జగన్ చెవిలో స్వరూపానంద మంత్రం…?

ఇపుడైతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది కానీ ఇది లేని నాడు ప్రతీ రోజూ ఎక్కడో ఒక చోటా దేవతా విగ్రహాల విద్వంశం, హిందూ [more]

Update: 2021-03-01 11:00 GMT

ఇపుడైతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది కానీ ఇది లేని నాడు ప్రతీ రోజూ ఎక్కడో ఒక చోటా దేవతా విగ్రహాల విద్వంశం, హిందూ మతం మీద దాడులు అంటూ జగన్ మీద ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించేవి. ఒక దశలో ఏపీలో రాజకీయానికి మరే అంశం లేదా అనిపించేలా ఈ మతం చిచ్చు సాగింది. జగన్ అంతటి బలమైన రాజకీయ నేతను ఎదుర్కోవడానికి మతం కార్డు ఒక్కటే పదునైన బాణమా అన్న చర్చ కూడా వచ్చింది. వైసీపీ సర్కార్ పెద్దలు కూడా ఈ విషయంలో ఏం చేయలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

పిలిచిందే తడవుగా …

జగన్ ముఖ్యమంత్రిగా నెగ్గిన వెంటనే స్వరూపానందేంద్ర స్వామిజీ ఆశీస్సుల కోసం విశాఖ శారదాపీఠానికి వచ్చారు ఆ తరువాత ఆయన మళ్లీ ఈ వైపుగా రాలేదు కానీ రెండేళ్ళు గట్టిగా తిరగకుండానే ఆయన మళ్ళీ అక్కడికే రావాల్సివచ్చింది. దానికి కారణం ఏపీలో ఉన్న రాజకీయ పరిణామాలే అంటున్నారు. ఏపీలో హిందూ కార్డుతో ముందుకు సాగాలని బీజేపీ అనుకుంటోంది. టీడీపీ కూడా అదే బాటన నడుస్తోంది. దాంతో ఈ సమస్య నుంచి బయటపడడానికి జగన్ స్వామీజీ పిలిచిందే తడవుగా విశాఖ వచ్చి వాలారని అంటున్నారు.

అదే పరిష్కారమా…?

హైందవ ధర్మం పట్ల అవగాహన ఉన్న వారు వైసీపీ సర్కార్ లో లేకపోవడం పెద్ద లోటుగా అంతా భావిస్తున్నారు. దాని వల్లనే దేవాలయాల మీద దాడులు జరుగుతున్నా వాటిని రాజకీయ కోణం నుంచే ఇంతకాలం చూస్తూ వచ్చారు. అయితే దీనికి సరైన విరుగుడుగా స్వామీజీ జగన్ కి కొన్ని సూచనలు చేసినట్లుగా చెబుతున్నారు. అవేంటి అంటే ధార్మిక పరిషత్ ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలన్నది స్వామీజీ సూచన. గతంలో వైఎస్సార్ ముఖ్యామంత్రిగా ఉన్నపుడు ఏర్పాటు చేశారు. ఇపుడు మళ్ళీ అలాంటిది ఏర్పాటు చేసి హిందూ ధర్మం మీద పూర్తి అవగాహన ఉన్న వారికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది అని జగన్ కి స్వామీజీ సలహా ఇచ్చారని చెబుతున్నారు.

ప్రక్షాళన చేయాలా..?

ఇక దేవాదాయ శాఖను కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం కూడా ఉందని అంటున్నారు. జగన్ సీఎం అయ్యాక అన్ని శాఖల మాదిరిగానే ఆ శాఖను కూడా ఒక మంత్రికి అప్పగించి ఊరుకున్నారు. అయితే నాటి నుంచి నేటి వరకూ హిందూ ధర్మం మీద దాడులు అంటూ విపక్షాలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి. ఇపుడు స్వామీజీ ఆద్వర్యంలో హోమాలకు జగన్ హాజరు కావడం ద్వారా హైందవ విశ్వాసాల పట్ల తనకు ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నారని అంటున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో ధార్మిక పరిషత్ ని ఏర్పాటు చేయడం, దేవాదాయ శాఖలో కీలకమైన మార్పులు తీసుకురావడం ద్వారా బీజేపీ జోరుకు అడ్డుకట్ట వేయడానికి జగన్ ప్రయత్నం చేస్తారని అంటున్నారు. మొత్తానికి జగన్ శారదా పీఠాన్ని ఇకపైన కూడా మరిన్ని సార్లు కూడా సందర్శించే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు.

Tags:    

Similar News