కొత్త విత్తనాలు జల్లుకుంటూ పోతున్న జగన్…?

జగన్ వ్యూహాలూ తెలివితేటలూ చూసి స్వపక్షంతో పాటు విపక్షం కూడా విస్మయానికి లోను అవుతోంది. ఏ రాజకీయ పాఠశాలలోనూ ప్రత్యక్షంగా శిక్షణ పొందని జగన్ ఇంత తక్కువ [more]

Update: 2021-03-20 06:30 GMT

జగన్ వ్యూహాలూ తెలివితేటలూ చూసి స్వపక్షంతో పాటు విపక్షం కూడా విస్మయానికి లోను అవుతోంది. ఏ రాజకీయ పాఠశాలలోనూ ప్రత్యక్షంగా శిక్షణ పొందని జగన్ ఇంత తక్కువ కాలంలో మేటి నాయకుడిగా అవతరించడం అంటే ఆశ్చర్యం కాక మరేమిటి. వైఎస్సార్ నుంచి జగన్ ఏమైనా నేర్చుకున్నాడు అంటే అది తండ్రి మాదిరిగా పట్టుదల మాత్రమే. ఇక రాజకీయాల్లో జగన్ కి నేర్పించేటంతగా అధికార పదవులు ఏవీ వైఎస్సార్ ని ఎపుడూ చేరలేదు. జీవిత చరమాంకంలో దక్కిన పదవులతోనే ఆయన జనాలకు మేలు చేశారు. ఈ లోగా అకాల మరణం పొందారు.

ఒక్క ఛాన్స్ కాదా…?

జగన్ ఒక్క చాన్స్ అని జనాలను అడిగింది తానేంటో రుజువు చేసుకోవడానికే తప్ప టీడీపీ నేతలు వక్ర భాష్యాలు చెబుతున్నట్లుగా అయిదేళ్ల పాటు కుర్చీలో కూర్చుని పదవిని అనుభవించి దిగిపోవడానికి కానే కాదు. అందుకే జగన్ గెలిచిన మరుక్షణం నుంచే పాతికేళ్ళ రాజకీయానికి తనదైన శైలిలో గట్టి పునాదులు వేసుకుంటున్నారు. ఆయన మంత్రి వర్గం కూర్పు నుంచి చూస్తే బీసీలకు పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవుల పంపిణీ దాకా తనదైన మార్క్ పాలిటిక్స్ ని రుచి చూపిస్తున్నారు.

వారితోనే అంతా ….

జగన్ చుట్టూ ఇపుడున్న వారిలో కొద్ది మంది మాత్రమే ఆయనతో మునుముందు రాజకీయ ప్రయాణం చేయడానికి అర్హులుగా ఉంటారు. మెజారిటీ రాజకీయ జనాలు మాత్రం మధ్యలోనే ఆగిపోతారు అన్న విశ్లేషణ ఒకటి ఉంది. జగన్ కొన్ని రాజీలతో 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చారు. ఇక ముఖ్యమంత్రి కాగానే మాత్రం ఆయన అసలు రాజీపడడంలేదు. తనకు వచ్చిన ఈ పదవితో కొత్త వారిని, ఎన్నడూ పదవుల రుచి చూడని వారిని అందలం ఎక్కించాలన్నదే జగన్ అజెండాగా ఉంది. దాని ప్రకారమే ఆయన స్థానిక ఎన్నికల్లో పదవుల సంతర్పణ చేశారు.

అనూహ్యమేనా…?

రాయచోటిలో ఇక కూరగాయలు అమ్ముకునే వ్యక్తి ఏకంగా జగన్ చలువతో చైర్మన్ అయ్యారు. విశాఖ వంటి మహా నగరానికి ఒక సాధారణ గృహిణి మేయర్ అయ్యారు. మరో చోట పాఠాలు చెప్పుకునే పంతులమ్మ ప్రధమ పౌరురాలు అయింది. విజయవాడ వంటి చోట బీసీల్లో అత్యంత వెనకబడిన వర్గాలని చెందిన ఒక మహిళను తెచ్చి మేయర్ ని చేశారు. ఇక 11 కార్పొరేషన్లు చూసుకున్నా, 74 మునిసిపాలిటీలు చూసినా కూడా పదవులు అందుకున్న వారిలో అత్యధికులు బీసీలు, మహిళలు. దీనిని బట్టి చూసుకుంటే జగన్ విజన్ ఏంటో అర్ధమైపోతుందిగా. తనవారుగా వారుండాలి. వారికి అండగా తానుండాలి. రేపటి రాష్ట్ర రాజకీయం తామే మార్చాలి. ఇదే జగన్ టార్గెట్. మొత్తానికి కొత్త విత్తనాలు ఏపీ రాజకీయ క్షేత్రంలో జగన్ విస్తారంగా నాటారు. వాటి ఫలాలు, ఫలితాలతో రేపటి రోజున ఏపీ పాలిటిక్స్ ని సమూలంగా మార్చడం ఖాయమని అంటున్నారు.

Tags:    

Similar News