అదే జరిగితే మంచి రోజులు వచ్చినట్లే ?

వైసీపీకి చేతిలో అధికారం ఉంది. జమిలి ఎన్నికలు కనుక జరగకపోతే మరో మూడేళ్ల కాలం నికరంగా ఉంది. అయితే ఆ అధికారాన్ని అందించిన పార్టీ పరిస్థితి చూస్తే [more]

Update: 2021-01-15 14:30 GMT

వైసీపీకి చేతిలో అధికారం ఉంది. జమిలి ఎన్నికలు కనుక జరగకపోతే మరో మూడేళ్ల కాలం నికరంగా ఉంది. అయితే ఆ అధికారాన్ని అందించిన పార్టీ పరిస్థితి చూస్తే నమ్ముకున్న నేతలు పరేషాన్ అవాల్సిందే. నా పార్టీ అనుకుని పనిచేసిన వారు ఇపుడు పూర్తిగా సైడ్ అయిపోయారు. జగన్ సీఎం కావాలనుకుని రాత్రీ పగలు ఒళ్ళొంచి కష్టపడిన వారు కంప్లీట్ గా రిలాక్స్ అయ్యారు. దానికి వారికి పార్టీలో సరైన ఆదరణ దక్కకపోవడం ప్రధాన కారణం. అయితే జగన్ ముఖ్యమంత్రిగా బిజీగా ఉండడం వల్లనే పార్టీని అసలు పట్టించుకోవడంలేదు. దాంతో క్యాడర్ చెల్లాచెదురైంది.

రిపేర్లు ఖాయం….

జగన్ కి అటు పార్టీ ఇటు ప్రభుత్వం తలకు మించిన భారమే అయినప్పటికీ రంగంలోకి దిగకతప్పడంలేదు అంటున్నారు. పార్టీని గాడిన పెట్టుకోకపోతే ఉన్న అధికారం ఆవిరి అయిన తరువాత మళ్ళీ కొత్త ఊపిరులూదే సీన్ ఉండదు అన్నది జగన్ కి బాగానే బోధపడింది. సార్వత్రిక ఎన్నికలకు ఎంత సమయం ఉంది అన్నది ఆలోచిస్తే జమిలి గుబులు కూడా పార్టీలో ఉంది. ఒక వేళ అయిదేళ్ల అధికారానికి కత్తెర పడి అర్ధమధ్యంగా ఎన్నికలు ముంచుకు వస్తే పార్టీ సీన్ ఏంటన్నది కూడా తలచుకునే జగన్ ఫ్యాన్స్ రెక్కలు సరిచేసే పనిలో పడ్డారని అంటున్నారు.

అటు వారిని ఇటుగా….

పార్టీలో పదవులు పొందిన వారు సరిగ్గా పనిచేయడంలేదు. మంత్రులుగా నియమితులు అయిన వారిలో అనేకులు పెద్దగా రాణించడంలేదు. దాంతో మంత్రులను కొందరిని పార్టీ బాధ్యులను చేయడానికి జగన్ మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు. ఆ విధంగా పార్టీలో కూడా సామాజిక న్యాయం పాటించడంతో పాటు, ప్రభుత్వంలో కొత్త వారిని మంత్రులుగా తీసుకునేందుకు వెసులుబాటు దొరుకుతుంది అని జగన్ ఆలోచిస్తున్నారుట. ఇక పార్టీలో కష్టించి పనిచేసేవారిని గుర్తించి నామినేటెడ్ పదవులు ఇవ్వడం, కీలకమైన పార్టీ బాధ్యతలు అప్పగించడం వంటి కసరత్తులు చేయడానికి కూడా జగన్ రెడీ అవుతున్నారని అంతున్నారు.

నాలుగేళ్ళ తరువాత …

పార్టీలో పదవులు అందుకున్న వారు కూడా ప్రస్తుతం తాము నిర్వహిస్తున్న బాధ్యతల హోదా గురించి మరచిపోయారు. మరో వైపు చూస్తే పార్టీ ప్లీనరీ జరిగి 2021 నాటికి నాలుగేళ్ళు అవుతోంది. 2017న జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్లీనరీని ఆర్భాటంగా నిర్వహించారు. అదే ఇప్పటికి చివరిది. ఇక నాడు జగన్ మహా పాదయాత్ర అజెండాను కూడా ప్లీనరీ రూపొందించింది. జగన్ కి అధికారం అందుకునేలా నాటి ప్లీనరీ అస్త్రాలను ప్రోది చేసి పెట్టింది. ఆ తరువాత ఏడాదిన్నర పాటు పాదయాత్ర. ఆ మీదట అధికారంలోకి రావడంతో జగన్ పార్టీ ప్లీనరీని నిర్వహించాలన్నది పూర్తిగా మరచిపోయారు. ఇపుడు అంటే ఈ ఏడాది జూలై 8 న వైఎస్సార్ జయంతి వేళ ఘనంగా ప్లీనరీని నిర్వహించడానికి పార్టీ సమాయత్తం అవుతోందని సమాచారం. ఈ ప్లీనరీని విశాఖలో నిర్వహించడం ద్వారా పొలిటికల్ క్యాపిటల్ కూడా తమకు విశాఖే అని జగన్ చెప్పదలచుకున్నారు. ఈ ప్లీనరీ తరువాత పార్టీ పరుగులు తీయడం ఖాయమని అంటున్నారు. అదే జరిగితే వైసీపీకి మంచి రోజులు వచ్చినట్లే.

Tags:    

Similar News