జగన్ మీద మోజు ఎందుకో…?

ఏ రంగంలోనైనా ఉత్తమం అనిపించుకోవడానికే ఎవరైనా ప్రయత్నం చేస్తారు. ఇక రాజకీయాల్లో ఉన్నవారికి ఉత్తమం అన్న మాట కడు దూరం. ఎంత చేసినా ఇంకా చేయలేదు అన్న [more]

Update: 2019-08-18 08:00 GMT

ఏ రంగంలోనైనా ఉత్తమం అనిపించుకోవడానికే ఎవరైనా ప్రయత్నం చేస్తారు. ఇక రాజకీయాల్లో ఉన్నవారికి ఉత్తమం అన్న మాట కడు దూరం. ఎంత చేసినా ఇంకా చేయలేదు అన్న మాటే వినిపిస్తుంది. అయితే అధికారంలోకి వచ్చిన రెండున్నర నెలల్లోనే బెస్ట్ సీఎం అనిపించుకోవడం ఓ విధంగా జగన్ కు మంచి బూస్టప్ గానే భావించాలి. వీడీపీ అసోసియేట్స్ అనే సంస్థ దేశంలోని ముఖ్యమంత్రుల పనితీరుపై తాజాగా చేప‌ట్టిన సర్వేలో జగన్ మంచి స్థానంలో నిలిచారు. సీనియర్లుగా ఉన్న ఒడిషా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రుల తరువాత మూడవ స్థానంలో జగన్ నిలవడం అభినందించాలి. అంటే ఏపీ ప్రజానీకం జగన్ మీద మంచి నమ్మకంతో ఉన్నారని ఈ సర్వే ఫలితాలను బట్టి అర్ధమవుతోంది. అదే జగన్ కి ఎప్పటికీ శ్రీరామ రక్షగా ఉంటోంది.

జగన్ చేస్తాడని ఆశ….

జగన్ మాట ఇస్తే తప్పరని, తప్పకుండా చేస్తారని ఏపీలోని మెజారిటీ ప్రజలు నమ్ముతారు. ఇక వైసీపీ నేతలు కూడా జగన్ మాట ఇస్తే తీర్చుకుంటరని గట్టిగా భావిస్తారు. అంతెందుకు టీడీపీ నేతలు కూడా జగన్ మాట మీద నిలబడే మనిషి అంటారు. ఆ విషయం చంద్రబాబుకు కూడా బాగా తెలుసు. కాబట్టే అసెంబ్లీలో జగన్ చేసిన ఒకే ఒక ప్రకటనతో ఇపుడు నిశ్చింతగా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకోను అని జగన్ కచ్చితంగా చెప్పాక బాబుకు తన ఎమ్మెల్యేల కంటే కూడా జగన్ మీదనే నమ్మకం ఎక్కువగా ఉందని కూడా అంటారు. ఇక ఏపీలో పరిస్థితులు ఏ మాత్రం బాగులేవు. ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు జగన్ నుంచి ఎదురైన పెద్ద పోటీని తట్టుకోవడానికి అప్పులు కుప్పలు చేసి పరిస్థితి మరింత దిగజార్చారు. జనాని తన వైపు తిప్పుకునేందుకు బాబు చేసిన అనేక పనులు ఖజానాను పూర్తిగా ఖాళీ చేశాయి. ఇక పదేళ్ల పాటు తన పార్టీలో కాచుకుని ఉన్న వారికి కాంట్రాక్టులు ఇబ్బడి ముబ్బడిగా కట్టబెట్టి అవినీతికి పెంచి పెద్దది చేశారని బాబుకు పేరొచ్చింది. అదే ఇపుడు జగన్ కి గుదిబండగా మారుతోంది.

నిలబెట్టుకోగలరా…

జనం అంటే జలంతో సమానం. జలం ఎపుడూ తిన్నగా అక్కడే ఉండదు, ఎటు వీలు అయితే అటు పారుతుంది అలాగే ప్రజల్లో కూడా మార్పు రావచ్చు, అభిప్రాయాలు మారిపోవచ్చు. జగన్ మీద గంపెడాశలు పెట్టుకున్న ప్రజలు అవి నెరవేరకపోతే మాత్రం తీవ్రమైన అసంతృప్తికి లోను అవుతారు. ఆనాడు చంద్రబాబు ఖజానా ఖాళీ చేశాడనో, కేంద్రం సాయం చేయలేదనో చెబితే ఎవరూ వూరుకోరు. ఇప్పటికైతే జగన్ మీద చాలా వరకూ మోజు ఉంది కాబట్టి జనం జై కొట్టి ఉండొచ్చు. ఎల్ల కాలం ఒకే తీరుగా ఉండదు. ఇది జగన్, ఆయన పార్టీ గుర్తుపెట్టుకోవాలి. హామీల విషయంలో జగన్ ఎలా నెరవేరుస్తారన్నది తలపండిన రాజకీయ పండితులతో పాటు ఆర్థికవేత్తలకు పెద్ద సందేహంగా ఉంది. సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు లాంటి వారు జగన్ పాలన బాగుందని అంటూనే కేంద్రం సహాయం బాగా చేయాలని అన్నారు. మరి జగన్ ఆశలన్నీ మోడీ మీదనే పెట్టుకున్నారు. అపుడు కూడా సాయం అందకపోతే జగన్ ఇబ్బందులు పడతారు. కానీ అలాంటి వేళ కూడా జగన్ ని, ఆయన పరిస్థితులను అర్ధం చేసుకుని మేము మీ వెంటేనని ఇదే ప్రజానీకం అంటే మాత్రం జగన్ ఎప్పటికీ బెస్ట్ సీఎం కిందనే లెక్క. చూడాలి మరి.

Tags:    

Similar News