ఎన్టీయార్ సెంటిమెంట్ రిపీట్ ?

దేశంలో జమిలి ఎన్నికలు వస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న చర్చ సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అంచనాలు అయితే పొరపాటునో గ్రహపాటునో జగన్ ని [more]

Update: 2021-01-23 13:30 GMT

దేశంలో జమిలి ఎన్నికలు వస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న చర్చ సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అంచనాలు అయితే పొరపాటునో గ్రహపాటునో జగన్ ని జనం నెత్తిన పెట్టుకున్నారని ఉంది. మరో సారి కనుక జనం చేతికి ఓటు హక్కు ఇస్తే మాత్రం కచ్చితంగా తప్పును దిద్దుకుంటారని అతి నమ్మకంతోనే ఆయన ఉన్నారు. అయితే జగన్ మీద కేవలం మోజుతోనే ప్రజలు ఓటు చేశారా, మరేమీ చూడలేదా అన్న చర్చ కూడా ఉంది. జగన్ అంటే ఒక వ్యక్తి అని చంద్రబాబు నేటికీ అనుకోవడం వల్లనే ఇలాంటి అంచనాలకు వస్తున్నారు అని కూడా విశ్లేషిస్తున్నారు.

వైసీపీకి స్ట్రాంగ్ బేస్…

జగన్ వైఎస్సార్ కుమారుడి హోదా నుంచి ఒక బలమైన రాజకీయ నేతగా చాలా కాలం క్రితమే ఎదిగారు. 2012 ఎన్నికల్లో మాత్రమే వైస్సార్ సానుభూతి కార్డు జగన్ కి పనిచేసింది. 2014 నుంచి జగన్ సొంత వ్యూహాలు ఆయన రాజకీయ దీక్షాదక్షతలే వైసీపీ గెలుపు ఓటములకు కారణం అవుతున్నాయి. ఇక ఇపుడున్న జనరేషన్ కి వైఎస్సార్ అంటే జగన్ తండ్రి అని మాత్రమే తెలుసు. అందువల్ల జగన్ తనకంటూ సొంత ఇమేజ్ తోనే ఇపుడు శక్తివంతమైన నేతగా ఏపీ రాజకీయాల్లో ఆవిర్భవించారు అనుకోవాలి. ఇక జగన్ కి తండ్రి వారసత్వంతో పాటు కాంగ్రెస్ వారసత్వం కూడా ఉంది. ఆ పార్టీకి ఉన్న బలమైన‌ పునాది కూడా జగన్ వెంట గట్టి ఓటు బ్యాంక్ గా వచ్చింది.

నమ్మకం ఉందా…?

జగన్ కి ఓటేసిన జనాలు పూనకంతో వేశారు అని బాబు అంచనా కడుతునారు. అది కూడా తప్పు అని అంటున్న వారూ ఉన్నారు. జగన్ మీద ఒక విశ్వాసంతోనే జనాలు ఓటు వేశారు. అంతే కాదు ఆయనకు పార్టీ పెట్టిన మొదటి సారే అధికారం అప్పగించలేదు. పదేళ్ల పాటు జగన్ ని పరీక్షించిన మీదటనే 2019 ఎన్నికల్లో పగ్గాలు అందించారు. ఇక జగన్ సంక్షేమ పధకాలు ఎంత లేదనుకున్నా ఊరకే పోవు అన్న మాట కూడా ఉంది. ఇక అయిదేళ్ల పాటు జగన్ పాలన పూర్తి చేస్తే చివరి ఏడాది ఆయన సర్కార్ మీద యాంటీ ఇంకెంబెన్సీ పెరిగే చాన్స్ ఉంది. హఠాత్తుగా జమిలి ఎన్నికలు వస్తే మాత్రం జగన్ కే లాభం అన్న విశ్లేషణ కూడా ఉందిపుడు.

సానుభూతి ఉంటుందా…?

అప్పట్లో అంటే 1983లో అధికారంలోకి వచ్చిన ఎన్టీయార్ కేవలం ఏడాదిన్నరకే వెన్నుపోటు కారణంగా పవర్ పోగొట్టుకున్నారు. దాంతో సానుభూతి వెల్లువలా వచ్చి ఆయన 1985లో రెండవ మారు అంతకంటే ఎక్కువ సీట్లు గెలిచి సీఎం అయ్యారు. ఇపుడు జగన్ కి కూడా ఈ తరహా సానుభూతి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయిదేళ్ల పాటు జగన్ కి పాలించమని జనం ఓటేశారు. మధ్యలో కేంద్రం జమిలి ఎన్నికలను తెస్తే ఏపీలో కొత్తగా రాజకీయం ఏమీ మారదు అన్న చర్చ కూడా ఉంది. పైగా జగన్ అధికారానికి కేంద్రం కత్తెర వేసిందన్న సానుభూతి కూడా వర్కౌట్ అయి మరోమారు సీఎం అయ్యేందుకు జనం ఓటెత్తుతారని కూడా అంటున్నారు. ఇక 151 సీట్లతో 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వస్తే 2022 జమిలి ఎన్నికలు జరిగితే కాస్తా అటూ ఇటూగా సీట్లు దక్కి మళ్లీ వైసీపీకే పట్టం కట్టినా ఆశ్చర్యం లేదని రాజకీయం తెలిసిన వారు అనే మాటగా ఉంది.

Tags:    

Similar News