జనంలోకి రాలేకపోతున్నారా?

జగన్ జనం మనిషి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పడు ఎప్పుడూ జనంలో ఉండేందుకే ఇష్టపడేవారు. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ ఊరికే కూర్చోలేదు. హోదా సాధన అంటూ [more]

Update: 2021-02-26 02:00 GMT

జగన్ జనం మనిషి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పడు ఎప్పుడూ జనంలో ఉండేందుకే ఇష్టపడేవారు. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ ఊరికే కూర్చోలేదు. హోదా సాధన అంటూ దీక్షలు చేశారు. యువతలో చైతన్యం కల్గించేందుకు యువభేరిలు నిర్వహించారు. ఇక ప్రతి సమస్యపైనా ఆయన స్పందిస్తూ జిల్లాల్లో పర్యటనలు చేసేవారు. అప్పట్లో పార్టీ నేతలు కూడా జగన్ కు సహకరించేవారు. ఇక ఏడాదిన్న పాటు సాగిన జగన్ పాదయాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అధికారంలోకి రాగానే…?

అదే జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూటు మార్చారు. జనంలో ఉండేందుకు ఇష్టపడటం లేదు. కరోనా వల్ల మొన్నటి వరకూ బయటకు రాలేకపోయినా కనీసం తనపైనా, పార్టీపైన, ప్రభుత్వంపైన వస్తున్న ఆరోపణలకు కూడా జగన్ స్పందించడం లేదు. మీడియా సమావేశాలతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. పార్టీ నేతలకు, క్యాడర్ కు కూడా జగన్ దూరంగా ఉండేందుకే ఇష్టపడుతున్నట్లు అర్ధమవుతోంది.

పార్టీనేతలకు కూడా….

జగన్ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు కావస్తుంది. ఈ ఇరవై నెలల్లో పార్టీ నేతలతో సమావేశం అయింది లేదు. ఎమ్మెల్యేలను కలిసిన పాపాన పోలేదు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంది లేదు. దీంతో అనేక నియోజకవర్గాల్లో పార్టీలో విభేదాలు తలెత్తాయి. పదవులు దక్కని నేతలు సయితం అసంతృప్తితో ఉన్నారు. వీరిని బుజ్జగించే ప్రయత్నాలు కూడా జగన్ చేయలేదు. ఈ ఎఫెక్ట్ అనేక నియోజకవర్గాల్లో పంచాయతీ ఎన్నికల్లో కన్పించింది.

ఎఫెక్ట్ పడిందిగా…..

స్థానికసంస్థల ఎన్నికల్లో 90 శాతం విజయం సాధించాలని జగన్ టార్గెట్ పెట్టారు. కానీ ఆ మేరకు వైసీపీ నేతలు విజయం సాధించలేకపోయారు. జగన్ సొంత జిల్లాలో సయితం కొన్ని స్థానాలను టీడీపీ కైవసం చేసుకోగలిగింది. జగన్ ఇరవై నెలల నుంచి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికే పరిమితమయ్యారని, ప్రజలను, పార్టీ క్యాడర్ ను కలిసే ప్రయత్నం చేయకపోవడమే దీనికి కారణమన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. ఇప్పటికైనా జగన్ జనం బాట పడతారా? లేదా క్యాంప్ కార్యాలయానికే పరిమితమవుతారా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News