జగన్ అసెంబ్లీని రద్దు చేస్తాడా…?

అసెంబ్లీ రద్దు..ఇది నిజంగా వినడానికే పెద్ద మాట. ఈ రకంగా గతంలో ఉమ్మడి ఏపీలో నాటి సీఎం ఎన్టీ రామారావు చేశారు. ఆయన 1984న నాదెండ్ల భాస్కర [more]

Update: 2021-01-29 05:00 GMT

అసెంబ్లీ రద్దు..ఇది నిజంగా వినడానికే పెద్ద మాట. ఈ రకంగా గతంలో ఉమ్మడి ఏపీలో నాటి సీఎం ఎన్టీ రామారావు చేశారు. ఆయన 1984న నాదెండ్ల భాస్కర రావు చేతిలో వెన్నుపోటుకు గురి అయి అనంతరం నెల తరువాత పాలనా పగ్గాలు చేపట్టారు. అయితే ఉన్న వారిలో తన వారు ఎవరో పరవారు ఎవరో తెలియక ఆయన అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు, పెద్ద మెజారిటీతో గెలిచారు. ఇక 1995 ఆగస్ట్ సంక్షోభంలో కూడా ఎన్టీయార్ ఇదే ట్రిక్ ప్లే చేద్దామంటే కుదరలేదు. ఎందుకంటే అప్పటికి కేవలం ఎనిమిది నెలలు మాత్రమే అయింది ప్రభుత్వం వచ్చి. దాంతో టీడీపీ ఎమ్మెల్యేలు ఈ కారణంగా కూడా చంద్రబాబు వైపు మొగ్గారని అంటారు.

ఎందుకలా……?

ముందు నుంచి చెప్పుకుంటున్నట్లుగా జగన్ కి ఎన్టీయార్ కి వ్యవహార శైలిలో దగ్గర పోలికలు చాలా ఉన్నాయి. ఇద్దరికీ పట్టుదల ఉంది. తమ మాటే నెగ్గాలన్న పంతం ఉంది. అయితే ఎన్టీయార్ కి రాజకీయాలు తెలియక అలా చేశారు. అన్నీ తెలిసినా కూడా జగన్ ఇదే దోవన నడుస్తున్నారు. చిన్న విషయాలకు కూడా ఆయన‌ తెగేదాకా లాగుతూ అభాసుపాలు అవుతున్నారన్న మాట ఉంది. ఇదిలా ఉంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ నాయకత్వంలో లోకల్ బాడీ ఎన్నికలను జరపడం ఇష్టం లేని జగన్ ఒక దశలో అసెంబ్లీని రద్దు చేద్దామన్నంత కఠిన నిర్ణయం వైపు వెళ్ళారన్నది ఇపుడు చర్చగా ఉంది. అసలు ఈ విషయం కూడా సొంత పార్టీ వారికి తెలుసో లేదో కానీ టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు జగన్ అసెంబ్లీ రద్దు చేద్దామనుకున్నారంటూ తాజాగా బాంబు పేల్చారు.

అతి ధీమాతోనా..?

ఏపీలో క్షేత్ర స్థాయి పరిస్థితి అసలు జగన్ కి తెలుస్తోందా అన్నదే ఇక్కడ ప్రశ్న. టీడీపీ దారుణంగా ఓడి ఉండవచ్చు. పవన్ రెండు చోట్ల ఓడి జనసేన కునారిల్లి ఉండవచ్చు. బీజేపీకి తాడూ బొంగరం లేకపోవచ్చు. ఉన్నఫళంగా కానీ అసెంబ్లీ రద్దు చేసిఎన్నికలకు వెళ్తే మళ్ళీ వీరంతా ఒక్కటి అవుతారు. మూకుమ్మడిగా ఎదురు నిలిచి మరీ వైసీపీని ఓడించే పనికి పూనుకుంటారు. మరో వైపు జనాలు కూడా అకారణంగా అసెంబ్లీ రద్దు అంటే కచ్చితంగా రివర్స్ అవుతారు. దానికి సహేతుకత ఉండాలి. అప్పట్లో ఎన్టీయార్ కి వెన్నుపోటు జరిగింది అన్న సానుభూతి ఉంది కాబట్టి గెలిచారు. ఇపుడు జగన్ కేవలం పట్టుదలతో అసెంబ్లీ రద్దు చేస్తే ఇబ్బందులు తప్పవన్న మాట కూడా ఉంది.

మైండ్ గేమా…?

ఇక ఈ వార్త ఎంత నిజమో కానీ తెలుగుదేశం మాత్రం ఒక వ్యూహం ప్రకారమే జనాల్లోకి తెచ్చిపెడుతోంది అన్న మాట కూడా ఉంది. ఇక రెండేళ్ళు గట్టిగా పూర్తి కానీ వైసీపీ ఎమ్మెల్యేలు మళ్లీ ఎన్నికలు అంటే అధికార పార్టీ మీదనే గుస్సా అవుతారు. అంటే ఇది 1995లో ఎన్టీయార్ ఎపిసోడ్ మాదిరిగానే ఉంటుందన్న మాట. వారిని మచ్చిక చేసుకోవడానికా. లేక వైసీపీలో తిరుగుబాటు తేవడానికా అన్నట్లుగా మాజీ మంత్రి దేవినేని మాటలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి జగన్ మనస్తత్వతం తెలిసిన వారు అసెంబ్లీ రద్దుకు ఆయన ఆలోచించి ఉండరు అంటే నమ్మలేరు కానీ ఆయన మదిలో అలాంటి ఆలోచన కనుక పుడితే మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలలో వణుకు స్టార్ట్ అయినట్లే. ఇక స్థానిక ఎన్నికల తరువాత వైసీపీకి మంచి మెజారిటీ వచ్చి జనాల్లో ఆదరణ కనుక 2019 మాదిరిగా ఉంటే మళ్ళీ అసెంబ్లీ రద్దు ఆలోచనలు జగన్ చేయకుండా ఉంటారా అన్న మాట కూడా ఉంది. ఏది ఏమైనా ఇది ప్రచారంగా అనుకున్నా ఏపీ రాజకీయాల్లో మాత్రం వైరల్ అవుతోంది.

Tags:    

Similar News