మంచోళ్లు కూడా ట్రాక్ తప్పుతున్నారే ?

వైసీపీ సర్కార్ ఏపీలో కొలువు తీరాక పాతిక మంది దాకా మంత్రులు వచ్చారు. ఇందులో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి నలుగురైదుగురిని పక్కన [more]

Update: 2021-01-12 12:30 GMT

వైసీపీ సర్కార్ ఏపీలో కొలువు తీరాక పాతిక మంది దాకా మంత్రులు వచ్చారు. ఇందులో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి నలుగురైదుగురిని పక్కన పెడితే అంతా కొత్త సరుకే. అందరూ తొలిసారి అమాత్య యోగం అనుభవిస్తున్న వారే. కొందరు అయితే జాక్ పాట్ కొట్టినట్లుగా ఇలా ఎమ్మెల్యే అయి అలా మంత్రి కూడా అయిన వారున్నారు. వీరందరి విషయంలో జగన్ తన పట్ల విధేయతతో పాటు సామాజిక సమీకరణల వరకే సరి చూసుకున్నారు అంతే. అలా మంత్రులైన వారు తమ మాటకు ఉన్న విలువ ఏంటో ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు.

ప్రభుత్వంలో ఉన్నారని…

సాధారణంగా ఒక ప్రజా ప్రతినిధి మాట్లాడే మాటలకు ఎంతో విలువ ఉంది. ప్రతీ మాట జనంలో రికార్డు అవుతుంది. అలాంటిది మంత్రి హోదాలో ఉన్న వారు ఎంత బాధ్యతగా ఉండాలి. వారి మాటలు ఎంత అదుపుగా పొదుపుగా ఉండాలి. కానీ వైసీపీ మంత్రులు పార్టీ నాయకుల మాదిరిగా మాట్లాడేస్తున్నారు. కొందరైతే శ్రుతి మించేస్తున్నారు. దూకుడుగా తాము మాట్లాడుతున్నామని అనుకుంటున్నారు. దానికి ముఖ్యమంత్రి జగన్ కూడా ఏమీ అనకపోవడంతో పోటీ బాగా పెరిగింది. ఆఖరుకు అలుగుటయే ఎరుగని ధర్మ రాజు అన్నట్లుగా ఉండే ధర్మాన కృష్ణ దాస్ కూడా ఒక సందర్భంలో చంద్రబాబు మీద మాట్లాడుతూ నోరు జారేశారు.

వ్యతిరేకత అలా…

ప్రభుత్వం అంటే కోట్లాది మంది ఎన్నుకున్నది. అందువల్ల అందరి కన్నూ ఉంటుంది. హామీలు నెరవేర్చడం వేరు. ప్రభుత్వం హుందాగా వ్యవహరించడం వేరు. వైసీపీ సర్కార్ హామీలను నెరవేరుస్తోంది. జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు. అవినీతి తగ్గింది. జవాబుదారీ తనం పెరిగింది. సచివాలయాల పుణ్యమాని పాలన గడప దాకా వచ్చింది. ఇవన్నీ ప్లస్ పాయింట్లే. కానీ వీటిని మించేలా మంత్రుల బూతు పురాణాలు, విపక్షాల మీద సవాళ్ళూ నోరు పారేసుకోవడాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత పెంచుతున్నాయి. అసలు ఇలాంటివి గతంలో విన్నామా కన్నామా అని జన సామన్యంలో మాట్లాడుకుంటూంటేనే సర్కార్ పట్ల ఎంతటి విరక్తి భావన ఉందో అర్ధమవుతోందిగా.

అదే కొలమానమా..

జగన్ మంత్రుల విషయంలో క్రెటేరియా ఏం పెట్టుకున్నారు అన్నది జనాలకు తెలియదు. కానీ మంత్రులు దూకుడు చూస్తూంటే ఎవరెంత రెచ్చిపోయి గట్టిగా మాట్లాడితే వారినే జగన్ మరో రెండున్నరేళ్ల పాటు మంత్రులుగా కొనసాగేలా అవకాశం ఇస్తారని భావిస్తున్నారులా ఉంది. జగన్ సైతం ఎపుడూ మంత్రుల తీరు పట్ల సమీక్షించి మందలించిన సూచనలు లేకపోవడంతో మంచి వారు కూడా ఇపుడు ట్రాక్ తప్పుతున్నారు. మరో ఆరు నెలలలో మంత్రి వర్గ విస్తరణ ఉండడంతో దూకుడు గా రాజకీయం చేసే వారికే బెర్తులు కన్ ఫర్మ్ అని టాక్ ఉందేమో. అందుకే ఇలా మరింతగా మంత్రులు చివరి రోజుల్లో నోరు చేస్తున్నారు అంటున్నారు. మొత్తానికి కొందరి మంత్రుల దూకుడు వల్ల అంతిమంతా నష్టపోయేది పార్టీతో పాటు, ప్రభుత్వం అని కూడా అన్న మాట సొంత పార్టీలోనే వినిపించడం విశేషం.

Tags:    

Similar News