వాజపేయి షీల్డ్ తో వార్…సూచించిన పీకే సార్

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యూహాత్మకంగా కేంద్రంపై దాడిని మొదలు పెట్టింది. ప్రజాక్షేత్రంలో వ్యూహాలు నడిపే ప్రశాంత్ కిశోర్ ఇందుకు సంబంధించి కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఆ [more]

Update: 2021-03-26 15:30 GMT

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యూహాత్మకంగా కేంద్రంపై దాడిని మొదలు పెట్టింది. ప్రజాక్షేత్రంలో వ్యూహాలు నడిపే ప్రశాంత్ కిశోర్ ఇందుకు సంబంధించి కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు క్రమక్రమంగా బీజేపీపై , కేంద్రంపై దాడిని పెంచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే పూర్తి స్థాయి సమరానికి సిద్ధం కాలేదు. ఆచితూచి అడుగులు వేస్తూనే అదను చూసి కొట్టాలనుకుంటోంది. తాజాగా పార్లమెంటు సమావేశాల్లో బీజేపీని ఇరకాటంలో పెట్టే ఎత్తుగడలతో కదులుతోంది. పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, లోక్ సభపక్షం నేత మిథున్ రెడ్డి మాటలను బట్టి చూస్తే అంశాల వారీగా విభేదిస్తామనే సంకేతాలు పంపించారు. ఇంతవరకూ అనేక విషయాల్లో కేంద్రానికి బేషరతుగా మద్దతు పలికిన వైసీపీ నాయకత్వం స్టాండ్ మార్చుకుంటోంది. ఇకపై అదేం కుదరదని చెప్పాలనుకుంటోంది. తాము ఎంతగా మద్దతిస్తున్నప్పటికీ అంతటి సానుకూలత కేంద్రం నుంచి రావడం లేదనేది వైసీపీ నేతల ఫిర్యాదు. ఇకపై బీజేపీని ఇబ్బంది పెట్టే అవకాశాలను చేజార్చుకోకూడదని తాజాగా నిర్ణయించినట్లు సమాచారం. కేంద్రంతో డీల్ చేసే విధానంలోనే మార్పులు వచ్చేశాయి. రాష్ట్ర ప్రభుత్వమే భారత్ బంద్ వంటి వాటికి మద్దతు ప్రకటించింది. కేంద్రం కొన్ని విషయాల్లో రాష్ట్రాన్ని ఏ మాత్రం ఉపేక్షించకుండా తీసి పారేస్తోందనే భావన ప్రజలతో పాటు వైసీపీ నేతల్లోనూ నెలకొంది. అవసరమైన సందర్భాల్లో దీటుగా సమాధానం చెప్పేందుకు, నిలదీసేందుకు ఇటీవలనే అధినేత జగన్ మోహన్ రెడ్డి నుంచి ఎంపీలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దాంతో కేంద్రాన్ని వివిధ అంశాలపై సవాల్ చేసేందుకు సిద్దమవుతున్నారు ఎంపీలు. అదే సమయంలో దాడిని తక్షణం ఎక్కుపెట్టినట్లుగా కాకుండా వాజపేయి పాలనతో పోలుస్తూ మోడీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే వ్యూహం అనుసరిస్తున్నారు.

తిరుపతి తో తీర్థం…

తిరుపతి ఉప ఎన్నిక బీజేపీ, వైసీపీ ల మధ్య వార్ కు నాంది పలకవచ్చని భావిస్తున్నారు. హిందూ భావజాలంతో కూడిన తమ అజెండాను రాష్ట్రంలో బయటికి తీసేందుకు ఈ ఎన్నికను వినియోగించుకోవాలని కమల నాథులు యోచిస్తున్నారు. గెలుపోటముల సంగతి ఎలా ఉన్నప్పటికీ పార్టీ బలపడటానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాలనుకుంటున్నారు. అందుకే జనసేన పట్టుబట్టినప్పటికీ కాదని ఈ సీటు తమకే కేటాయించుకున్నారు. అదే సమయంలో వైసీపీ కూడా అప్రమత్తమవుతోంది. బీజేపీ మతపరమైన అజెండా తో ముందుకు వస్తే భవిష్యత్తులో తలనొప్పులు తప్పవని జగన్ మోహన్ రెడ్డికి శ్రేయోభిలాషులు స్పష్టం చేశారు. దీంతో నరేంద్ర మోడీ తిరుపతి వేదికగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని ప్రతి సందర్భంలోనూ ప్రస్తావించాలని నిర్ణయించారు. ప్రత్యేక హోదా, స్టీల్ ప్టాంట్ ప్రయివేటీకరణ, పోలవరం నిధులు, రైల్వే ప్రాజెక్టుల పెండింగు వంటి అంశాలన్నిటిని ప్రచారాంశాలుగా మలచుకోవాలని వైసీపీ యోచిస్తోంది. పార్లమెంటులో నిలదీయడంతోపాటు ఆ ప్రకంపనలు తిరుపతిలో వినిపించేలా చూడాలనుకుంటున్నారు. నిజానికి వైసీపీ సర్కారు కేంద్రంలో బీజేపీకి అన్ని విధాల సహకరిస్తూ వస్తోంది. కానీ ఏపీలో బలపడాలనుకుంటున్న బీజేపీ ద్వంద్వ విధానాన్ని అనుసరిస్తోంది. కేంద్ర ప్రజా వ్యతిరేక నిర్ణయాల ప్రభావం బీజేపీ కంటే తమకే ఎక్కువ చేటు చేస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. గతంలో తెలుగుదేశం దెబ్బతినడానికి బీజేపీ కూడా ఒక కారణమనేది విశ్లేషకుల అంచనా. అటువంటి చేదు ఫలితం తమకు ఎదురుకాకుండా ముందుగా జాగ్రత్త పడాలనుకుంటోంది వైసీపీ.

