సీనియర్లకు రెస్ట్.. తన టీం తయారీలో జగన్

జగన్ ఏపీలో పాదయాత్ర చేయడం కాదు కానీ ప్రజల సమస్యలతో పాటు పార్టీ సమస్యలు కూడా మెదడులో బాగానే ఎక్కించుకున్నారు. ఎక్కడ ఏ డ్రా బ్యాక్ ఉంది, [more]

Update: 2021-03-21 15:30 GMT

జగన్ ఏపీలో పాదయాత్ర చేయడం కాదు కానీ ప్రజల సమస్యలతో పాటు పార్టీ సమస్యలు కూడా మెదడులో బాగానే ఎక్కించుకున్నారు. ఎక్కడ ఏ డ్రా బ్యాక్ ఉంది, ఎక్కడ పార్టీకి రిపేర్లు చేయాలి అన్నది జగన్ కి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. తాడేపల్లిలో జగన్ కూర్చుంటారు ఆయనకు ఏం తెలుసు అని ఎవరైన వైసీపీ నేత అనుకుంటే ఉత్త పొరపాటే. జగన్ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినా మంత్రి పదవులు కేటాయించినా, నామినేటెడ్ పదవుల పందేరం చేస్తున్నా కూడా తన కొలమానం తనకు ఉంది. తన లెక్కలు తనకు ఉన్నాయి. ఎవరు పార్టీకి పనికివస్తారో ఎవరు ఫోజులు కొడతారో కూడా జగన్ దగ్గర అతి పెద్ద చిట్టా ఉందిట. ఇక ప్రత్యర్ధి పార్టీలతో లోపాయికారీ బేరాలు ఎవరికి ఉన్నాయో కూడా జగన్ కి బాగా తెలుసుట.

అచ్చం తనలాగానే….?

జగన్ కి ఎవరితోనూ నెయ్యాలు ఉండవు, వియ్యాలు అంతకంటే ఉండవు. రాజకీయ కయ్యాలే ఆయనకు తెలుసు. కరెక్ట్ గా ముక్కు సూటిగా దూసుకుపోవడం, ప్రత్యర్ధులను గురి చూసి రాజకీయంగా దెబ్బ తీయడమే ఆయనకు కావాలి. అందుకు మొహమాటాలు ఉంటే కధ అసలు ముందుకు సాగదు, అందుకే తనలాగానే మొండితనంగా దూకుడుగా ముందుకు సాగే వారికే జగన్ ప్రయారిటీ ఇస్తారని చెబుతారు. శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే యంగర్ జనరేషన్ కే జగన్ ఇపుడు పెద్ద పీట వేస్తున్నారు. మంత్రి పదవి కావాలని స్పీకర్ గా తలపండిన తమ్మినేని సీతారాం లాంటి వారు ఎందరు రేసులో ఉన్నా జగన్ చాలా కామ్ గా మత్స్యకార వర్గానికి చెందిన యువ డాక్టర్ సీదరి అప్పలరాజుకే అమాత్య పీఠం అందించారు. ఇపుడు అనూహ్యంగా టెక్కలి వైసీపీ ఇంచార్జి దువ్వాడ శ్రీనివాస్ ని ఎమ్మెల్సీ చేసి తన మనసుకు దగ్గర మనుషులు ఎవరో చెప్పకనే చెప్పేశారు.

రిటైర్ కావాల్సిందే….

ఇక 2024 ఎన్నికలకు జగన్ ఇప్పటి నుంచే కార్యాచరణను తయారు చేసి పెట్టుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా భవిష్యత్తు రాజకీయాలను నడపాల్సిన సారధులలో దువ్వాడ శ్రీను, మంత్రి సీదరి అప్పలరాజు ముందు వరసలో ఉంటారని టాక్. ఇక డిప్యూటీ సీఎం గా ఉన్న ధర్మాన క్రిష్ణ దాస్ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెబుతున్నారు. ఆయన కుమారుడుడాక్టర్ క్రిష్ణ చైతన్య నరసన్నపేట నుంచి పోటీలో ఉంటారు. అలాగే శ్రీకాకుళం నుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్ మోహననాయుడుకు టికెట్ ఇస్తారని అంటున్నారు. దీంతో సీనియర్లు తప్పుకునే సీన్ ఉంది. ఈ పరిస్థితుల్లో దూకుడు గా ఉండడమే కాదు కింజరాపు కుటుంబం మీద ఒంటి కాలుపైన లేచే దువ్వాడ లాంటి వారే ఇపుడు జగన్ కి కావాలని అంటున్నారు.

వీరితోనే టీమ్…

ఇక దువ్వాడను ఎమ్మెల్సీగా చేసిన జగన్ రానున్న రోజుల్లో కిల్లి కృపారాణికి రాజ్యసభ ఇస్తారని చెబుతున్నారు. అలాగే పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతికి శ్రీకాకుళం లోక్ సభ ఎంపీ సీటుని కేటాయిస్తారని తెలుస్తోంది. ఇక తమ్మినేని సీతారామ్ తనయుడు నాగ్ చిరంజీవికి ఆముదాల వలస టికెట్ కన్ ఫర్మ్ అంటున్నారు. ఇలా చూసుకుంటే చాలా మంది వారసులను ప్రోత్సహించడం ద్వారా సీనియర్లకు రెస్ట్ ఇచ్చేలా జగన్ పావులు కదుపుతున్నారు. రానున్న రోజులో ఎంటువంటి సంకోచం లేకుండా అచ్చెన్నాయుడు మీద యుద్ధ భేరీ మోగించడానికి దువ్వాడ, మంత్రి సీదరి అప్పలరాజు లాంటి వారిని ముందున పెట్టి అసలైన రాజకీయానికి జగన్ శ్రీకారం చుడతారని చెబుతున్నారు. మొత్తానికి శ్రీకాకుళంలో పాత కాపులకు వైసీపీలో కాలం చెల్లినట్లే మరి.

Tags:    

Similar News