ఆ ఒక్క హామీని మాత్రం జగన్ వదిలేస్తారట

ఆంధ్రప్రదేశ్ లో మద్యనిషేధం అమలు పర్చడం సాధ్యమవుతుందా? జగన్ తన పాదయాత్ర లో ిఇచ్చిన హామీల్లో దీనిని మాత్రం వదిలేస్తారా? అంటే ప్రభుత్వ వర్గాలే అవునని అంటున్నాయి. [more]

Update: 2021-01-22 14:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో మద్యనిషేధం అమలు పర్చడం సాధ్యమవుతుందా? జగన్ తన పాదయాత్ర లో ిఇచ్చిన హామీల్లో దీనిని మాత్రం వదిలేస్తారా? అంటే ప్రభుత్వ వర్గాలే అవునని అంటున్నాయి. జగన్ తన పాదయాత్రలో మద్యనిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. దశల వారీగా మద్యనిషేధాన్ని చేస్తామని చెప్పారు. మ్యానిఫేస్టోలో కూడా మద్యనిషేధం గురించి చెప్పారు. ఆదాయం కోసం చూడనని, ప్రజారోగ్యం, పేద కుటుంబాల నుంచి మద్యం మహమ్మారి నుంచి తరమేస్తానని జగన్ ప్రకటించారు.

అధికారంలోకి వచ్చి రెండేళ్లు…..

జగన్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లవుతుంది. పాదయాత్రలో ఇచ్చిన హామీలతో పాటు మ్యానిఫేస్టో లో ఉన్న అంశాలను కూడా అమలు చేస్తున్నారు. రెండేళ్లుగా హామీల అమలుకే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. అయితే మద్యనిషేధం విషయంలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం దుకాణాలన్నింటినీ ప్రభుత్వ అధీనంలోకి తెచ్చుకున్నారు. అప్పటి వరకూ మద్యం దుకాణాలు టీడీపీ నేతల చేతుల్లో ఉండటంతో దీనిని రాజకీయ కోణంలోనే చూడాలి.

రాజకీయ కోణంలోనే….

ప్రభుత్వ మద్యం దుకాణాలే ఇప్పుడు ఏపీలో ఉన్నాయి. షాపులు, బార్ల సంఖ్య కొంత తగ్గించారు. కానీ మద్య నిషేధంలో భాగంగా దశల వారీ చర్యలకు జగన్ ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. కరోనా వంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో మునిగిపోవడంతో మద్యం ఆదాయమే ప్రధాన వనరుగా మారింది. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా ఆగడం లేదు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం ఏపీలోకి వస్తూనే ఉంది.

సరిహద్దులున్న రాష్ట్రం….

ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినా ఫలితం లేదు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా రాష్ట్ర సరిహద్దులు ఉండటంతో ఏపీలో మద్యనిషేధం సాధ్యం కాదన్నది అందరికీ తెలిసిందే. ఇటీవల ఆర్థిక శాఖ అధికారులు సయితం మద్య నిషేధంపై పునరాలోచించుకోవాలని జగన్ కు సూచించినట్లు తెలుస్తోంది. మద్యం ద్వారా ఆదాయం లేకపోతే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని చెబుతున్నారు. బీహార్ రాష్ట్ర పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్ కు ఇటీవల వివరించినట్లు తెలిసింది. జగన్ మాత్రం మద్య నిషేధం అమలు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఎన్నికలకు ముందు జగన్ ఆ నిర్ణయం తీసుకునే అవకాశముంది. అంతే తప్ప ఈ హామీ ఇప్పట్లో మాత్రం అమలు కాదన్నది వాస్తవం.

Tags:    

Similar News