జగన్ కు ఇప్పుడు కావాల్సింది అదేనట

జగన్ కు మొండి ధైర్యం. తాను అనుకున్నదే చేయాలనుకుంటారు. అందుకు ఎవరు అడ్డంపడినా సహించరు. పార్టీ నిర్ణయాలను ఎలాగైనా తీసుకోవచ్చు. ఎందుకంటే పార్టీలో జగన్ సుప్రీం. పార్టీ [more]

Update: 2021-01-30 13:30 GMT

జగన్ కు మొండి ధైర్యం. తాను అనుకున్నదే చేయాలనుకుంటారు. అందుకు ఎవరు అడ్డంపడినా సహించరు. పార్టీ నిర్ణయాలను ఎలాగైనా తీసుకోవచ్చు. ఎందుకంటే పార్టీలో జగన్ సుప్రీం. పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నష్టపోయేది.. ఫలితం అనుభవించేది జగన్. కానీ ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చుట్టూ ఉన్న వారంతా అనుభవంలేని వారే. ఒక్క బొత్స సత్యానారాయణ తప్పించి పాలనానుభవం ఎవరికీ పెద్దగా లేదు.

అందరూ యువకులే….

ఉన్న వాళ్లంతా యువకులు. వాళ్లంతా దూకుడు మీద ఉంటారు. జగన్ కనుసైగ చేయకముందే కాల్చి వచ్చే రకం. దీంతోనే అసలు సమస్య వచ్చిపడుతుందంటున్నారు. గత నెలరోజులుగా నడుస్తున్న నిమ్మగడ్డ ఎపిసోడ్ లో జగన్ కు ఎవరైనా సరైన సలహాలు ఇచ్చారా? అంటే లేదు. ఎందుకంటే అనుభవం ఉన్న నేతలు మంత్రి మండలిలో లేకపోవడమే. నిమ్మగడ్డ వేసే ప్రతి అడుగును రాజ్యాంగ బద్ధంగా, న్యాయపరంగా ఎదుర్కొనాల్సి ఉంటుంది.

సీనియర్ నేతలందరూ….

అయితే అనుభవరాహిత్యంతో జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అనుకూలంగా మారాయంటున్నారు. సీనియర్ నేతలైన ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డి లాంటి నేతలు పార్టీలో ఉన్నప్పటికీ వారు ఈ ఎపిసోడ్ లో ఎంటర్ కాలేదు. దీనికి కారణం తమకు ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడమే. నిమ్మగడ్డ వెనక చంద్రబాబు ఉన్నారన్నది వైసీపీ ఆరోపణ. దీనిని ధీటుగా ఎదుర్కొనాలంటే సీనియర్ల అవసరం జగన్ కు ఉంటుందన్న కామెంట్స్ బలంగా విన్పిస్తున్నాయి.

జగన్ చెప్పిందే వేదం…..

ఉన్న కొద్ది మంది నేతలు జగన్ చెప్పిందే అమలు పర్చే రకం. అలా వద్దని చెప్పే మనస్తత్వం కూడా ఇప్పుడున్న కొందరి మంత్రులకు లేదు. ఎందుకంటే జగన్ తమకు మంత్రి పదవి ఇచ్చారన్న భక్తి కారణం. ఇలా కీలక సమయాల్లో పార్టీ, ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సీనియర్ నేతల సలహాలు అవసరం అంటారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సయితం కీలక నిర్ణయం తీసుకునే ముందు నాలుగు రకాలుగా ఆలోచించి నలుగురిని సంప్రదించేవారని చెబుతారు. అందుకే పార్టీలో టాక్ ఇప్పుడు జగన్ కు నిజాలను నిక్కచ్చిగా చెప్పగలిగే అసలైన, సిసలైన సలహాదారు కావాలంటున్నారు.

Tags:    

Similar News