జగన్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లేనా ?

కేంద్రంలోని బీజేపీ చాలా తెలివిగా రాజకీయ చదరంగం ఆడుతోంది. కర్ర విరగకుండా పాము చావకుండా ఎత్తులు వేయడంతో బీజేపీకి సరిసాటి ఎవరూ లేరు అని చెప్పాల్సిందే. మూడు [more]

Update: 2021-02-15 15:30 GMT

కేంద్రంలోని బీజేపీ చాలా తెలివిగా రాజకీయ చదరంగం ఆడుతోంది. కర్ర విరగకుండా పాము చావకుండా ఎత్తులు వేయడంతో బీజేపీకి సరిసాటి ఎవరూ లేరు అని చెప్పాల్సిందే. మూడు రాజధానుల విషయంలో ఎటూ తేల్చకుండా ముంచకుండా ఇన్నాళ్ళు దాగుడుమూతలు ఆడిన బీజేపీ సమయానుకూలంగా మాత్రం ప్రకటనలు అలా చేస్తూ వస్తోంది. హై కోర్టులో విచారణ వేళ రాజధాని ఎక్కడ ఉండాలి అన్నది తమకు సంబంధం లేదని చెప్పుకొచ్చిన కేంద్రం మరో వైపు ఏపీలో బీజేపీ నేతల చేత అమరావతే మన రాజధాని అనిపిస్తుంది. జగన్ ఢిల్లీకి వెళ్ళి మూడు రాజధానుల మీద వినతులు చేస్తే మారు మాట్లాడకుండా స్వీకరిస్తుంది.

చేతులు దులుపుకుందా …?

జగన్ మూడు రాజధానుల విషయంలో బీజేపీని కూడా నెమ్మదిగా ఇరికించారు. అదెలాగంటే కర్నూలు లో హై కోర్టు ఏర్పాటు. అది బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ తో పాటు 2019 ఎన్నికల ప్రణాళికలో కూడా ఉంది. అయితే బీజేపీకి తానుగా అధికారంలోకి వస్తే ఆ హామీ నెరవేర్చడం వేరు. ఏపీలో జగన్ దాన్ని అమలు చేసి క్రెడిట్ కొట్టేయడం వేరు. మరి ఈ తేడాను అర్ధం చేసుకోలేని అమాయకత్వం బీజేపీకి లేదు. అందుకే ఆ పార్టీ గత ఏడాదిగా ఇదే విషయం నాన్చుతూ వస్తోంది. తాజాగా పార్లమెంట్ లో రవిశంకర్ ప్రసాద్ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకి ఇచ్చిన సమాధానంలో కర్నూల్ లో హైకోర్టు ప్రతిపాదన అన్నది ఏడాది క్రితమే జగన్ సర్కార్ కేంద్రానికి పంపిందని గుర్తు చేశారు. అంటే నాటి నుంచి దాని అలాగే ఉంచారన్న మాట. ఇపుడు మాత్రం హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వం కలసి కూర్చుని ఏకాభిప్రాయానికి రావాలని కేంద్ర మంత్రి చెప్పేశారు.’

జరిగే పనేనా..?

ఏపీ ప్రభుత్వానికి హై కోర్టుని కర్నూల్ కి తరలించడం అన్నది అతి ముఖ్యమైన అజెండా. మరి హై కోర్టు దీనికి అంగీకరించాలి. అంటే ప్రభుత్వం దీని మీద మాట్లాడి ఒప్పించాలి. ఇపుడు చూస్తే ఏపీ సర్కార్ అనేక జీవోలు హై కోర్టులో కొట్టివేతకు గురి అవుతున్నాయి. అదే సమయంలో హై కోర్టు మీద వైసీపీ నేతలు విమర్శలు చేసిన సందర్భం ఉంది. మరి అలాంటి వేళ సామరస్య భావనకు ప్రభుత్వం ప్రయత్నం ఇంతవరకూ చేయలేదు. కొత్త ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన జగన్ ఆ తరువాత మళ్ళీ తన పనుల్లో తానున్నారు. ఇపుడు ఎటూ కేంద్రం ఈ బాధ్యతను రాష్ట్రానికి వదిలేసింది కాబట్టి చర్చలు జరపాలి. మరో వైపు కేంద్రంలోని పెద్దలకు ఇష్టం ఉంటేనే హై కోర్టు తరలివెళ్తుంది అన్నది లోపాయికారీ వ్యవహారం.

సాగతీతకేనా?

ఇప్పటికే మూడు రాజధానుల కధ హై కోర్టులో విచారణ దశలో ఉంది. అది ఎప్పటికి తెములుతుంది అన్నది తెలియది. ఇక హై కోర్టు తరలింపు కూడా అందులో భాగం కాబట్టి తీర్పు వచ్చే వరకూ ఆగాల్సిందేనా అన్న మాట కూడా న్యాయ నిపుణుల నుంచి వినిపిస్తోంది. ఇక మరో వైపు అన్నీ అమరావతిలోనే ఉంచాలంటూ రైతులు వేసిన కేసులో వారికి అనుకూలంగా తీర్పు వస్తే ప్రభుత్వం సుప్రీం ని ఆశ్రయిస్తుంది. లేకపోతే వ్యతిరేకంగా వచ్చినా కూడా రెండో వారు హై కోర్టుకు వెళ్తారు. అందువల్ల అంత ఇది పూర్తిగా సాగతీత కోసమే కేంద్రం ఇలా మాట్లాడి తప్పుకుందని అంటున్నారు. నిజానికి చంద్రబాబు అమరావతి లో హై కోర్టు అన్నపుడు ఎవరిని సంప్రదించారని అన్న ప్రశ్న ఉంది. ఇపుడు జగన్ ప్రభుత్వం కూడా కర్నూల్ లో పెడుతూ చట్టం చేసింది కాబట్టి దాని మీద తీర్పును చూసుకుని మార్చుకోవచ్చా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా కేంద్రంలోని బీజేపీ మాత్రం అటు అమరావతి మీద ఆశలతో ఉంది, ఇటు కర్నూలు మీద పేరాశతోనూ ఉంది. దాంతో ఏదీ తేల్చకుండా మొత్తం మీ చేతుల్లోనే అంటూ జగన్ ని మాత్రం భలేగా ఇరికిస్తోంది అంటున్నారు. దీని మీద టీడీపీ అనుకూల మీడియా అయితే హై కోర్టు మార్చడం ఎప్పటికీ జరగదు అంటూంటే వైసీపీ పెద్దలు మాత్రం మాకే అధికారం కేంద్రం ఇచ్చిందని అంటున్నారు.

Tags:    

Similar News