జగన్ ని అడ్డుకోగలరా?

ముఖ్యమంత్రి జగన్ ఏడు నెలల పాలన గమనిస్తే ఆయన తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుపోతున్నారు. ఆయన తాను ఇచ్చిన అన్ని ఎన్నికల హామీలను వరసగా నెరవేర్చాలని తపన [more]

Update: 2019-12-25 02:00 GMT

ముఖ్యమంత్రి జగన్ ఏడు నెలల పాలన గమనిస్తే ఆయన తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకుపోతున్నారు. ఆయన తాను ఇచ్చిన అన్ని ఎన్నికల హామీలను వరసగా నెరవేర్చాలని తపన పడుతున్నారు. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్నపుడు టీడీపీ మీద ఏ రకమైన ఆరొపణలు చేశారో వాటి విషయంలో సీరియస్ గానే దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా అమరావతి, పోలవరం, ప్రైవేట్ విద్యుత్ ఒప్పందాలు వంటి విషయాల్లో జగన్ ఎవరి మాట వినే పరిస్థితి లేదని అంతా అంటున్నదే. ఇక జగన్ తాను ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఎంత దూరమైన వెళ్తారని ఆయన పదేళ్ళ రాజకీయ జీవితం చెప్పకనే చెబుతోంది. ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఇసుక పాలసీ విషయంలో కానీ, సర్కార్ బడుల్లో ఆంగ్ల బోధన వ్యవహారంలో కానీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు.

బీజేపీ దిగుతుందా…?

నిజానికి కేంద్రం జగన్ విషయంలో ఎపుడో జోక్యం చేసుకుంది. ప్రైవేట్ విద్యుత్ ఒప్పందాల సమీక్ష మానుకోవాలని కేంద్ర మంత్రుల స్థాయిలో హెచ్చరించారు. అయినా జగన్ ముందుకే వెళ్ళారు. పోలవరం విష‌యంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అయితే జగన్ మీద గుస్సాగా ఉన్నారు. పాత నవయుగ కాంట్రాక్ట్ ని రద్దు చేయడం పైనా బీజేపీకి పెద్ద కోపాలే ఉన్నాయి. అయినా జగన్ ఎక్కడా ఆగలేదు. ఇపుడు అమరావతి రాజధాని విషయం వచ్చింది. ఎలాగైనా కేంద్రాన్ని రంగంలోకి దింపి జగన్ కి ముకుతాడు వేయాలన్నది బీజేపీలోని టీడీపీ అనుకూలరతో పాటు, టీడీపీ పెద్దల ఆలోచంగా ఉంది.

వినే పరిస్థితి ఉందా…?

ఇపుడు జగన్ చేస్తున్నది ఆయన నమ్ముతున్నదీ ఒక్కటే. తాను విశాలమైన ఏపీ ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నానని అంటున్నారు. మూడు రాజధానులతో అభివృధ్ధి సాగుతుందని కూడా నమ్ముతున్నారు. మరో వైపు లక్ష కోట్లు అమరావతి రాజధాని నిర్మాణానికి అవుతుందని చెబుతున్నారు. ఒకవేళ బీజేపీ పెద్దలు రంగంలోకి దిగితే జగన్ వింటారా అన్నదే ఇక్కడ ప్రశ్న. అంత కాదు. ఏపీ అప్పులతో ఖజనా గుల్ల అయిందని కూడా జగన్ వారికి బీద కధ వినిపిస్తారు. దానికి బీజేపీ పెద్దల నుంచి జవాబు ఉంటుందా. ఎలాగైనా అమరావతిలో రాజధాని కట్టాల్సిందేనని బీజేపీ అనగలిగే స్థితిలో ఉందా అన్నది కూడా చూడాలి. ఒకవేళ అలాగే అంటే నిధులు దండీగా ఇమ్మని జగన్ గట్టిగానే నిలదీస్తారు. దానికి కాషాయం పార్టీ దగ్గర ఇంకేం సమాధానం ఉంటుందన్నది కూడా మరో చర్చ.

అంత సీన్ ఉందా…?

నిజానికి బీజేపీ పరిస్థితి జాతీయ స్థాయిలో ఇపుడు బాగా తగ్గిపోయింది. ఏడు నెలల క్రితం అధికారంలోకి వచ్చినపుడు ఉన్న వెలుగులు ఇపుడు లేవు. ఎటు చూసినా పరాజయాలు, అనేక రకాలైన వివాదాలతో బీజేపీ సతమతమవుతోంది. వరసగా మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ఇలా బీజేపీ తన సీట్లను, అధికారాన్ని ఒక్కోటిగా కోల్పోతోంది. మిత్రులు కూడా దూరంగా జరుగుతున్నారు. ఈ నేపధ్యంలో ఢిల్లీలో బలంగా ఉండేందుకు బీజేపీ దృష్టి పెడుతోంది. అంతే తప్ప ఏపీలో జగన్ తో గిల్లి కజ్జాలు పెట్టుకుని ఆయన్ని దూరం చేసుకునే సాహసం చేస్తుందా అన్నది కూడా ఇంకో చర్చగా ఉంది. అయితే దింపుడు కళ్ళెం ఆశలా బీజేపీలోని మాజీ తమ్ముళ్ళు మాత్రం జగన్ సంగతి ధిల్లీలో తేలుస్తామని వార్నింగులు ఇస్తున్నారు. అది కుదిరే పనేనా.

Tags:    

Similar News