ఇంకా దింపుడు కళ్ళెం ఆశలేనా ?

జగన్ జైలుకు వెళ్తాడు. ఆయన అరెస్ట్ ఖాయం. ఈ మాటలను గత పదేళ్ళుగా ఏపీ జనం వింటూనే ఉన్నారు. అయినా ఆయాసం, అలుపూ లేకుండా జగన్ కి [more]

Update: 2021-04-01 14:30 GMT

జగన్ జైలుకు వెళ్తాడు. ఆయన అరెస్ట్ ఖాయం. ఈ మాటలను గత పదేళ్ళుగా ఏపీ జనం వింటూనే ఉన్నారు. అయినా ఆయాసం, అలుపూ లేకుండా జగన్ కి ఓటు వేస్తూనే ఉన్నారు. జగన్ జాతకం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి 151 సీట్ల బంపర్ మెజారిటీతో 2019 ఎన్నికల్లో ఏపీకి ముఖ్యమంత్రి అయిపోయాడు. తాను అనుకోని వేళ ఏ వ్యూహాలూ కనీసంగా కూడా ఆలోచించని వేళ స్థానిక ఎన్నికలు పెట్టినా కూడా విపక్షాన్ని సోదిలోకి కూడా లేకుండా చేసి జగన్ నెగ్గాడు. ఏపీలో జగన్ వేవ్ బలంగా ఉందని జాతీయ స్థాయిలోనూ మారుమోగుతున్న వేళ ఇంకా టీడీపీ అరిగిపోయిన రికార్డు మాదిరిగా పాత పాటనే పాడుతోంది.

జైలుకు పోతారుట …

ఈ దేశంలో ఒక్క జగన్ తప్ప ఏ రాజకీయ నాయకుడు అయినా కేసు రుజువు కాకుండా ఇన్నేసి నెలలు జైలు గోడల మధ్య గడిపిన దాఖలాలు ఉన్నాయా. అపుడంటే జగన్ కి ఏమీ తెలియని తనం, దూకుడు స్వభావం, కానీ ఇపుడు ఆయన రాజకీయంగా రాటుదేలారు. నిజానికి జగన్ జైలుకు వెళ్ళే సందర్భం ఏదైనా ఉంటే అది 2014 నుంచి 2019 మధ్యనే జరిగిపోవాలి. నాడు రాష్ట్రంలో చంద్రబాబు సీఎం గా ఉన్నారు. పైగా ఆయన మిత్రుడు మోడీ కేంద్రంలో ప్రధానిగా ఉన్నారు. మరి నాడు జరగని ముచ్చట ఇపుడు ఎలా జరుగుతుంది అని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు భావిస్తున్నారు అన్నదే అర్ధం కాని విషయం.

ఢిల్లీలో టాక్ అదేనా …?

జగన్ జైలుకు త్వరలో వెళ్తాడు అని ఢిల్లీలో అంతా చెప్పుకుంటున్నారుట. అచ్చెన్నాయుడు లాజిక్ కి అందని ఇలాంటి మాటలతోనే తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకుంటున్నాడు అంటే తప్పేమైనా ఉందా. నిన్నటికి నిన్నే ఏపీలో మునిసిపాలిటీలను మొత్తంగా స్వీప్ చేసిన వైసీపీ అధినేతగా, సమర్ధుడు అయిన సీఎం గా జాతీయ మీడియా జగన్ ని వేణ్ణోళ్ల కొనియాడింది. మరి హస్తినలో ఆ టాపిక్ మీద చర్చ జరగదా.అయినా ఇపుడు అకస్మాత్తుగా జగన్ జైలుకి వెళ్ళే సందర్భం కూడా ఏముంది. ప్రత్యర్ధి బలహీనంగా ఉన్నపుడే ఎవరైనా దెబ్బ కొట్టగలరు. జగన్ బలమేంటో తెలిసాక రాజకీయంగా ఎవరైనా కొరివితో తల గోక్కుంటారా..

భరించాల్సిందే ….

జగన్ పదవి నుంచి దిగిపోతే బాగుణ్ణు. జైలుకు వెళ్ళిపోతే బాగుండును అన్న ఫోబియా నుంచి అర్జంటుగా టీడీపీ బయటపడాలి. అంతే కాదు. మరో మూడేళ్ల పాటు జగన్ ని తాము ముఖ్యమంత్రిగా అంగీకరించి తీరాలన్న చేదు నిజాన్ని కూడా జీర్ణించుకోవాలి. ఇక రానున్న కాలానికి తగినట్లుగా ధీటైన వ్యూహాలను రచించుకోవాలి. ఇప్పటికే వైసీపీ గురించి ఎక్కువగా ఆలోచించి సొంత పార్టీని పక్కన పెట్టేసిన తెలుగు వల్లభులు తమ ఇంటికి రిపేర్లు చేసుకుంటే బెటర్ అన్న మాట వినిపిస్తోంది. జనాల మూడ్ మారేంతవరకూ జగన్ కి వచ్చిన ప్రమాదం ఏదీ లేదని కూడా గ్రహించాలి. అంతే తప్ప జగన్ జైలుకు పోతాడు, మాజీ సీఎం అవుతాడు అని కలలు కనడమే కాదు వాటిని ఇలా అసందర్భంగా చెప్పేసుకుంటే జనాల్లో జగన్ కి మరింతగా సానుభూతి పెరిగి అసలుకే ఎసరు వస్తుంది. తమ్ముళ్ళూ తస్మాత్ జాగ్రత్త.

Tags:    

Similar News