జగన్ స్కీములు వర్కౌట్ కావట…?

ఎన్నికల్లో గెలిచేందుకు ఏం కావాలి అన్నది తలపండిన రాజకీయ నేతలు కూడా చెప్పలేరు. ఎవరు ఎందుకు గెలుస్తారు, ఎందుకు ఓడతారు అన్నది కూడా ఒక్కోసారి తెలియకపోవచ్చు. అంతెందుకు [more]

Update: 2021-02-02 06:30 GMT

ఎన్నికల్లో గెలిచేందుకు ఏం కావాలి అన్నది తలపండిన రాజకీయ నేతలు కూడా చెప్పలేరు. ఎవరు ఎందుకు గెలుస్తారు, ఎందుకు ఓడతారు అన్నది కూడా ఒక్కోసారి తెలియకపోవచ్చు. అంతెందుకు 2019 ఎన్నికల్లో తాను ఎందుకు ఓడిపోయాను అన్నది చంద్రబాబుకు ఇప్పటికీ తెలియడంలేదు కదా. మరి అటువంటి చంద్రబాబు జగన్ మాత్రం ఓడిపోతాడంటూ తాజాగా జోస్యాలు చెబుతున్నారు. అది కూడా ఏకంగా తమ్ముళ్లతో జూమ్ యాప్ మీటింగులు పెట్టి ఊదరగొడుతున్నారు. జగన్ మీద మోజు తీరిపోయిందని కూడా బాబు లెక్కవేస్తున్నారు.

జనాలు ఓట్లేయరా….?

చేతికి ఎముక లేనట్లుగా ఏపీలో జగన్ అనేక స్కీములు అమలు చేస్తూ వస్తున్నారు. అప్పులు చేసి మరీ పేదల ఖాతాలో నగదు బదిలీ చేస్తున్నారు. కరోనా వంటి విపత్కర సమయంలో కూడా ఎక్కడా ఏ ఒక్క స్కీమూ ఆపకుండా జగన్ చేసుకొచ్చారు. వైసీపీకి అతి పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అని ఎవరైనా అడిగితే స్కీములే అని చెబుతారు. ఏపీలో డెబ్బయి అయిదు వేల కోట్ల రూపాయలను నేరుగా జనం ఖాతాల్లోకి మళ్ళించిన ఘనత జగన్ దే. ఇక ఏపీలో కోటిన్నరకు పైగా కుటుంబాలకు జగన్ ఫలితాలు అందాయి. ఇందులో సగం మంది ఓట్లేసినా జగన్ మళ్ళీ మళ్లీ సీఎం అవుతారని విశ్లేషకులు కూడా అంటున్నారు. మరి ఆ జనం సరైన సమయానికి ఓటేయరా అన్నదే ప్రశ్న.

హక్కు కింద భావిస్తే …?

జనాల్లో రాను రానూ చైతన్యం వస్తోంది. అది మంచికా చెడ్డకా అన్నది పక్కన పెడితే ఒక ఎన్నికలో అందరు అభ్యర్ధుల నుంచి డబ్బు తీసుకుంటున్న ఓటరు ఒకే ఓటు వేస్తాడు. అంటే మిగిలిన వారిని తాను అన్యాయం చేసినట్లే కదా. అయితే ఇక్కడే ఓటరు థియరీ వేరుగా ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ మీద విరక్తి కలిగితే ఓటు కచ్చితంగా వ్యతిరేకంగా వేస్తాడు. అలాగని మడికట్టుకుని డబ్బులు తీసుకోకుండా ఉండడు. ఏమంటే అవి తమ దగ్గర తీసుకున్న డబ్బులేనని తమకు వాటి మీద హక్కు ఉందని లాజిక్ చెబుతాడు. ఇలా ఆలోచించే 2019 ఎన్నికల ముందు చంద్రబాబు పంచిన పసుపు కుంకుమ డబ్బులు తీసుకుని మరీ కసిగా జనం జగన్ పార్టీకి గుద్దేశారు. మరి అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉంటే కనుక ఎన్ని స్కీములు తెచ్చినా ఓట్లు పడవు అన్నది చంద్రబాబు స్వీయ అనుభవం. అదే జగన్ కి కూడా ఆయన అప్లై చేసి మరీ తమ్ముళ్లకు ధైర్యం చెబుతున్నారుట.

డౌటే లేదుటగా..?

ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చి ఇరవై నెలలు అవుతోంది. ఇప్పటికే జనాల్లో వ్యతిరేకత పెద్ద ఎత్తున వచ్చేసింది అని చంద్రబాబు ఒక అంచనాకు వచ్చారట. జగన్ పాలనలో అభివృద్ధి లేదని, పైగా మంత్రులు, ఎమ్మెల్యేల భాష బాగులేదని, దౌర్జన్యాలు పెరిగిపోయాయని కూడా బాబు అంటున్నారు. వైసీపీతో పోలిస్తే టీడీపీయే బెటర్ అని జనం అనుకుంటున్నారుట. మరి బాబు ధీమా ఏమో కానీ తమ్ముళ్ళకు మాత్రం గట్టిగానే హిత బోధ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పంచాయతీ ఎన్నికల్లో సైకిల్ జోరుగా పరుగులు తీయాలని కూడా అంటున్నారు. ఇక్కడ నుంచే వైసీపీఎ పతనం మొదలు కావాలని కూడా బాబు పిలుపు ఇస్తున్నారు. వైసీపీ మీద మరీ అంత మోజు తీరిపోయిందా. జగన్ ఇచ్చిన స్కీములేవీ అసలు పనిచేయవా. లేక బాబు ఇంకా భ్రమల్లో ఉన్నారా. రానున్న వరస ఎన్నికలు ఈ సందేహాలను తేల్చేస్తాయిగా.

Tags:    

Similar News