జగన్ కి విశాఖ నో ఎంట్రీ…?

మొత్తానికి జగన్ కి విశాఖకు మధ్యన ఏదో తెలియని పూర్వ జన్మ వైరం ఉన్నట్లుగా ఉంది. ఆయన ఎంత మోజు పడినా విశాఖ అంతకంతకు దూరమే జరుగుతోంది. [more]

Update: 2021-03-21 14:30 GMT

మొత్తానికి జగన్ కి విశాఖకు మధ్యన ఏదో తెలియని పూర్వ జన్మ వైరం ఉన్నట్లుగా ఉంది. ఆయన ఎంత మోజు పడినా విశాఖ అంతకంతకు దూరమే జరుగుతోంది. విశాఖ 2014 నుంచి జగన్ కి అందని పండే అయింది. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనం ఏపీ అంతా వీచినా కూడా విశాఖ సిటీ మాత్రం డోంట్ టచ్ మీ అంటూ సైకిలెక్కేసింది. ఇక జగన్ సీఎం అయ్యాక విశాఖను పరిపాలనా రాజధానిని చేశారు. అయితే అది కోర్టు కేసుల్లో ఇరుక్కుంది. ఈ లోగా రెండేళ్ళ పుణ్య కాలం గడచింది. ఇక మరోవైపు ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ విశాఖ మీద గురి పెట్టారు. బీజేపీ దెబ్బకు ఉక్కు కర్మాగారం ముక్కలయ్యేలా ఉంది.

అసలు రాగలరా …?

విశాఖ అంటేనే ఉక్కు నగరం అని పేరు. అతి పెద్ద పరిశ్రమ విశాఖలో ఉండడమే ఒక కీర్తి. ఇది విశాఖకు గర్వకారణం కూడా. అంటువంటి విశాఖలో రాజధాని పెడదామని జగన్ భావించారు. ఇపుడు కేంద్రం వేటుకు గురై ప్రైవేట్ పరమైన ఉక్కు కర్మాగారం జగన్ కి ఏ విధంగా స్వాగతం పలుకుతుంది. విశాఖకు కొత్తగా వచ్చిన పరిశ్రమలు ఏవీ లేవు కానీ ఏనుగు కుంభస్థలం లాంటి ఉక్కు కర్మాగారమే ఏమీ కాకుండా పోయిన వేళ విశాఖకు వచ్చి జగన్ చేసేది ఏముందన్న మాట కూడా చదువరులలో మేధావులలో వినిపిస్తోంది. మరో వైపు చూస్తే జగన్ ఈ సమయంలో విశాఖ మన రాజధాని అని చెప్పినా జనం మునుపటి మాదిరిగా ఆదరిస్తారా అన్న ప్రశ్న కూడా ఉంది.

కల చెదిరిందా …?

మోడీ మాట్లాడకుండానే వీలు చూస్కుని మరీ అతి దెబ్బ కొట్టారా అన్న చర్చ అయితే వైసీపీలో వినిపిస్తోంది. విశాఖ మీద తెగ మోజు పడుతున్న జగన్ కి అన్నీ అనుకూలం చేస్తూనే మోడీ అతి పెద్ద ట్విస్ట్ ఇచ్చేశారా అన్న మాట కూడా ఉంది. విశాఖకే మణిహారం లాంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపొతే జగన్ రాజధాని తెచ్చాను అని చెప్పుకున్ ఏ రకమైన పొలిటికల్ మైలేజ్ అసలు రాదు సరికదా రాజకీయంగా ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. అలా మోడీ మార్క్ పాలిట్రిక్స్ తో జగన్ కల ఒక్కసారిగా చెదిరిపోయింది అని అంటున్నారు.

ఏం చేసుకుంటారు…?

ప్రభుత్వ రంగంలోని స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేశాక వట్టి విశాఖను ఏం చేసుకుంటారు అంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఈ మధ్యనే ఏపీ సీఎం జగన్ ని నిలదీశారు. విశాఖను అభివృద్ధి చేయడానికే రాజధాని అంటున్న జగన్ దానికంటే ముందు స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో నిలబెడితేనే న్యాయం జరిగినట్లు అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇదే మాట విశాఖవాసుల నుంచి కూడా వస్తోంది. ఒక విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయితే వైసీపీ సర్కార్ మీద కూడా జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతుంది. అపుడు ఉత్తరాంధ్రా జిల్లాలను ఒడుపుగా పట్టేద్దామనుకుంటున్న వైసీపీ రాజకీయ ఆశలు కూడా నెరవేరవు. ఇక విశాఖ వాసుల నుంచి తీవ్ర నిరసన కనుక మొదలైతే జగన్ రాజధాని కలలకు అతి పెద్ద ఫుల్ స్టాప్ పడడం ఖాయమని కూడా అంటున్నారు.

Tags:    

Similar News