జగన్ మంచి స్కీమర్… బాబు అమాయకుడు…?

ఇది నిజమేనా. జగన్ కంటే కూడా చంద్రబాబు అమాయకుడా. రాజకీయం ఎత్తులు ఏవీ తెలియని వాడా. జగన్ తో పోలిస్తే బాబు అనుభవం కొన్ని దశాబ్దాలు అధికం. [more]

Update: 2021-01-19 03:30 GMT

ఇది నిజమేనా. జగన్ కంటే కూడా చంద్రబాబు అమాయకుడా. రాజకీయం ఎత్తులు ఏవీ తెలియని వాడా. జగన్ తో పోలిస్తే బాబు అనుభవం కొన్ని దశాబ్దాలు అధికం. ఆయన బుర్ర పాదరసం అంటారు. వ్యూహాలు రూపొందిస్తే తిరుగులేదు అని కూడా చెబుతారు. మరి జగన్ ముందు చంద్రబాబు ఎత్తులు పారవా. దానికి జగన్ ఈ తరం ప్రతినిధిగా ఉండడం కారణమా. లేక బాబు కంటే నాలుగు అడుగులు ముందే ఆలోచనలు చేసే తత్వమా. ఏది ఏమైనా ఈ ఇద్దరినీ బాగా సన్నిహితంగా చూసిన మాజీ ఎంపీ సబ్బం హరి మాత్రం జగనే తెలివైన వాడు అంటున్నారు.

ఏడాది ముందుగానే….

కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన సబ్బం హరి వైఎస్సార్ మరణాంతరం జగన్ వైపు వచ్చారు. జగన్ జైలు జీవితంలో ఉంటే వెన్నంటి అట్టిపెట్టుకున్న అతి కొద్ది మందిలో సబ్బం హరి ఒకరు. అలాంటి హరికి జగన్ గురించి పూర్తిగా తెలుసు. చిన్న తేడా వచ్చి 2014 ఎన్నికల ముందు వైసీపీ ఆయన్ని బహిష్కరించింది. ఆ తరువాత నుంచి జగన్ అంటే మండిపోతారు సబ్బం హరి. జగన్ ప్రస్థావన లేకుండా ఆయన మీడియాతో అసలు మాట్లాడరు. తాజాగా ఆయన ఒక మీడియాతో మాట్లాడుతూ జగన్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. జగన్ మంచి స్కీమర్ అంటూ కితాబు ఇచ్చారు. ఆయన ఏడాది తరువాత జరగబోయే పరిణామాలను కూడా దృష్టిలో ఉంచుకుని మరీ తన యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటారని హరి చెప్పడం విశేషమే.

బాబు అమాయకుడు…

ఇక జగన్ తో పోలిస్తే కొన్ని విషయాల్లో బాబు అమాయకుడు అని సబ్బం హరి పోలిక పెట్టి మరీ చెప్పారు. అమరావతి రాజధాని సచివాలయానికి ఉద్యోగులు హైదరాబాద్ నుంచి రావాలంటే వారిని బతిమాలుకుని తాయిలాలు ఇచ్చి మరీ బాబు రప్పించారని హరి చెప్పుకొచ్చారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్ళు వేయించడమే కాదు, అయిదు రోజుల పని దినాలు కూడా మంజూరు చేశారని గుర్తు చేశారు. అదే జగన్ విశాఖ రాజధాని అనగానే ఆయన కంటే ముందే ఉద్యోగులు మేము రెడీ అంటున్నారంటే జగన్ ఉద్యోగ సంఘాల నేతలతో సాగించిన సాన్నిహిత్యానికి నిదర్శనంగా దాన్ని చెప్పుకోవాలని హరి అంటున్నారు.

అన్నింటా వారేనా…?

జగన్ ముఖ్యమంత్రి కాగానే కీలకమైన స్థానాల్లో తన వారిని పెట్టుకున్నారని, అందువల్ల ప్రభుత్వానికి ఏ ఇబ్బంది కలిగినా వారు వెంటనే రియాక్ట్ అవుతారని హరి అంటున్నారు. అదే చంద్రబాబుకు ఇలాంటి విషయాల్లో పెద్దగా ఆసక్తి లేదని, అందుకే ఆయన మీద విమర్శలు నాడు జగన్ చేసినా ఒక్క పార్టీ తప్ప డిఫెండ్ చేసే ఇతర వ్యవస్థలు లేకుండా పోయాయని హరి అంటున్నారు. సరే హరి పరిశీలనలో బాబు జగన్ ల మధ్య ఈ రకమైన తేడా ఉండవచ్చు. కానీ ఏ నాయకుడికి అయినా కాలం కలసి వస్తే వ్యూహాలు అవే పారుతాయి. లేకపోతే ఆ పధకాలే బూమరాంగ్ అవుతాయి. జగన్ మంచి స్కీమర్ అని హరి అన్నా బాబు అమాయకుడు అని చెబుతున్నా కూడా ఎవరికి వారు తమ ఆలోచనలు మాస్టర్ ప్లాన్లు లేకుండా ఇంతటి నాయకులు కాగలిగారా అన్నదే ఇక్కడ ప్రశ్న.

Tags:    

Similar News