రాయలసీమ ఐకాన్ ?

రాయలసీమ గురించి తెలుగు చిత్రాలలో వచ్చేది నిజం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సీమ జనం మనసు వెన్న లాంటిది అని దగ్గరుండి చూసిన వారు అంటారు. మాట [more]

Update: 2021-04-07 13:30 GMT

రాయలసీమ గురించి తెలుగు చిత్రాలలో వచ్చేది నిజం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సీమ జనం మనసు వెన్న లాంటిది అని దగ్గరుండి చూసిన వారు అంటారు. మాట కరుకు, మనసు మాత్రం సున్నితమే అని వారి మీద ఉన్న ఒక విస్తృతాభిప్రాయం. ఇక సీమ జనానికి పౌరుషం చాలానే ఉంటుంది. దాని కోసం వారు ఎంతదాకా అయినా వెళ్తారు. అలాగే మాట నిలబెట్టుకునే విషయంలో కూడా వారే ముందుంటారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన వారి విషయం తీసుకుంటే వారు ఎంతవరకూ కేరాఫ్ రాయల‌సీమవాసి అనిపించుకున్నారో వేళ్ళ మీద‌ లెక్క కట్టాల్సిందే.

వైఎస్సార్ ని మించి….

వైఎస్సార్ కి ప్రాంతీయ అభిమానం మెండు. పైగా ఆయన కడప జిల్లా అంటే మక్కువ చూపేవారు, ఇంకా ముందుకు వెళ్తే పులివెందుల అంటే ప్రాణం పెట్టేవారు. అలా రాజశేఖర్ రెడ్డి అయిదుంపావు ఏళ్ళ సీఎం పాలనలో తాను చేయాల్సినది సీమకు చేశారు. ఎక్కువగా కడపకు చేశారు. ఇపుడు ఆయన వారసుడిగా ఉన్న జగన్ సీమ పౌరుషాన్ని మళ్ళీ తట్టి లేపారు. మొత్తం సీమలోని నాలుగు జిల్లా ప్రజానీకం ఆయనలో తమను చూసుకునేలా చేశారు. తాను కోస్తా నుంచి పాలిస్తున్నా సీమను మరువను అనేలాగే జగన్ ముఖ్యమంత్రిత్వం సాగుతోంది.

గొప్ప నిర్ణయమే ….

జగన్ కర్నూల్ ఎయిర్ పోర్టుకు తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసిం హారెడ్డి పేరు పెట్టారు. ఇది చాలా గొప్ప నిర్ణయమని అంతా అంటున్నారు. ఇపుడు దేశంలో 75వ స్వాతంత్ర సంబరాల సన్నాహక ఉత్సవాలు జరుగుతున్నాయి. అందువల్ల మంచి సందర్భం కూడా. పైగా రాయలసీమలో కర్నూల్ అతి ముఖ్యమైన రాజకీయ కేంద్రంగా ఉంది. సీఎం ఇక్కడ ఓర్వకల్ ఎయిర్ పోర్టుని ప్రారంభించడమే కాకుండా ఉయ్యాలవాడను భావి తరాలు గుర్తుంచుకునే పని చేశారు. అదే సమయంలో అభివృద్ధి అంటే ఏంటో సీమ నుంచే చూపించారు. తాను సీఎంగా పాలన మొదలుపెట్టిన ఏడాదిన్నర కాలంలోనే విమానాశ్రయాన్ని పూర్తి చేసి సీమ ప్రగతికి జగన్ గట్టి భరోసా ఇచ్చారు.

వ్యూహాత్మకమే….

మరో వైపు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ సమయంలో సీమ నుంచి జగన్ అభివృద్ధి పనులను ప్రారంభించడం కూడా వ్యూహాత్మకమే అంటున్నారు. ఇక మరో వైపు చూసుకుంటే వర్తమాన కాలంలో సీమ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే నాయకత్వం తగ్గిపోతోంది. అత్యంత వెనకబాటు ప్రాంతంగా మారుతోంది. జగన్ వచ్చాక కర్నూలు ను న్యాయ రాజధానిని చేశారు. అక్కడ హైకోర్టు కోసం 250 ఎకరాల భూమిని సేకరించి పెట్టారు. ఇపుడు అదే కర్నూల్ నుంచి ఎయిర్ పోర్టుకు బాటలు వేశారు. పాత తరం నాయకుల గురుతులను పదిలం చేస్తున్నారు. కడపలో స్టీల్ పరిశ్రమకు శ్రీకారం చుట్టారు. ఈ విధంగా చూసుకుంటే జగన్ ని సీమకు ఐకాన్ గా అభివర్ణించవచ్చునన్న చర్చ అయితే ఉంది. జగన్ ఇదే తీరున ముందుకు సాగితే ఆయన రాజకీయాల్లో ఉన్నంతవరకూ సీమ జనం మరో నాయకుడి గురించి అసలు ఆలోచించదు అంటే అతిశయోక్తి కాదేమో.

Tags:    

Similar News