బ్రదర్ కి బిగ్ ట్రబుల్…?

వైఎస్ ఫ్యామిలీ ఒక్కటి అని నిన్నటి దాకా అంతా అనుకున్నారు. కానీ ఆ కుటుంబంలోనూ రాజకీయం ఎంటరైంది. జగన్ జైలు లో ఉంటే నాడు ఉప ఎన్నికల్లో [more]

Update: 2021-03-09 05:00 GMT

వైఎస్ ఫ్యామిలీ ఒక్కటి అని నిన్నటి దాకా అంతా అనుకున్నారు. కానీ ఆ కుటుంబంలోనూ రాజకీయం ఎంటరైంది. జగన్ జైలు లో ఉంటే నాడు ఉప ఎన్నికల్లో చెల్లెలుగా వైఎస్ షర్మిల ప్రచారం చేయడానికి వచ్చింది. మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి అందరినీ అబ్బురపరచింది. ఇది కదా అన్నా చెల్లెళ్ల బంధం అని అంతా అనుకున్నారు. కానీ ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. జగన్ సీఎం అయ్యాక వైఎస్ కుటుంబం చేతిలోకి అధికారం వచ్చాక లెక్కల్లో చాలా తేడాలు వచ్చాయి. అందుకే జగన్ చెల్లెలు సొంత పార్టీ పెట్టేస్తోంది.

నాడు అలా….

జగన్ కాంగ్రెస్ ని వీడి వచ్చినపుడు సొంత బాబాయ్ మంత్రి పదవిలో ఉంటూ కాంగ్రెస్ తరఫున పులివెందుల నుంచి పోటీ చేశారు. అపుడు జగన్ ఫ్యామిలీ అన్న మాట ఒక్కటే. తమ కుటుంబంలో కాంగ్రెస్ చిచ్చు పెట్టిందని. అదే నిజం అనుకుంటే ఇపుడు వైఎస్ ఫ్యామిలీలో ఎవరు చిచ్చు పెట్టారు. అన్నా చెల్లెళ్ళ మధ్యన ఎవరు విభేదాలు రగిలించారు. అంటే ఎవరూ కాదు, రాజకీయమే ఇలా చేసింది అని చెప్పుకోవాలి. వైఎస్సార్ తాను రాజకీయాల్లో ఉంటూనే తమ్ముడు వివేకానందరెడ్డిని ఎంపీగానో, ఎమ్మెల్యేగానో చేస్తూ వచ్చారు. రాజకీయ వాటాను బాగానే పంచారు. అందుకే ఇద్దరూ రామ లక్ష్మణులుగా మెలిగేవారు. ఇపుడు జగన్ చెల్లెలు షర్మిల విషయంలో చూస్తే అలా ఏ ఒక్క అవకాశం ఇవ్వలేదు. అందుకే తేడా కొడుతోందని అంటున్నారు.

సూటిగానే బాణం…

జగనన్న వదిలిన బాణాన్ని అంటూ దూసుకువచ్చిన షర్మిల వేరు, లోటస్ పాండ్ లో కూర్చుని తెలంగాణాలో కొత్త పార్టీ సన్నాహాల్లో ఉన్న చెల్లెలు వేరు. ఆమె మాటలు వేరు అంటున్నారు విశ్లేషకులు. తనకు పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్ నే అడగండి అంటూ షర్మిల తాజాగా చేసిన కామెంట్స్ ఏపీలో కాక పుట్టిస్తున్నాయి. బ్రదర్ ని పూర్తిగా ట్రబుల్ లో పడవేసేలా ఉన్నాయి. చెల్లెలుకి అన్న అన్యాయం చేశాడా అన్న అనుమానాలు కలిగించేలా ఉన్నాయి. తన కోసం ఎంతో చేసిన ఒక్కగానొక్క సోదరికి అపరిమితమైన అధికారం చేతిలో ఉన్న జగన్ ఏ ఒక్క పదవి కూడా ఇవ్వలేకపోయారా అన్న చర్చ అయితే సామాన్య జనంలో కలిగేలా షర్మిల సూటిగా వదిలిన ప్రశ్న ఉందని అంటున్నారు.

ముందుందా….?

తనకు తల్లి విజయమ్మ మాత్రమే మద్దతుదారు అని షర్మిల చెప్పడం, తాను పార్టీ పెట్టడం అన్నకు ఇష్టం లేదని కుండబద్దలు కొట్టడం ద్వారా ఏపీ సీఎం జగన్ ఇమేజ్ ని కొంత డ్యామేజ్ చేసినట్లుగానే కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు. మాట తప్పను, మడమ తిప్పను అని జగన్ అంటే ఇప్పటిదాకా అంతా నమ్ముతూ వచ్చారు. కానీ సొంత చెల్లెలు ఒకే రక్తం పంచుకుని పుట్టిన సోదరి ఇలా తనకు వైసీపీలో చోటు లేదని చెప్పకనే చెప్పడం ద్వారా జగన్ ని పూర్తిగా ఇరకాటంలోకి నెట్టేశారు అంటున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసిన జనాలు పట్టించుకోరు కానీ షర్మిల ఒక్క కామెంట్ చేస్తే మాత్రం అది బ్రహ్మాస్రమే అవుతుందని అంటున్నారు. ఇక ఇవాళ మచ్చుకు ఒకటి అన్న చెల్లెలు రేపు పార్టీ పెట్టాక దూకుడు పెంచాక ఇంకా ఏమేమి అంటుందో ఏమేమి చెబుతుందో అన్న చర్చ అయితే వైసీపీలో ఉంది. మొత్తానికి బ్రదర్ కి ట్రబుల్స్ సిస్టర్ నుంచే స్టార్ట్ అయ్యాయా అన్నదే పెద్ద డౌట్ మరి.

Tags:    

Similar News