ఇక జగన్ ను ఢీకొట్టడం కష్టమేనా ?

పల్లెను తల్లి అంటారు. ఆ తల్లి దీవెనలు ఎవరికైతే ఉంటాయో వారికి ఎపుడూ విజయమే వరిస్తుంది. ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీని పెట్టనంతవరకూ పల్లెలు ఇందిరమ్మ నామస్మరణ చేశాయి. [more]

Update: 2021-03-06 02:00 GMT

పల్లెను తల్లి అంటారు. ఆ తల్లి దీవెనలు ఎవరికైతే ఉంటాయో వారికి ఎపుడూ విజయమే వరిస్తుంది. ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీని పెట్టనంతవరకూ పల్లెలు ఇందిరమ్మ నామస్మరణ చేశాయి. కాంగ్రెస్ కే ఓటెత్తి జై కొట్టేవి. అన్నగారుగా జనం ఎదుటకు వచ్చిన రామారావు రాజకీయంతో తమ జాతకాలు మారుతాయని పల్లె జనం భావించారు. నాటి నుంచి ఆయన మరణించేంతవరకూ టీడీపీకే తమ ఓటు అంటూ ఒట్టేసుకున్నాయి. చంద్రబాబు జమానాలో మాత్రం పల్లెలు క్రమంగా దూరమవుతూ వచ్చాయి. అది తాజా పంచాయతీ ఎన్నికలతో పూర్తిగా తెలిసిపోయింది.

జగన్ వైపే ….

జగన్ అంటే పల్లె జనం ఎనలేని మమకారం చూపిస్తున్నారు. జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి వారు దన్నుగా నిలుస్తున్నారు. ఎక్కడైనా ఓట్ల తేడా జరిగి వైసీపీ ఓడితే ఓడవచ్చు కానీ పల్లెలు మాత్రం ఫ్యాన్ పార్టీ నీడలోనే సేదతీరుతూ వచ్చాయి. ఇక 2019 ఎన్నికల్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. 151 సీట్లు వైసీపీకి వచ్చాయంటే దానికి కారణం పల్లెల మద్దతు సంపూర్ణంగా ఉండడమే. అధికారంలోకి వచ్చిన జగన్ కూడా తన సంక్షేమ పధకాలతో గ్రామీణులకు విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ ఫలితాలే ఇపుడు ఓట్ల రూపంలో కురిసాయని అంటున్నారు.

తిరుగులేదుగా….?

నాయకుడు అన్న వాడిని మట్టి వాసన తెలియాలి. పల్లెల పట్ల ప్రేమ ఉండాలి. అది ఉన్న వారికి అసలు తిరుగు ఉండదు. నాడు ఇందిరమ్మ అయినా ఎన్టీయార్ అయినా, వైఎస్సార్ సహా ఎవరైనా కూడా పల్లెల మద్దతు దండీగా ఉండబట్టే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతలు గా నిలిచారు. జగన్ కూడా అందుకే పల్లెలనే నమ్ముకున్నారు. వారి మనసులో నిలిచిపోతే అది శాశ్వతమైన చోటు అని కూడా గ్రహించిన జగన్ వారిని దృష్టిలో పెట్టుకునే తన పధకాలను రూపకల్పన చేశారు. ఏపీ జనాభాలో అరవై శాతం పైగా ఉన్న ఈ పల్లెలే వైసీపీకి శ్రీరామ రక్షగా ఉన్నాయన్నది వాస్తవం.

టీడీపీ ప్లేస్ లో …

అన్న గారి జమానాలో టీడీపీకి పల్లెల్లో మంచి పట్టు ఉండేది, కాంగ్రెస్ ని పట్టణ జనాలు ఆదరించేవారు. అయినా సరే ఎన్టీయార్ మూడు సార్లు బంపర్ విక్టరీ కొట్టి ముఖ్యమంత్రి కాగలిగారు అంటే పల్లెజనం వెల్లువలా ఓట్లేసి గెలిపించడమే. ఇపుడు కూడా అచ్చం అలాంటి వాతావరణమే కనిపిస్తోంది పట్టణాలల్లో జగన్ రాజకీయం పట్ల విమర్శలు ఉన్నా కూడా పల్లె పట్టుల్లో మాత్రం పట్టం కట్టే సీన్ ఉంది. పల్లె చల్లగా చూడాలి కానీ ఎన్ని ఎన్నికలు అయినా సునాయాసంగా నెగ్గేయవచ్చు అని పూర్వపు నాయకులు నిరూపించారు. జగన్ కూడా ఇపుడు అదే బాటలో సాగుతున్నారు. దాదాపుగా పదివేల పై చిలుకు పంచాయతీలను గెలుచుకుని పార్టీని పటిష్టం చేసుకున్న జగన్ ని ఢీ కొట్టడం అంటే కష్టమే అన్న భావన కూడా ఇపుడు ఉంది.

Tags:    

Similar News