మూడు కాదు ఒక్కటేనా ?

ఏపీలో మూడు రాజధానుల కధ ఎంత అలజడి సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఒక చలికాలపు వేళ అసెంబ్లీ చివరి సమావేశాల్లో జగన్ ఏపీకి మూడు రాజధానులు అంటూ [more]

Update: 2021-04-06 14:30 GMT

ఏపీలో మూడు రాజధానుల కధ ఎంత అలజడి సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఒక చలికాలపు వేళ అసెంబ్లీ చివరి సమావేశాల్లో జగన్ ఏపీకి మూడు రాజధానులు అంటూ మాట్లాడి అగ్గిని రాజేసిన కధను ఎవరు మరచిపోగలరు. అది ఇప్పటికీ చిచ్చులాగే ఉంది. అయితే గతంలో పోలిస్తే ఏపీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. చంద్రబాబు అమరావతి డిమాండ్ ని జగన్ స్థానిక ఎన్నికల్లో తిరస్కరించారని వైసీపీ గట్టిగా భావిస్తోంది. దాంతో తనదైన శైలిలో రాజధానుల వ్యవహారానికి ముగింపు పాడాలని అనుకుంటోంది.

రూట్ మార్చారా..?

మూడు రాజధానులు ఏంటి, అన్నీ ఒక్క చోట ఉంటేనే పాలన బాగా సాగుతుంది. రాజధానులను ముక్కలు చేయడం తుగ్లక్ నిర్ణయం అంటూ టీడీపీ సహా అన్ని రాజకీయ పార్టీలు విమర్శించిన సంగతి తెలిసిందే. అదే విధంగా మేధావులు, విద్యావంతులు కూడా ఏపీ లాంటి ఆర్ధికంగా చితికిన రాష్ట్రానికి మూడు రాజధానులు అన్నది గుది బండగా కూడా పేర్కొన్నారు. ఇలా మాట్లాడిన అందరి మాటల్లో కూడా నిజం ఉంది. కేవలం పదమూడు జిల్లాల ఏపీకి మూడు రాజధానులు ఎందుకు అన్న ప్రశ్న కూడా పెద్దల నుంచి వస్తున్న వేళ జగన్ లో కొత్త ఆలోచనలు ఇపుడు పుట్టుకు వస్తున్నాయా లేక అవే అసలైన ఆలోచనలా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి.

శాశ్వత రాజధానిగా ….

ఇక విశాఖ ఇపుడు ఏపీలో పెద్ద నగరం, అన్ని రకాలుగా వనరులు ఉన్న సిటీ. రెడీ మేడ్ గా రాజధానిగా మార్చుకోవచ్చు. మొదటి నుంచి వైసీపీ ఇదే చెబుతూ విశాఖకు తరలిపోవాలనుకుంటోంది. ఇక ఏపీలో రెండేళ్ళ పాలనకు దగ్గర పడుతున్నా కూడా జగన్ ని మెచ్చి మరీ మునిసిపాలిటీలలో సహా బ్రహ్మరధం పట్టడంతో విశాఖ మీద మోజు మరింతగా పెరిగిపోతోందిట. దాంతో విశాఖనే శాశ్వత రాజధానిగా, ఏకైక‌ రాజధానిగా ఎందుకు చేయరాదు అన్న చర్చ కూడా సాగుతోంది అంటున్నారు.

అన్నీ అక్కడే …?

రాజధాని అనగానే విశాఖ మీద వైసీపీ ఫోకస్ బాగా పెరిగింది. ఉత్తరాంధ్రా జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న కేజీహెచ్ కి ఏకంగా ఆరు వందల కోట్ల రూపాయలను జగన్ తాజాగా మంజూరు చేశారు. అలాగే విమ్స్ కి మరో 250 కోట్లు, ఘోషాసుపత్రికి వంద కోట్లు కేటాయించారు. అనకాపల్లిలో వైద్య కళాశాల కోసం కూడా 500 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది విశాఖ వైద్య చరిత్రలో ఎన్నడూ చూడని వ్యవహారమే అంటున్నారు. అంతే కాకుండా విశాఖ నుంచి భోగాపురం వరకూ బీచ్ కారిడార్ ని అభివృద్ధి చేయాలనుకోవడం, విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి భోగాపురం వరకూ ఆరు లైన్ల రోడ్లకు ప్రతిపాదించడం, టూరిజం సర్క్యూట్ గా మెగా సిటీని డెవలప్ చేయాలనుకోవడం, మెట్రో రైల్ ప్రాజెక్ట్ కి ఊపిరి పోయడం వంటివి చూస్తూంటే రానున్న రోజుల్లో విశాఖే ఏపీకి ఏకైక రాజధాని అన్నా ఆశ్చర్యం లేదంటున్నారు. కర్నూల్ లో హైకోర్టు, అమరావతిలో అసెంబ్లీ అని ప్రతిపాదించినా జగన్ మరోసారి గెలిస్తే మాత్రం అమరావతి అసెంబ్లీ కూడా విశాఖకు షిఫ్ట్ అయినా కావచ్చు అన్నది విశ్లేషణగా ఉంది.

Tags:    

Similar News