స్వాములతో బాగా సెట్ అవుతోందే…?

స్వాములతో ఎవరికైనా పెద్దగా కుదిరే వ్యవహారం కాదు. అందునా వేరే మతాన్ని ఆరాధించే జగన్ లాంటి వారికి అది కత్తి మీద సాము లాంటి వ్యవహారమే. కానీ [more]

Update: 2021-03-22 14:30 GMT

స్వాములతో ఎవరికైనా పెద్దగా కుదిరే వ్యవహారం కాదు. అందునా వేరే మతాన్ని ఆరాధించే జగన్ లాంటి వారికి అది కత్తి మీద సాము లాంటి వ్యవహారమే. కానీ జగన్ మాత్రం స్వాములతో, మఠాలతో బాగానే చెలిమి చేస్తున్నారు. జగన్ 2009లో రాజకీయాల్లోకి వచ్చిన నాడు సంగతి వేరు. ఆ తరువాత వేరు. ఆయన తన వ్యక్తిగత ఇష్టాలు ఎలా ఉంచుకున్నా కూడా రాజకీయ అవసరాల కోసం ఏమేం చేయాలో బాగానే నేర్చారు అంటారు. అందుకే కుడి వైపు విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర స్వామిజీని, ఎడమ వైపున వివాదాస్పద రాజకీయ నాయకుడు సుబ్రమణ్య స్వామిని పెట్టుకుని మరీ స్నేహం చేస్తున్నారు.

ఆయనంటే షాకే …?

రాజకీయ నాయకులు ఎవరితోనైతే జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారో ఆయనే సుబ్రమణ్యస్వామి. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే సుబ్రమణ్యస్వామి కేవలం మూడు దశాబ్దాల క్రితం ఆరు నెలల పాటు చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్న కాలంలో దేశానికి ఆర్ధిక మంత్రిగా పనిచేశారు. ఆయన బహుముఖ ప్రతిభా ధురీణుదు. ఆయన రాజకీయం కూడా అలాగే ఉంటుంది. మంచి న్యాయవాది. వక్త. అంతే కాదు, న్యాయ శాస్త్రం, రాజ్యాంగం ఔపాసన పట్టిన మేటి ఘనాపాటి. ఆయనతో జగన్ కి స్నేహం అంటేనే ఒక విచిత్రం. ఇక పరువు నష్టం దావా కేసుల విషయంలో సుబ్రమణ్యస్వామిది ఎపుడూ గెలుపే. ఆయన కేసు పట్టాలే కానీ అవతల వారికి శంకరగిరి మాన్యాలే.

అలా నరుక్కువస్తున్నారా…?

ఏపీలో జగన్ కి టీడీపీ అధినేత చంద్రబాబు కంటే కూడా ఆయన అనుకూల మీడియా వేధింపులే భరించరానివిగా ఉంటున్నాయి. తమకు తోచిన రీతిన రాతలు రాస్తూ జగన్ని, ఆయన ప్రభుత్వాన్ని బదనాం చేసే పనిలో అనుకూల మీడియా ఎపుడూ ఉంటుంది. అందులో ఆంధ్ర జ్యోతి రాధాకృష్ణ అయితే మరీనూ. జగన్ తో ఏకంగా వేయి జన్మల వైరం ఉన్నట్లుగా తన కలానికి పదును పెడతారు అంటారు. జగన్ ఏ మాత్రం లెక్క చేయకుండా రాతలు రాయడంతో ఆయన ప్రత్యేకతే వేరు. అటువంటి రాధాకృష్ణను ఎలా లొంగదీయాలో జగన్ కి తెలియడంలేదు. ప్రభుత్వ పరంగా కేసులు వేసినా కూడా మీడియా స్వేచ్చ అంటూ రచ్చ చేస్తారు. జీవోలు తెస్తే భావ స్వాతంత్రం అంటారు. అందుకే చేతికి మట్టి అంటకుండా బీజేపీ స్వామితోనే పని కానిస్తున్నారా అన్న చర్చ అయితే ఉంది.

బాబు రెక్కలు తెంచేస్తే…?

చంద్రబాబుకు అధికారం చేతిలో లేకపోయినా మీడియాలో మాత్రం ఆయనే రాజు. తెలుగు మీడియాలో సింహ భాగం టీడీపీకి అనుకూలం. దాంతో బాబు అలా శాసిస్తున్నారు. ఇండైరెక్ట్ గా పాలిస్తున్నారు. దాంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా సుబ్రమణ్యస్వామితోనే కాగల కార్యం నడిపిస్తున్నారా అన్న మాట అయితే ఉంది. టీటీడీకి సంబంధించి పరువు నష్టం దావా కేసులు సుబ్రమణ్యస్వామి చేపట్టారు. స్వామి ట్రాక్ రికార్డు చూసిన వారికి ఈ కేసులో ఆయన కచ్చితంగా విజయం సాధిస్తారు అనిపించక మానదు. ఆయనది ఉడుం పట్టు. వంద కోట్లతో ఆంధ్ర జ్యోతి మీద పరువు నష్టం దావా వేస్తున్నట్లుగా ప్రకటించిన స్వామి ఆ తరువాత నేరుగా జగన్ ఇంటికి వెళ్ళి ఆతీధ్యం స్వీకరించడం చూస్తే బాబు బాటలోనే వ్యవస్థల ద్వారానే మీడియా మోతుబరులకు ముకుతాడు వేయించే పెద్ద పనిలో జగన్ ఉన్నారని అర్ధమవుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News