జగన్ సంచలన నిర్ణయం తీసుకుంటాడా ?

జగన్ అన్న మూడు అక్షరాలకు మరో పేరు సంచలనం అని చెబుతారు. జగన్ దూకుడు కి కేరాఫ్ అడ్రస్ అని ఆయన రాజకీయ జీవితాన్ని చూసిన వారంతా [more]

Update: 2021-03-24 12:30 GMT

జగన్ అన్న మూడు అక్షరాలకు మరో పేరు సంచలనం అని చెబుతారు. జగన్ దూకుడు కి కేరాఫ్ అడ్రస్ అని ఆయన రాజకీయ జీవితాన్ని చూసిన వారంతా అర్ధం చేసుకున్న నిజం. ఎక్కడో తండ్రి చాటు బిడ్డగా ఉన్న జగన్ సొంతంగా పార్టీ పెట్టి ఈ స్థాయికి రావడం అంటే సామాన్య విషయం కాదు. ఉమ్మడి ఏపీ నుంచి జగన్ పోరాటం మొదలైంది. అవతల వైపు ఎవరు ఉన్నారు అని కూడా చూడకుండా కొండను ఢీ కొట్టే వైఖరి జగన్ సొంతం. అయితే అధికారంలోకి వచ్చాక జగన్ దూకుడు తగ్గిందని, ఆయన మోడీకి భయపడుతున్నారని కూడా ప్రత్యర్ధులు విమర్శలు చేస్తున్నారు.

ఇక సహించలేరా…?

ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు అంటే దానికి చంద్రబాబు లాలూచీతనం మెతకతనమే కారణం అని 2019 వరకూ అంతా భావించారు. జగన్ సైతం కేంద్రాన్ని బాబు గట్టిగా ఆ విషయంలో అడగకపోవడం వల్లనే రాలేదు అని అనుకున్నారు. కానీ జగన్ సీఎం అయ్యాక కూడా ప్రత్యేక హోదా అలాగే ఉంది. జగన్ ఎన్నో సార్లు దాని మీద నేరుగా ప్రధానిని నిలదీస్తున్నా కూడా జవాబు లేదు. ఇపుడు చూస్తే పులి మీద పుట్రలా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కూడా వచ్చింది. దాంతో జగన్ తెగించి పోరాడేందుకు రెడీ అవుతారు అన్న మాట వినిపిస్తోంది.

ఎమోషన్ పవర్….

జగన్ కి జనాల నాడి బాగా తెలుసు. అలాగే వారి ఎమోషన్ పవర్ ఎలా ఉంటుందో కూడా ఇంకా బాగా తెలుసు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబుని ఎండగట్టి మరీ బంపర్ మెజారిటీతో అధికారాన్ని పట్టేసిన జగన్ కి ఉక్కు కర్మాగారం సెంటిమెంట్ ఇంకా మించినదని తెలుసు. హోదా అన్నది ఇవ్వాల్సిన హామీ. అది రావాలన్నది జనాల ఆకాంక్ష. అయితే స్టీల్ ప్లాంట్ అలాంటిది కాదు. అయిదు దశాబ్దాల అనుబంధం జనాలకు ఉంది. పైగా అమరవీరుల త్యాగాలతో ఉక్కు పరిశ్రమ వచ్చింది. అలా కళ్ల ముందు ఉన్న దాని మాయం చేస్తామంటే ఏ ఆంధ్రుడి గుండె అయినా అసలు తట్టుకోలేదు. ఆ సెంటిమెంట్ రేగితే ఆపడం కష్టం. దానికి చెల్లించాల్సిన రాజకీయ మూల్యం కూడా ఎక్కువ అన్నది జగన్ కి తెలియనిది కాదు.

మూకుమ్మడిగానే…?

విశాఖ మీద అన్ని విధాలుగా పట్టు సాధించాలనుకుంటున్న జగన్ కి ఉక్కు పరీక్షే ఎదురైతే మాత్రం దాన్ని అధిగమించేందుకు ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నారని అంటున్నారు. అందుకోసం తమ పార్టీకి చెందిన ఎంపీలతో మూకుమ్మడి రాజీనామాలు చేయించాలని కూడా జగన్ సీరియస్ గా ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. మరో వైపు కేవలం విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయిస్తే ఎలా ఉంటుంది అన్నది కూడా పరిశీలిస్తున్నారు అని తెలుస్తోంది. ఏది ఏమైనా విశాఖ వాసులు స్టీల్ ప్లాంట్ కారణంగా తన పార్టీకి వ్యతిరేకమైతే మాత్రం జగన్ చూస్తూ ఊరుకోరని, ప్రజల అభిమతానికి తగినట్లుగానే వైసీపీ అడుగులు ఉంటాయని ఆ పార్టీ నుంచి వినవస్తున్న మాట. ఈ మొత్తం ప్రక్రియలో విపక్షాలను కార్నర్ చేయడమే కాదు, తమ పార్టీ చిత్తశుద్ధిని కూడా జనంలోనే నిరూపించుకునేందుకు జగన్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని అంటున్నారు. అంటే ఏపీలో ఫ్యూచర్ పాలిటిక్స్ లో భారీ సంచలనాలే నమోదు అవుతాయి అన్న మాట.

Tags:    

Similar News