ఉక్కే కదా అని ఊరుకుంటే తుక్కు చేసేస్తుంది..?

విశాఖ ఉక్కు పరిశ్రమ మామూలుగా ఒక ప్రభుత్వ ఉత్తర్వు జారీతో ఏర్పాటు కాలేదు. అన్ని పరిశ్రమలకు దానికీ చాలా తేడా ఉంది. అయిదు దశాబ్దాల క్రితం ఉమ్మడి [more]

Update: 2021-02-23 14:30 GMT

విశాఖ ఉక్కు పరిశ్రమ మామూలుగా ఒక ప్రభుత్వ ఉత్తర్వు జారీతో ఏర్పాటు కాలేదు. అన్ని పరిశ్రమలకు దానికీ చాలా తేడా ఉంది. అయిదు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీలో ఉన్న మూడు కోట్ల మంది జనం ఒక్కటిగా నిలిచి పోరాడి మరీ సాధిస్తేనే వచ్చింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నేటికీ ఆ నినాదం గంభీర విశాఖ సాగరం తలచుకుంటూనే ఉంటుంది. అందువల్ల ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరం అవుతోంది అంటే ఏపీ మొత్తం రియాక్ట్ అవుతుంది. అంతటి అనుబంధం దానికి ఉంది.

సైలెంట్ గా ఉంటే….?

ముఖ్యమంత్రి జగన్ గత ఇరవై నెలలుగా ఏ మీడియా మీటింగులో కూడా పెద్దగా మాట్లాడలేదు. దాన్ని జనం కూడా సీరియస్ గా తీసుకోలేదు. కానీ విశాఖ ఉక్కు వంటి అతి పెద్ద పరిశ్రమను దారుణంగా కేంద్రం పరాయి పరం చేస్తూంటే 151 సీట్లతో గెలిచిన ముఖ్యమంత్రి నోరు మెదపకుండా సైలెంట్ గా ఉంటే మాత్రం జనం అసలు తట్టుకోలేరు అనే అంటున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో పార్లమెంట్ సాక్షిగా కేంద్రం కుండబద్ధలు కొట్టినా కూడా జగన్ ఒక లేఖ రాసి సైలెంట్ గా ఉండడం వల్ల వైసీపీయే కార్నర్ అవుతుందని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.

అదే నిజమని…

చంద్రబాబు హయాంలోనే పోస్కో ప్రతినిధులు విశాఖ స్టీల్ ప్లాంట్ ని సందర్శించి ఉండవచ్చు. దాన్ని వైసీపీ పెద్దలు ఇపుడు ప్రచారం చేయవచ్చు. కానీ ఏకంగా పోస్కో ప్రతినిధులతో జగన్ చర్చలు జరిపిన సంగతి మీడియా సాక్షిగా వచ్చింది. దాన్నే ఇపుడు జనంలో పెట్టి మరీ టీడీపీ జగన్ ని సంజాయిషీ కోరుతోంది. తాను పోస్కో ప్రతినిధులతో కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టమన్నాను అని జగన్ చెప్పి ఉంటే అదే మీడియా ముఖంగా అయినా వెల్లడించాలి. లేకపోతే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ జగన్ సమ్మతితోనే జరుగుతోందని జనం కచ్చితంగా భావించే ప్రమాదం ఉంది.

ఎందుకు జంకు…?

ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి వైసీపీ సర్కార్ గట్టి ప్రయత్నం చేయాలి. ఆ మీదట తప్పో ఒప్పో కేంద్రం మీద పడుతుంది. ఏపీ ముఖ్యమంత్రిగా ఈ విషయంలో జగన్ మీద పెద్ద బాధ్యత ఉంది. అల‌నాడు విశాఖ ఉక్కు ఉద్యమం రగిలినపుడు కొన్ని నెలల పాటు అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డికి కంటి మీద కునుకే లేదు. ఆయన స్వయంగా మీడియా ముందుకు వచ్చారు. ఢిల్లీకి కూడా ఉరుకులు పరుగులు తీశారు. మరి ఇపుడు జగన్ ఆ సీట్లో కూర్చున్నారు. ఉలుకూ పలుకూ లేకుండా ఆయన ఇలాగే ఉంటే మాత్రం రేపటి రోజున కేంద్రం తన ప్రైవేటీకరణను చక్కగా పూర్తి చేసి తీరుతుంది. బీజేపీకి ఏపీలో ఏమీ లేదు, కొత్తగా పోయిందీ కూడా లేదు, కానీ జగన్ మీద మాత్రం జనాగ్రహం వెల్లువలా మారితే వైసీపీ పునాదులే కదులుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక జగన్ తాను నాయకత్వం వహించి ఢిల్లీకి అఖిల పక్ష బృందాన్ని ఎందుకు తీసుకువెళ్లరు అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి ఉక్కే కదా అని తేలికగా తీసి పారేస్తే అదే వైసీపీ పీక కోసేస్తుందని కౌంటర్లు గట్టిగానే పడుతున్నాయి.

Tags:    

Similar News