వారు కూడా శత్రువులేనా?

జగన్ అధికారంలో ఆరు నెలలుగా ఉన్నారు కానీ అంతకు ముందు పదేళ్ళ పాటు విపక్షంలో ఉన్నారు. అపుడు కూడా మిగిలిన ప్రతిపక్ష పార్టీల నుంచి జగన్ కి [more]

Update: 2019-12-24 02:00 GMT

జగన్ అధికారంలో ఆరు నెలలుగా ఉన్నారు కానీ అంతకు ముందు పదేళ్ళ పాటు విపక్షంలో ఉన్నారు. అపుడు కూడా మిగిలిన ప్రతిపక్ష పార్టీల నుంచి జగన్ కి ఏ విషయంలోనూ మాట మాత్రమైన సాయం అందలేదు. వారంతా తెర ముందూ వెనకా అధికార పార్టీకే మద్దతుగా నిలబడి రాజకీయాలు చేశారు. ఇక బీజేపీ వరకూ చూసుకుంటే తనదైన రాజకీయం కోసం జగన్ ని నాడు పెద్దగా ఏమీ అనకపోయినా అసలూ వడ్డీ అన్నీ కూడా కలిపేసి మరీ ఎన్నికల తరువాత తీర్చేసుకుంటోంది. పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. ఆయన జగన్ ని ఎపుడూ మంచిగా చూడలేదని విశ్లేషకులే చెబుతారు. ఇక తనను జైల్లో పెట్టించినది చంద్రబాబు అని నమ్ముతున్న జగన్ టీడీపీని సాటి రాజకీయ పక్షంగా ఎలా చూడగలుగుతారు.

చిత్రమైన రాజకీయమే…?

జగన్ ఏ నిర్ణయం తీసుకున్న సమర్ధించే మాట పక్కన పెట్టి కాకి గోల పెట్టడమే విపక్షం పనిగా ఉందని ఎపుడో వైసీపీ నేతలు తేల్చేశారు. ఈ విషయంలో కుడి ఎడమల తేడా అసలు లేదు. అమరావతిలో రాజధాని ఉండాలని సీపీఐ నారాయణ అంటే మాదీ అదే డిమాండ్ అని కమలధాని కన్నా లక్ష్మీనారాయణ సులువుగా వంత పాడుతున్నారు. అంటే ఏ విషయంలోనూ అసలు కలవని ఈ రెండు పార్టీలకు జగన్ పేరు చెప్పగానే ఒక్కటే స్వరం బయటకు రావడం గమ‌నించాల్సిన విషయమే.

బాధాకరమేనా…?

ఇక ఒక ముఖ్యమంత్రిగా జగన్ తొలి పుట్టిన రోజు జరుపుకుంటే ప్రధాని సహా కేంద్ర మంత్రులు ఆయనకు అభినందనలు తెలిపారు. కానీ తెలుగు రాజకీయాల్లో ఒక్క లోకేష్ తప్ప ఎవరూ నోరు విప్పలేదంటేనే రాజకీయం దాటి కధ ఎక్కడికో వెళ్ళిపోయిందని అందరికీ అర్ధమబుతోంది. అంటే మామూలు పలకరింపులు, మర్యాదలు కూడా లేనంత ద్వేష రాజకీయాలు రాష్ట్రంలో నడుస్తున్నాయన్నమాట. బహుశా ఇటువంటివన్నీ కూడా దృష్టిలో ఉంచుకునే జగన్ ప్రతిపక్ష పార్టీలను శత్రువులుగా పేర్కొంటున్నారు. అనంతపురం జిల్లా టూర్లో జగన్ శత్రువుల చర్యలను గమనించాలని ప్రజలను కోరడం గమనార్హం. వారు స్వార్ధ రాజకీయాలు చేస్తున్నారని కూడా ఆయన అంటున్నారు.

తమిళ సీన్లు…..

ఏపీలో రాజకీయాలు లేవు, విధానాలు అంతకంటే లేవు. ఎంతసేపూ శత్రువుల మాదిరిగానే ఒకరిని ఒకరు రాజకీయ తెర మీద నుంచి తొలగించాలనుకోవడమే కనిపిస్తోంది. ఏపీలో సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు చంద్రబాబు వంటి వారే బస్తీ మే సవాల్ అంటూ రంగంలోకి దిగాక మిగిలిన వారూ అదే బాటన పడితే తప్పేముందన్న విశ్లేషణలు ఉన్నాయి. మొత్తానికి అరవ రాజకీయం ఆంధ్ర నాట పాతుకుపోయిందని అంటున్నారు. ఇది శ్రుతి మించిపోతోంది, ఎక్కడికి వెళ్తుందో చూడాలి మరి.

Tags:    

Similar News