తూకమెంతో తెలుసుకోవానికే….?

ఇప్పటివరకూ తాడేపల్లి కార్యాలయానికే పరిమితమయిన ముఖ్యమంత్రి జగన్ ఇక జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ ఉగాది నుంచి జగన్ రచ్చబండ కార్యక్రమం పేరుతో జిల్లాలను పర్యటించనున్నారు. ప్రధానంగా [more]

Update: 2021-02-27 03:30 GMT

ఇప్పటివరకూ తాడేపల్లి కార్యాలయానికే పరిమితమయిన ముఖ్యమంత్రి జగన్ ఇక జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ ఉగాది నుంచి జగన్ రచ్చబండ కార్యక్రమం పేరుతో జిల్లాలను పర్యటించనున్నారు. ప్రధానంగా గ్రామ ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటన ఉండనుంది. ఏప్రిల్ 13వ తేదీ నుంచి రచ్చ బండ కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ నేతలకు, అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.

ఎప్పుడో ప్రారంభించాల్సి ఉన్నా…..?

నిజానికి జగన్ రచ్చ బండ కార్యక్రమాన్ని ఎప్పుడో ప్రారంభించాల్సి ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండో విడత అధికారంలోకి వచ్చిన తర్వాత రచ్చ బండ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకున్నారు. ఆ కార్యక్రమానికి వెళుతూనే రాజశేఖర్ రెడ్డి మరణించారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తాను రచ్చ బండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది ఈ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది.

రెండేళ్లవుతుండటంతో…..

జగన్ అధికారంలోకి వచ్చి వచ్చే జూన్ నాటికి రెండేళ్లు అవుతుంది. ఈలోగా రచ్చ బండ కార్యక్రమం నిర్వహించాలని జగన్ నిర్ణయించారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను జగన్ అమలు చేశారు. తన పాదయాత్రలోనూ, ఎన్నికల మ్యానిఫేస్టోలోనూ ఇచ్చిన హామీలను 90 శాతం అమలు చేశామని ఆ పార్టీ చెబుతూ వస్తుంది. మరి ఈ రెండేళ్లలో తన పాలనపై ప్రజలు ఏం అనుకుంటున్నారు? అన్న దానిపై జగన్ రచ్చ బండ ద్వారా సమీక్షించనున్నారు. ఎమ్మెల్యేల పనితీరును కూడా తెలుసుకోనున్నారు.

ఎక్కడి నుంచి అన్నదీ…..

అయితే ఈ కార్యక్రమాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించాలన్న దానిపై జగన్ ఇంకా నిర్ణయానికి రాలేదు. కడప జిల్లా నుంచి ప్రారంభించాలని కొందరు సూచించారు. అయితే జగన్ మాత్రం తన తండ్రి ప్రారంభించాలనుకున్న చిత్తూరు జిల్లా నుంచే ఈ రచ్చ బండ కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదంటున్నారు. రచ్చబండను ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా ప్రారంభించే అవకాశాలున్నాయి. మొత్తం మీద దాదాపు రెండేళ్ల తర్వాత జగన్ జనంలోకి వెళుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.

Tags:    

Similar News