మునుగుతోందా..?

కేంద్రంలో బీజేపీ క్రమేపీ బలహీనపడే స్థితికి చేరుకుంటోందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దానికి అనేక కారణాలు చూపుతున్నారు. కరోనా ప్రభావం, సామాన్యుడి జీవితం దుర్భరంగా మారడం, పెట్రోలియం ఉత్పత్తుల వంటి వాటిలో సర్కారీ దోపిడీ వంటి అంశాలన్నీ ప్రజల్లో చర్చకు దారి తీస్తున్నాయి. వీటి ఫలితం కచ్చితంగా బీజేపీ ని దెబ్బతీస్తుంది. అందుకే వైసీపీ వంటి పార్టీలు దూరం జరగాలనుకుంటున్నాయి. అయితే నేరుగా కాకుండా బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడైన వాజపేయి పాలనను, ఆలోచనను ఆదర్శంగా చూపుతూ మోడీని నిందించాలనేది వైసీపీ ఆలోచన. అందుకే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలపై తన వ్యతిరేకతను స్పష్టంగా చెప్పేశారు విజయసాయి రెడ్డి. నిజానికి ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ కు వచ్చే నష్టమేమీ లేదు. అయినా ప్రతిపక్షాలతో సంఘీభావం ప్రకటించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది వైసీపీ. గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి వ్యూహరచన చేసిన ప్రశాంత కిశోర్ వచ్చే ఎన్నికల్లోనూ జగన్ తో కలిసి పనిచేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ అగ్రనాయకత్వంపై పీకే మండిపడుతున్నారు. వ్యక్తిగతంగా సైతం మోడీకి దూరమయ్యారు. బలమైన వైసీపీని కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు వినియోగించ వచ్చనేది పీకే ఆలోచనగా తెలుస్తోంది. కేంద్రంతో ఎలా వ్యవహరించాలన్న అంశంలో ఆయన విలువైన సూచనలు చేసినట్లుగా చెబుతున్నారు.

దేశంలో బలం, బలగం…

లోక్ సభలో నాలుగో అతిపెద్ద పార్టీ వైసీపీ. ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో సైతం ఢోకాలేదనే వాదన వినవస్తోంది. ఈ స్థితిలో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వైసీపీ సహకారం తప్పనిసరి. అయితే రకరకాల కారణాలతో తన బలాన్ని తానే గుర్తించలేకపోతోంది ఆ పార్టీ. ఇదే విషయాన్ని ప్రశాంత్ కిశోర్ నూరిపోశారని వైసీపీలో చర్చ నడుస్తోంది. ప్రతిపక్షాలతో గొంతు కలిపితేనే కేంద్రం జాగ్రత్తగా ఉంటుందనేది పీకే వ్యూహం. దాంతో వైసీపీ తాజాగా బీజేపీ పై గురిపెడుతోంది. పైపెచ్చు ముఖేశ్ అంబానీ, అదానీ వంటి వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవసరాలు పెరిగాయి. వారు కేంద్రం మెడలు వంచగల ఆర్థిక సామర్థ్యం ఎలాగూ కలిగి ఉన్నారు. బీజేపీ, వైసీపీల విభేదాలు పెరిగినా ప్రమాదం లేదు. కేంద్రం జోక్యం చేసుకోవాల్సి వస్తే వైసీపీ అగ్రనాయకత్వం ప్రమాదంలో పడకుండా అంబానీ, అదానీలు సహాయం చేస్తారు. న్యాయపరంగా తిమ్మినిబమ్మి చేయగల సుబ్రహ్మణ్య స్వామి సైతం వైసీపీ గూటిలోకి వచ్చేసినట్లే. మొత్తమ్మీద కేంద్రంతో డీకొన్నప్పటికీ తట్టుకోగల సామర్థ్యం తమకుందనేది వైసీపీ నాయకత్వం గుర్తించింది. ఫలితంగానే స్టాండ్ మార్చుకుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News