జ‌గ‌న్ కేబినెట్లో ఈ రెండు కులాల‌కు ఈసారైనా చోటు ఉంటుందా?

ఏపీలో వరుస ఎన్నికలతో పొలిటికల్ హీట్‌ మామూలుగా లేదు. ప్రస్తుతం జరుగుతున్న మునిసిపల్, నగరపాలక సంస్థల ఎన్నికల తర్వాత ఎంపీటీసీలు.. జడ్పీటీసీల‌ ఎన్నికలతో పాటు సహకార సంఘాల [more]

Update: 2021-05-06 15:30 GMT

ఏపీలో వరుస ఎన్నికలతో పొలిటికల్ హీట్‌ మామూలుగా లేదు. ప్రస్తుతం జరుగుతున్న మునిసిపల్, నగరపాలక సంస్థల ఎన్నికల తర్వాత ఎంపీటీసీలు.. జడ్పీటీసీల‌ ఎన్నికలతో పాటు సహకార సంఘాల ఎన్నికలు… తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికలు ముగిసిన నాలుగైదు నెలల్లో ముఖ్యమంత్రిగా జగన్ రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంటారు. జగన్ తన క్యాబినెట్ ప్రకటించిన రోజునే రెండున్నర ఏళ్ల తర్వాత ప్రస్తుతం ఉన్న క్యాబినెట్ లో 90% మంత్రులను మార్చే చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే రెండేళ్ల ప‌ద‌వీ కాలం పూర్తవ్వడంతో పాటు కేబినెట్ మార్పుల‌కు ముహూర్తం ద‌గ్గర ప‌డుతుండ‌డంతో పార్టీలోని ఆశావాహులు కేబినెట్ ఆశతో ఉన్నారు.

ఆ రెండు కులాలకు….

క్యాబినెట్ మార్పులు – చేర్పులులో రెండు కులాలకు జగన్ చోటు ఇస్తారా ? అన్న దానిపై అప్పుడే చర్చ మొదలైంది. జగన్ తొలి కేబినెట్ లో ఎస్సీలకు చంద్రబాబుతో పోలిస్తే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ఎస్సీ వ‌ర్గం నుంచి ఐదుగురు మంత్రులు అయ్యారు. కాపు, రెడ్డి సామాజిక వర్గాలు సైతం నాలుగేసి బెర్త్‌లు ఇచ్చారు. కమ్మ సామాజిక వర్గం నుంచి కొడాలి నానికి మాత్రమే అవకాశం ఇచ్చారు. ఇక క్షత్రియ వ‌ర్గం నుంచి చెరుకువాడ శ్రీరంగనాథరాజు… వైశ్య సామాజిక వర్గం నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రులు అయ్యారు. అన్ని ప్రధాన కులాల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చిన జ‌గ‌న్ అగ్రవ‌ర్ణాల్లో వెల‌మ‌, బ్రాహ్మణ వ‌ర్గాల నుంచి మాత్రం ఎవ్వరిని కేబినెట్లోకి తీసుకోలేదు.

మార్పులు… చేర్పుల్లో….

మార్పులు, చేర్పుల్లో అయినా ఈ రెండు కులాల నేత‌లకు మంత్రి ప‌ద‌వి వ‌స్తుందా ? అన్న చ‌ర్చల‌తో పాటు ఆయా వ‌ర్గాల‌కు చెందిన ఎమ్మెల్యేలు సైతం ఆశ‌లు పెట్టుకున్నారు. వెల‌మ వ‌ర్గం నుంచి రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగాక కూడా చంద్రబాబు బొబ్బిలి ఎమ్మెల్యే సుజ‌య్ కృష్ణ రంగారావుకు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఇప్పుడు వైసీపీలో నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్నారు. వెల‌మ వ‌ర్గం నుంచి వైసీపీలో ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు.

వీరికే అవకాశమా?

ఇక బ్రాహ్మణ నేత‌ల‌కు జ‌గ‌న్ కీల‌క ప‌ద‌వులు క‌ట్టబెడుతున్నారు. మ‌ల్లాది విష్ణుకు బ్రాహ్మణ కార్పొరేష‌న్ చైర్మన్ ప‌ద‌వి ఇచ్చారు. బాప‌ట్ల ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తి ఇప్పటికే డిప్యూటీ స్పీక‌ర్‌గా ఉన్నారు. ఈ వ‌ర్గం నుంచి మంత్రి ప‌ద‌వి వ‌స్తే విష్ణు ముందు వ‌రుస‌లో ఉన్నార‌న్న ప్రచారం వైసీపీ వ‌ర్గాల్లోనే న‌డుస్తోంది. విష్ణు కంటే ర‌ఘుప‌తే వైసీపీలో సీనియ‌ర్‌గా ఉన్నారు. మ‌రి జ‌గన్ ఈ సామాజిక వ‌ర్గాల‌కు మంత్రి ప‌ద‌వులు ఇవ్వాల‌నుకుంటే ఈ ఆశావాహుల‌ను ఎంత వ‌ర‌కు క‌రుణిస్తారో ? చూడాలి.

Tags:    

Similar News