ఇటు విశాఖ.. అటు అమరావతి…?

అమరావతి గ్రాఫిక్స్ రాజధాని, అక్కడ కట్టింది ఏమీ లేదు. అంతా టీడీపీ వారితోనే నింపేసిన ప్రాంతం అంటూ వైసీపీ నేతలు గత రెండేళ్ళుగా చెబుతూ వచ్చారు. కానీ [more]

Update: 2021-03-08 03:30 GMT

అమరావతి గ్రాఫిక్స్ రాజధాని, అక్కడ కట్టింది ఏమీ లేదు. అంతా టీడీపీ వారితోనే నింపేసిన ప్రాంతం అంటూ వైసీపీ నేతలు గత రెండేళ్ళుగా చెబుతూ వచ్చారు. కానీ హఠాత్తుగా అమరావతిలో భారీ నిర్మాణాలను పూర్తి చేయడానికి జగన్ సర్కార్ నిర్ణయించడం ఏపీ రాజకీయల్లో కొత్త మలుపుగా చెబుతున్నారు. జగన్ యూ టర్న్ తీసుకున్నారని పసుపు తమ్ముళ్ళు ఎకసెక్కం ఆడుతూంటే ఈ పరిణామాలతో వైసీపీలోనూ ఏం జరుగుతోందో అర్ధం కావడంలేదుట.

భారీ వ్యూహమేనా…?

వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో జమిలి ఎన్నికలు వస్తాయని హస్తిన వార్తల సమాచారం. మరి అది జగన్ కి తెలియకుండా ఉంటుందా. అందుకే జగన్ అమరావతి రాజధాని మీద హఠాత్తుగా మోజు పెంచుకున్నారని అంటున్నారు. మూడు వేల కోట్లతో నిర్మాణం పనులు పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తే పనులు మొదలయ్యేటప్పటికి ఈ ఏడాది చివర అవుతుంది. అంటే 2022 కొత్త ఏడాదిలో అమరావతి నిర్మాణాలు అలా సాగుతూండగానే జమిలి ఎన్నికలు వస్తాయన్న మాట. దాంతో అమరావతి వాసులకు ధీమా పెరుగుతుంది. జగన్ సర్కార్ మీద నమ్మకం కలుగుతుంది అన్న ఆలోచనతోనే ఇలా చేస్తున్నారు అంటున్నారు.

విశాఖ సంగతేంటి….?

విశాఖ రాజధానికి జగన్ తలాఖ్ అనేశాడు అని మరో వైపు టీడీపీ అనుకూల మీడియా తెగ ఊదరగొడుతోంది. విశాఖకు మకాం మార్చడం కష్టమన్న అభిప్రాయానికి జగన్ రాబట్టే అమరావతి రాజధాని విషయంలో ఆసక్తిని చూపిస్తున్నారని కూడా వార్తలు వండి వారుస్తున్నారు. టీవీ డిబేట్లలో విశ్లేషణలు కూడా పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. కానీ జగన్ విశాఖను ఏ మాత్రం వదిలిపెట్టరని మంత్రి పేర్ని నాని తాజాగా భారీ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చేశారు. తాము విశాఖ పాలనా రాజధానికి కట్టుబడి ఉన్నామని కూడా ఆయన చెబుతున్నారు. మొత్తానికి జగన్ సర్కార్ అమరావతి మీద ఊహించని ట్విస్ట్ ఇచ్చేసి అక్కడా ఇక్కడా మేమే అన్నట్లుగా పెద్ద సినిమానే టీడీపీకి చూపిస్తోంది అంటున్నారు.

మ్యాటర్ అదేనా…?

జగన్ కి అన్ని ప్రాంతాలు సమానమే అని వైసీపీ నేతలు అంటున్నారు. దానికి తోడు పంచాయతీ ఎన్నికల్లో కూడా వైసీపీకే ఇక్కడి పల్లెలు పట్టం కట్టాయి. దాంతో జగన్ కూడా తనకు ఓటేసిన జనాల కోణం నుంచి కొత్త ఆలోచనలు చేస్తున్నారు అంటున్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో కొత్త భవనాలు విశాఖలో అయినా కట్టడం కష్టమే దాంతో ఉన్న వాటిని పూర్తి చేస్తే తక్కువ ఖర్చుతో బయటప డవచ్చు అన్నది ఆయన ఆలోచన అని చెబుతున్నారు. ఇక విశాఖను పాలనారాజధాని అన్నది ఇప్పటికైతే తేలలేదు అది ఎపుడు జరిగినా కూడా పరిమితంగానే అక్కడ ఎస్టాబ్లిష్ మెంట్ ఉంటుందని కూడా అంటున్నారు. మొత్తానికి జగన్ అమరావతి పేరిట ట్రంప్ కార్డ్ ని బయటకు తీయడం వల్ల వచ్చే రిజల్ట్ ఏంటి అన్నది మునిసిపోల్స్ తో వెంటనే తెలుస్తుంది అంటున్నారు.

Tags:    

Similar News