రెస్ట్ మూడ్ లో మంత్రులు… జగన్ ఒక్కడేనా ?

ఓ వైపు విద్వంస రాజకీయాలతో ఏపీ అట్టుడిగిపోతోంది. నిజానికి అలాంటి పెద్ద సంఘటనలు ఏవీ జరగలేదు కానీ విపక్షం రచ్చ రాద్ధాంతం ఆ రేంజిలో ఉంది. దానికి [more]

Update: 2021-01-13 12:30 GMT

ఓ వైపు విద్వంస రాజకీయాలతో ఏపీ అట్టుడిగిపోతోంది. నిజానికి అలాంటి పెద్ద సంఘటనలు ఏవీ జరగలేదు కానీ విపక్షం రచ్చ రాద్ధాంతం ఆ రేంజిలో ఉంది. దానికి తోడు టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు, ఏపీలో ఏదో జరిగిపోతున్నట్లుగా కధనాలు అల్లుతున్నారు, కలరింగ్ ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో జగన్ ప్రభుత్వం కచ్చితంగా డిఫెన్స్ లో పడుతోంది. మరి సర్కార్ తరఫున బాధ్యత తీసుకుని మాట్లాడే మంత్రులు ఉన్నారా అంటే బూతద్దంలో వెతకాల్సిందే.

రెండు పదులకు పైబడి….

ఏపీలో జగన్ ప్రభుత్వంలో పాతిక మంది దాకా మంత్రులు ఉన్నారు. వీరిలో నలుగురైదుగురు తప్ప మిగిలిన వారు ఎందుకో అసలు నోరు అసలు విప్పడంలేదు. తమ జిల్లాలో రచ్చ జరుగుతున్నా కూడా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పుష్ప శ్రీవాణి మౌనమే నా భాష అంటున్నారు. అలాగే బొత్స సత్యనారాయణ వంటి వారు కూడా పూర్తిగా చొరవ తీసుకోలేకపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మంత్రి సీదరి అప్పలరాజు అయితే ఉలుకూ పలుకూ లేదు. మంత్రి అవంతి శ్రీనివాస్ వంటి ఒకరిద్దరు మాత్రమే జరుగుతున్న వాటి మీద ఎప్పటికపుడు స్పందిస్తున్నారు.

ఆయన ఏరీ ఎక్కడా…?

ఇక ఏపీలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అని ఒకరు ఉన్నారా అన్న చర్చ అయితే వస్తోంది. ఆయన అసెంబ్లీలో కనిపించడమే తప్ప బయట అసలు మాట్లాడిన సందర్భమే ఈ మధ్యకాలంలోలేదు. రాయల సీమ జిల్లాలను ఈ మధ్య బీజేపీ టార్గెట్ చేసింది. మరో వైపు జేసీ బ్రదర్స్ కూడా రచ్చ చేస్తున్నారు. ఆయిన అతి కీలకమైన పోస్టులో ఉన్న బుగ్గన వంటి వారు ఎందుకో సైలెంట్ అయ్యారు. అదే విధంగా మిగిలిన మంత్రుల తీరు కూడా ఉంది. వీరంతా జగనే అంతా చూసుకుంటారు అని భావిస్తున్నారు తప్ప తమ ప్రభుత్వం మీద వస్తున్న బురదను తాము కూడా కడగాలని కనీసంగా ఆలోచించడంలేదు.

ఇలాగైతే కష్టమే…?

ఏపీలో మంత్రులు లిస్ట్ పెద్దగా ఉన్నా కూడా ప్రభుత్వానికి బాసటగా అర్ధవంతంగా మాట్లాడే వారు కరవు అయ్యారని మొదటి నుంచి విమర్శ ఉన్న మాట వాస్తవమే. ఇపుడు రెండేళ్ళకు జగన్ సర్కార్ చేరువ అవుతున్న నేపధ్యంలో మంత్రుల పనితీరు మరింతగా చర్చకు వస్తోంది. హోం మంత్రిగా మహిళను నియమించామని జగన్ గొప్పగా చెప్పుకున్నారు కానీ ఆమె పనితీరు మాత్రం పేలవంగా ఉందనే విమర్శలు ఆది నుంచి ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే ఈ మంత్రులతో మరో పది నెలల పాటు జగన్ వేగాల్సి ఉంది. ఇంతలో ఎన్ని రకాలైన విమర్శలు సర్కార్ ఎదుర్కొంటుందో కూడా చూడాలి.

Tags:    

Similar News