బాబుకు కావాల్సిందదే… జగన్ అదే చేస్తున్నారా?

సహనం కోల్పోకుండా ఉండటమే రాజకీయ నాయకుల ముఖ్య లక్షణం. అధికారంలో ఉన్న నాయకులకు ఇది మరింత అవసరం. గతంలో చంద్రబాబు నుంచి బీజేపీని విడదీసేందుకు వైసీపీ చేసిన [more]

Update: 2021-01-20 05:00 GMT

సహనం కోల్పోకుండా ఉండటమే రాజకీయ నాయకుల ముఖ్య లక్షణం. అధికారంలో ఉన్న నాయకులకు ఇది మరింత అవసరం. గతంలో చంద్రబాబు నుంచి బీజేపీని విడదీసేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తడానికి దాదాపు రెండున్నరేళ్ల సమయం పట్టింది. ఇందులో విజయసాయిరెడ్డి ప్రధాన పాత్రను అప్పట్లో పోషించారంటారు. విజయసాయిరెడ్డిని ప్రధాని కార్యాలయానికి తరచూ అనుమతించడంతోనే చంద్రబాబులో అసహనం బయలుదేరిందని చెబుతారు. ఇప్పుడు జగన్ కూడా అదే అసహనంలో ఉన్నట్లు కనపడుతుంది.

ఇద్దరినీ విడదీస్తే…..?

బీజేపీ నుంచి జగన్ ను విడదీయాలి. వారిద్దరి మధ్య సంబంధాలు తెగితేనే కొంత కట్టడి చేయవచ్చు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే చంద్రబాబు ఆలోచన ఇదే. అందుకే ఆయన తన పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపారంటారు. అంతేకాదు రాజ్యసభలో పార్టీని కూడా విలీనం చేసినా కిమ్మనకుండా ఉండటం బీజేపీతో దోస్తీ కోసమే. కానీ జగన్ నుంచి బీజేపీని విడదీస్తేనే చంద్రబాబుకు కమలంతో దోస్తీకి సులువవుతుంది.

జగన్ లో అసహనం తలెత్తేలా?

అందుకే చంద్రబాబు జగన్ లో అసహనం తలెత్తేలా కార్యక్రమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. రామతీర్థం చంద్రబాబు వెళ్లడానికి కారణం ఇదేనంటున్నారు. ఒక్క బీజేపీ మాత్రమే ఉద్యమిస్తే జగన్ కు చురుకు తగలదు. తాను కూడా రంగంలోకి దిగితే అప్పుడు జగన్ లో కొంత చలనం వస్తుంది. ఇదీ చంద్రబాబు ఆలోచన. దాని ప్రకారమే తానే హిందుత్వానికి సింబల్ నంటూ కార్యక్రమాలను చేపట్టారు చంద్రబాబు. దళిత ఓటు బ్యాంకు గురించి కూడా చంద్రబాబు ఆలోచించలేదు. ఆయన మైండ్ మొత్తం జగన్ నుంచి బీజేపీని వేరు చేయడమే.

బాబు లెక్క తప్పలేదే?

చంద్రబాబు లెక్క తప్పలేదు. ఇప్పుడిప్పుడే జగన్ లో అసహనం మొదలయింది. ఎన్నడూ నేరుగా బీజేపీని విమర్శించని జగన్ దానిపై మండిపడుతున్నారు. రాష్ట్రంలో వరసగా జరుగుతున్న దేవాలయాలపై దాడుల వెనక ఎవరున్నారన్నది అందరికీ తెలుసునన్నారు. రధాలను తగలబెట్టిన వారే రథయాత్రకు సిద్ధమయ్యారన్నారు. బీజేపీ త్వరలో రథయాత్ర చేయాలని నిర్ణయించడంతోనే జగన్ ఈ వ్యాఖ్యలు చేశారంటున్నారు. రానున్న కాలంలో బీజేపీ పై మరింత దూకుడుగా జగన్ వెళ్లే అవకాశముంది. చంద్రబాబుకు కావాల్సింది కూడా అదే. జగన్ దూరమైతే తాను దగ్గరవ్వాలన్న చంద్రబాబు కోరిక ఫలించే రోజు ఎంతో దూరం లేనట్లే కనపడుతుంది.

Tags:    

Similar News