ఇలా భయపడితే కష్టమే జగన్…?

బీజేపీకి జగన్ భయపడుతున్నారా? తన కేసుల కోసమే రాష్ట్ర ప్రయోజనాల కోసం గొంతు విప్పడం లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రతి సారీ కేంద్ర బడ్జెట్ [more]

Update: 2021-02-12 11:00 GMT

బీజేపీకి జగన్ భయపడుతున్నారా? తన కేసుల కోసమే రాష్ట్ర ప్రయోజనాల కోసం గొంతు విప్పడం లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రతి సారీ కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరగుతూనే ఉంది. అయినా వైఎస్ జగన్ మాత్రం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు విప్పడం లేదు. గత రెండేళ్లుగా చూసుకుంటే కనీసం రాష్ట్ర రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం లేదు.

భవిష్యత్ లో ఇబ్బందులే…

ఇది జగన్ ప్రభుత్వానికి భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవంటున్నారు. కేవలం సంక్షేమ పథకాలను అమలు చేసినంత మాత్రాన ఓట్లు వచ్చి రాలవు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా అదే దిశగా కొనసాగాలి. కానీ గత రెండేళ్లలో ఏపీలో సంక్షేమం తప్ప అభివృద్ధి ఊసు కన్పించడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని జగన్ భయపెట్టే పరిస్థితుల్లో లేరన్నది వాస్తవం. బీజేపీ సంఖ్యాపరంగా పార్లమెంటులో బలంగా ఉంది. రాజ్యసభలో మాత్రం వైసీపీ అవసరం బీజేపీకి ప్రతి అంశంలోనూ కన్పిస్తుంది.

బిల్లుల ఆమోదం సమయంలోనూ….

కనీసం బిల్లుల ఆమోదం సమయంలోనైనా జగన్ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కొన్ని షరతులు విధిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. జగన్ ఈ ఏడాదిలోనే అనేక సార్లు ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను సయితం కలిసి వస్తున్నారు. అయినా రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒరిగింది ఏమీ లేదన్న కామెంట్స్ మాత్రం బలంగా విన్పిస్తున్నాయి.

జగన్ ఢిల్లీ పర్యటనలను….

మరి జగన్ ఢిల్లీ పర్యటనలను ఎందుకు చేపడుతున్నట్లు? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర కనీస అవసరాలను కూడా తీర్చలేకపోయిందని అంటున్నారు. మరి బీజేపీతో ఎందుకు సఖ్యతగా ఉన్నట్లు? అన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విపక్షాలకు జగన్ అవకాశం ఇచ్చినట్లయింది. అందుకే చంద్రబాబు పదే పదే జగన్ ఢిల్లీ వెళ్లి ఏం చేస్తున్నారన్న ప్రశ్నను వేస్తున్నారు. తన కేసుల కోసమే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆయన చేసిన విమర్శలను ప్రజలు నిజం అనుకునే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News