జగన్ సైన్యం జడిపిస్తోందిగా ?

పూర్వం రాజులకు ఎంతో సైన్యం ఉండేది. ఆ రాజు మీదకు యుద్ధానికి రావాలంటే దాని కంటే ముందు సైన్యం ఎంత వారి బలమెంత వంటి ఆనుపానులు తెలుసుకుని [more]

Update: 2021-04-04 14:30 GMT

పూర్వం రాజులకు ఎంతో సైన్యం ఉండేది. ఆ రాజు మీదకు యుద్ధానికి రావాలంటే దాని కంటే ముందు సైన్యం ఎంత వారి బలమెంత వంటి ఆనుపానులు తెలుసుకుని మరీ ప్రత్యర్ధులు బరిలోకి దిగేవారు. ఇపుడు ఏపీలో వైరి పక్షాలకు కూడా జగన్ సైన్యం అంటేనే జడుపు జ్వరం వస్తోందిట. ఇంతకీ జగన్ సైన్యం అంటే పార్టీ నాయకులు, మంత్రులు సామంతులు కానే కారు. జగన్ మానసపుత్రిక లాంటి వాలంటీర్ల వ్యవస్థ. దాన్ని చూసి నిన్న చంద్రబాబు వణికితే నేడు బీజేపీ అధినేత సోము వీర్రాజు కూడా షాక్ తింటున్నారు.

వద్దే వద్దా….?

ఎన్నికలు అన్నవి ఈ దేశంలో తరచూ వస్తూంటాయి. అవి పంచాయతీ వార్డుల నుంచి పార్లమెంట్ దాకా ప్రతీ చోటా ఏదో రూపంలో జరుగుతాయి. మరి వాటితో ముడి పెట్టి పొట్టకూటి కోసం కొలువుల్లో చేరిన వాలంటీర్ల మీద పడిపోవడం రాజకీయ జీవులకు తగునా అంటే కాదేదీ విమర్శలకు అతీతం అని అంటున్నారు. వాలంటీర్ల ద్వారా అన్ని రకాలైన పధకాలు ప్రభుత్వం జనాలకు నేరుగా అందిస్తోంది. వారి విధి విధానమే అలా నిర్వచించారు. ఇపుడు ఎక్కడో ఎన్నికలు అని వారిని పనులను మానుకుని కూర్చోమంటే అయ్యేపనేనా. కానీ జగన్ అపాయింట్ చేసిన వారు వద్దే వద్దు అని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి.

పోరు వారితోనే….

వాలంటీర్లు ఉంటే గెలవలేము అని భయమో సందేహమో తెలియదు కానీ తెలుగుదేశం స్థానిక ఎన్నికల్లో ఇదే విధంగా గోల చేసింది. దాని మీద అప్పట్లో ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకుంటే ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. ఇలా వాలంటీర్లే కేంద్ర బిందువుగా చేసుకుని ఈ రోజుకి కూడా రాజకీయాలు సాగిపోతున్నాయి. ఇపుడు సోము వీర్రాజు అయితే తిరుపతి ఉప ఎన్నికల వేళ వాలంటీర్లను కట్టడి చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం విశేషం, వారే ఇంటింటికీ వెళ్ళి ఓటర్లను ప్రలోభపెడుతున్నారని కూడా ఆయన ఆరోపిస్తున్నారు.

ఆడలేకనా…?

వెనకటికి ఒక సామెత ఉంది. ఆడలేక మద్దెల ఓడు అని. అలా విపక్షాల తీరు ఉందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికలు ఉన్నాయని చెప్పి ప్రజా సంక్షేమాన్ని ఆపలేము కదా అని వారు రివర్స్ అటాక్ చేస్తున్నారు. జగన్ తో రాజకీయ పోరాటం చేయాలి కానీ ఇలాంటి విషయాలను వివాదాలు చేయడం ద్వారా రాంగ్ రూట్ పాలిటిక్స్ దేనికి అని నిలదీస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే సోము వీర్రాజు మరో గమ్మత్తైన మాట అంటున్నారు. తాము 2024లో కచ్చితంగా అధికారంలోకి వస్తామని అపుడు వాలంటీర్ల వ్యవస్థకు బదులుగా మరింత మెరుగైన వ్యవస్థను తీసుకువస్తామని. అంటే దీని అర్ధం వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు అనా విపక్షాల అనుమానం. ఏమో గెలుపు కోసం కోటి మాటలు అంటారు. అందులో వాలంటీర్లను కూడా ఇపుడు లాగేస్తున్నారు.

Tags:    

Similar News