News