చిక్కకుండా…చిక్కుల్లో పడకుండా?

ఏం చేశారన్నది కాదు.. ఎలా చేశారన్నదే.. న్యాయవ్యవస్థ ప్రశ్నించేది. ఇప్పుడు తాను తీసుకునే ఏ నిర్ణయమైనా కూడా న్యాయవ్యవస్థ కూడా ఆమోదించి తీరేలా ఉండాలనేది సీఎం జగన్‌ [more]

Update: 2020-01-01 14:30 GMT

ఏం చేశారన్నది కాదు.. ఎలా చేశారన్నదే.. న్యాయవ్యవస్థ ప్రశ్నించేది. ఇప్పుడు తాను తీసుకునే ఏ నిర్ణయమైనా కూడా న్యాయవ్యవస్థ కూడా ఆమోదించి తీరేలా ఉండాలనేది సీఎం జగన్‌ వ్యూహం. ఈ క్రమంలోనే ఆయన ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా రాజధాని విషయంలో ఆయన వేస్తున్న అడుగులు భావి తరాలు ప్రశ్నించడం మాట అటుంచితే.. న్యాయ వ్యవస్థ ముందు మాత్రం తాను తలెత్తుకునేలా ఉండాలనే వ్యూహంతో జగన్‌ నిర్ణయం తీసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ రాజధాని ప్రాంతం ఏదంటే.. అమరావతి అని రికార్డులు చెబుతున్నాయి. అయితే, జగన్‌ మాత్రం దీనిని విశాఖకు తరలించాలని అనుకుంటున్నారు.

రెండు కారణాలే….

దీనికి ఆయన చెబుతున్న కారణాలు రెండు. ఒకటి రాజధాని ప్రకటనకు ముందుగానే ఇక్కడ టీడీపీకి చెందిన నాయకులు భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసి ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ కు పాల్పడ్డారని. రెండు.. ఎలాంటి ప్రకృతి రక్షణా లేని ప్రాంతంలో, నదికి అత్యంత సమీపంలో, కొండవీటి వాగు వంటి పొంచి ఉన్న ప్రమాదం నేపథ్యంలో రూ. లక్షల కోట్లు ఖర్చు పెట్టి కట్టడం ఎందుకు ? అనేది. ఈ రెండు విషయాలు ప్రాతిపదికగా రాజధానిని విశాఖకు తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే, ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సహా బీజేపీకి చెందిన నాయకులు దీనిపై న్యాయపోరాటం చేస్తామని అంటున్నారు. ఇదే జరిగి విషయం కోర్టులకు ఎక్కితే.. ప్రభుత్వం దోషిగా మారకుండా ఉండేలా జగన్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనేది వాస్తవం.

మంత్రి మండలి ద్వారా….

వీటిలో ఒకటి.. ప్రభుత్వం రాజధానిపై ఆచితూచి నిర్ణయం తీసుకుందని చెప్పడం. దీనికి జీఎన్‌ రావు వంటి సీనియర్‌ ఐఏఎస్‌తో కూడిన నివేదికను సిద్ధం చేసుకుంది. అదే సమయంలో బీసీజీ నివేదిక. ప్రపంచ ప్రఖ్యాత బోస్టన్‌ కన్సల్టింగ్‌ కంపెనీతో కూడా సర్వే చేయించి తీసుకునే నివేదిక. ఈ రెండు నివేదికలను కూడా గుడ్డిగా అనుసరించకుండా.. మంత్రులతో కూడిన హైపవర్‌ కమిటీ వేయడం. ఇలా మూడు నివేదికల ఆధారంగా రాజధానిని మారుస్తున్నామని చెప్పడం. రెండు.. సదరు హైపవర్‌ కమిటీ నివేదికను మంత్రి మండలిలో పెట్టి ఆమోదించడం. (దీనిని కోర్టు ప్రశ్నించే అవకాశం లేదు). మూడు ఈ మొత్తం విషయాన్ని అసెంబ్లీ, శాసన మండలిలో పెట్టి ఆమోదం పొందడం. ఈ మూడు విషయాల ద్వారా న్యాయవ్యవస్థకు చిక్కకుండా జగన్‌ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

మండలిలో ఎలా?

అయితే, ఈ మొత్తం వ్యవహారంలో జగన్‌కు అడ్డంకిగా మారేది శాసన మండలి. అసెంబ్లీలో 150 మంది మద్దతు వైసీపీకి ఉన్నా.. మండలిలో మాత్రం ప్రధాన ప్రతిపక్షం టీడీపీకే బలం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో జగన్‌ మరో వ్యూహానికి తెరదీసే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. అదేంటంటే.. రెండు సభలను ఉమ్మడిగా హాజరుపరచడం. దీనికి రాజ్యాంగంలో వెసులుబాటు ఉంది. దీనిని వినియోగించుకుని అసెంబ్లీ, మండలిలను ఒకేసారి హాజరు పరిచి రాజధానిపై ఆమోద ముద్ర వేయించుకోవడం. తద్వారా వైసీపీకి బలం సరిపోతుంది. ఇక, దీంతో తాను తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు జగన్‌కు అవకాశం చిక్కుతుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News